ఆర్మూర్ లో కేటీఆర్ కు గాయాలు

విరిగిన ప్రచార రథం రెయిలింగ్

దిశ దశ, నిజామాబాద్:

అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో మరో అపశృతి చోటు చేసుకుంది. ఆర్మూర్ లో నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా రథంపై వెల్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు ఈ ప్రచార రథంపై ఉన్నారు. సిరిసిల్లలో నామినేషన్ వేసిన అనంతరం కేటీఆర్ ఆర్మూర్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లారు. గురువారం మద్యాహ్నం ప్రచార రథంపై వెల్తున్న క్రమంలో పార్టీ శ్రేణులు వాహనం సమీపంలోకి రావడంతో డ్రైవర్ సడన్ బ్రేకులు వేశారు. దీంతో ప్రచార రథం మీద నిలబడి వెల్తున్న బీఆర్ఎస్ నాయకులు అంతా ఒక్క సారిగా ముందుకు పడిపోయారు. ప్రచారం కోసం వాహానంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెయిలింగ్ అడ్డుగా ఉండడం వల్ల నాయకులు దాని మీదుగా ముందుకు వేలాడారు. లేనట్టయితే వాహనం ముందు భాగంలో రోడ్డుపై పడే అవకాశం ఉండేంది. ఈ ఘటనలో మంత్రి కేటీఆర్ కు స్వల్ప గాయం అయినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి కూడా ఈ ప్రచార రథంపైనే ఉన్నారు. ప్రచార రథం ముందు భాగంలోకి పార్టీ శ్రేణులు రానట్టయితే సడన్ బ్రేకు వేయాల్సిన అవసరం లేకుండా పోయేదని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. పార్టీ క్యాడర్ దండలు తీసుకుని రథం వద్దకు రావడం వల్ల వారిని సేఫ్ గా ఉంచాలని భావించిన డ్రైవర్ సడన్ బ్రేకు వేశాడని చెప్తున్నారు. రోడ్ షో కోసం వెల్తున్న ప్రచారం రథంపై ఉన్న మంత్రి కేటీఆర్ తో పాటు నాయకులు ఉన్న వాహనానికి అపశృతి ఎదురుకావడంతో బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యాయి. నాయకులకు అంతగా గాయాలు ఏమీ కాలేదని, అందరూ సేఫ్ గా ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న తరువాత అంతా ఊపిరి పీల్చుకున్నారు.

You cannot copy content of this page