రెండున్నర దశాబ్దాల క్రితం పుష్కరాల కారణంగా భక్తులతో కిటకిటలాడిపోతోంది విజయవాడలోని కృష్ణానది. అంతలోనే ఓ మహిళ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన భర్త నది ప్రవాహంలో కొట్టుకపోయాడని తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా గల్లంతైన ఆమె భర్త కోసం కృష్ణ నదిని జల్లెడ పట్టారు. అతని ఆచూకి దొరకకపోవడంతో శవం తేలుతుందని భావించారు. కానీ ఒకటి రెండు రోజుల్లోనే అసలు కథ బయటపడింది. బీమా సొమ్ము కోసం భార్యా భర్తలు ఆడిన నాటకమని, అతను చనిపోయినట్టుగా నటిస్తే ఇన్సూరెన్స్ నగదు చేతికి వస్తుందని ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు. పోలీసులు ఈ విషయంపై పలు కోణాల్లో దర్యాప్తు చేసి గుట్టు రాబట్టడంతో తెలుగు నాట రక్తికట్టించిన ఈ డ్రామను తెరదించారు. సరిగ్గా ఇదే లక్ష్యంతో భీమా సొమ్ము కోసం మర్డర్ ప్లాన్ చేసి అడ్డంగా దొరికిపోయారు… ఆ దంపతులు. తెలంగాణాలోని మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది అలాంటి ఘటనే. అయితే ఇక్కడా పోలీసులు సాంకేతికత ఆధారంగా ఆ భార్యాభర్తల నాటకానికి బ్రేకులేశారు.
అసలేం జరిగిందంటే…
తెలంగాణ సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్న ధర్మ ఆధర్మంగా డబ్బు సంపాదించాలని స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయాడు. ఈనెల 9న మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురం వద్ద కారు దగ్దం అయింది. ఇందులో ఓ మృతదేహం కూడా ఉండడంతో సజీవదహనం ఘటన చోటు చేసుకుంది. కారు ఆధారంగా సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మ ఈ ప్రమాదంలో మరణించాడని అందరూ భావించారు. హైదరాబాద్ సెక్రటేరియేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ధర్మ భార్య నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుని భార్యే ఫిర్యాదు చేయడంతో ధర్మ చనిపోయాడని భావించినా… పోలీసులను అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. మృతదేహాన్ని పరిశీలించిన భార్య, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆ శవం ధర్మదేనని నమ్మించారు. అయితే పోలీసు అధికారులు మాత్రం తమ మెదళ్లకు పని చెప్పి అసలు విషయాన్ని రాబట్టారు. సంఘటనా స్థలంలో లభించిన పెట్రోల్ డబ్బా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి… ధర్మ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా వాకబు చేయడం మొదలు పెట్టారు. మృతుడు ధర్మ జీవించే ఉన్నాడని గుర్తించిన పోలీసులు అతన్ని గోవాలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు తరలించి పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కారులో లభ్యమైన శవం అతని డ్రైవర్ దని, హతమార్చి కారులో ఉంచి సజీవ దహనం డ్రామా ఆడానని ధర్మ పోలీసులకు చెప్పినట్టు సమాచారం.
ట్రాక్ రికార్డ్….
బెట్టింగులు రాష్ట్ర సచివాలయంలో దర్జాగా ఉద్యోగం వెలగబెడుతున్న ధర్మకు ఉన్న అధర్మపు పనులే ఈ దుస్సాహాసానికి ఒడిగట్టిటన్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. బెట్టింగులు, వ్యసనాలకు బానిసగా మారిన ధర్మ పెద్ద ఎత్తున అప్పులు చేసినట్టుగా తేలింది. ఈ బాధల నుండి విముక్తి కావాలంటే బీమా చేసి చనిపోయినట్టు నాటకం ఆడడమే ఏకైక మార్గమని భావించాడు.
స్కెచ్ భారీదే…
అయితే ధర్మ అతని కుటుంబ సభ్యులు కలిసి వేసిన స్కెచ్ కూడా పెద్దదే. ఇన్సూరెన్స్ పాలసీలు చేసిన ధర్మ మర్డర్ స్కెచ్ తో రూ. 7.5 కోట్లు కాజేసి ప్రశాంతంగా జీవించేయవచ్చని అనుకున్నారు. అప్పుల వారి బాధ నుండి విముక్తి కావడం, పెద్ద ఎత్తున డబ్బు చేతికి రావడం, ఉద్యోగం కూడా కుటుంబ సభ్యుల్లో మరోకరికి దక్కుతుందని అంచనాలు వేసుకుని కలల ప్రపంచంలో తేలియాడారు. కాని కాఖీలు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అసలు విషయాన్ని రాబట్టడంతో డామిట్ కథ అడ్డం తిరిగినట్టయింది. ధర్మ డెత్ సర్టిఫికెట్ తో పాటు ఇతరాత్ర ఫార్మాలిటీస్ కోసం అతని కుటుంబ సభ్యులు తిరుగుతున్న క్రమంలోనే అతని భార్య నిత్యం ధర్మతో ఫోన్లో మాట్లాడుతుండడంతో గుట్టు రట్టయింది. ఆమె మొబైల్ నెంబర్ పై నిఘా పెట్టడంతో ధర్మ గోవాలో, భార్య ఇంట్లో ఉండి నెట్ కోసం వర్కౌట్ చేశారు. కానీ పోలీసుల నెట్ వర్క్ ముందు వారి ఆటలు సాగలేదు.
రెండేళ్ల క్రితం ఇలాగే…
రెండేళ్ల క్రితం కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగిందిన అనుమానాస్పదంగా మృతి చెందిన ఓ పాలసీ హోల్డర్ కు ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లిస్తున్న క్రమంలో సంస్థ ప్రతినిధులకు అనుమానం రావడంతో నలుగురు నిందితులు పట్టుబడ్డారు. 2021 డిసెంబర్లో షాద్‌నగర్ సమీపంలోని ఫరూక్నగర్ మండలం మొగిలిగిద్ద శివార్లలో రోడ్డు ప్రమాదంలో భిక్షపతి అనే వ్యక్తి మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. భిక్షపతి పేరుపై హైదరాబాద్‌లో ఉన్న ఇల్లు దానిపై ఉన్న ఇన్సూరెన్స్ క్లైమ్ చేసేందుకు నామినిగా ఉన్న శ్రీకాంత్ కంపెనీకి వెళ్లాడు. పాలసీ డబ్బులు నామినీకి ఇచ్చే క్రమంలో ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకు అనుమానం రావడంతో షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. బోడ శ్రీకాంత్‌ను విచారించిన పోలీసులు లొగుట్టును వెలుగులోకి దీశారు. మర్డర్ చేసి యాక్సిడెంట్ గా క్రియేట్ చేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా ఇందులో ఎస్ఓటీలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మోతిలాల్ కూడా ఉండడం కొసమెరుపు.