దిశ దశ, హైదరాబాద్:
ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేరవేయడంలో తలమునకలయ్యే ఆర్టీసీ యంత్రాంగంపై దురుసుగా ప్రవర్తిస్తే వదిలిపెట్టేది లేదని సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు. విధులకు ఆటంకం కల్గించిన మహిళపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎల్ బి నగర్ పోలీసులకు ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేయగా నిందితురాలిని అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే… ఇటీవల హయత్ నగర్ వన్ డిపోకు చెందిన బస్సులో కండక్టర్లపై ఓ మహిళ దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. కండక్టర్ పై దాడికి కూడా పాల్పడిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో సదరు ఘటనపై ఆర్టీసీ అధికారులు ఎల్ బి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితురాలు సయ్యద్ సమీనా, పోలీసులు అంబర్ పేట నివాసి అని గుర్తించిన పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో నిందితురాలిని హాజరు పర్చగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.