పచ్చునూరు భూమి పంచాయితే హత్యకు కారణం…

9మంది నిందితుల అరెస్ట్… కత్తులు స్వాధీనం…

దిశ దశ, మానకొండూరు:

పచ్చూనూరు గ్యాంగ్ వార్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలోని భూమి విషయంలో వచ్చిన తగాదాలే హత్యకు కారణమైందని విచారణలో తేల్చారు. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులు ఉండగా… 9 మందిని అరెస్ట్ చేసినట్టు కరీంనగర్ రూరల్ ఏసీపీ వెకంట రమణ వివరించారు. మానకొండూరు సీఐ రాజ్ కుమార్ నేతృత్వంలో నిందితులను పట్టుకున్నామని వివరించారు. పోలీసుల కథనం ప్రకారం… మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన మద్దెల వెంకటేష్, బండి సాయిలకు మధ్య గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. గతంలో పలుమార్లు పంచాయితీ జరిగినప్పటికీ పరిష్కారం కాకపోవడంతో వీరు రౌడీషీటర్లను ఆశ్రయించారు.బండి సాయిలు గోపు ప్రశాంత్ రెడ్డిని ఆశ్రయించగా, మద్దలె వెంటకేష్ కు అనుకూలంగా నన్నెవేని రమేష్ అలియాస్ జానీ భాయ్ ని ఆశ్రయించారన్నారు. ఈ భూమి విషయంలో ప్రత్యర్థులుగా మారిన వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో పాటు గతంలో గాజు శంకర్ అనే వ్యక్తిని గోపు ప్రశాంత్ రెడ్డి కొట్టాడన్న విషయంతో గొడవ ముదిరింది. దీంతో నన్నెవేని రమేష్, గోపు ప్రశాంత్ రెడ్డిలు తరుచూ గొడవలకు పాల్పడుతుండడంతో పాటు ఒకరినొకరు బెదిరించుకునే వారు. దీంతో గోపు ప్రశాంత్ రెడ్డిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని లేనట్టయితే అతనితో తనకు తన కుటుంబానికి ప్రాణ హాని ఉంటుందని భావించిన జానీ భాయ్ అతన్నే చంపాలని నిర్ణయించుకున్నారు. ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం గోపు ప్రశాంత్ రెడ్డి కోసం వేట కొనసాగిస్తున్న జానీ భాయ్ గ్యాంగ్ ఈ నెల 28న మానకొండూరు మండలం ఊటూరులో ఉన్నట్టుగా సమాచారం అందుకున్నాడు. ఆ రోజు వేకువ జామున 5.30 గంటల ప్రాంతంలో ఊటూరుకు వెల్లిన జానీ గ్యాంగ్ గోపు ప్రశాంత్ రెడ్డిని వెంబడించి దారుణంగా కొట్టి గర్రెపల్లి సమీపంలోని మానేరు వాగు వద్ద హత్య చేశారు. ఈ ఘటనలో మొత్తం 13 మంది నిందితులు పాల్గొన్నారని వీరిలో 9 మందిని అరెస్ట్ చేశామని ఏసీపీ వెంకటరమణ వివరించారు. అరెస్ట్ అయిన వారిలో నన్నవేని రమేష్ అలియాస్ జానీ భాయ్, సాయి కృష్ణ అలియాస్ ఎస్ కె భాయ్, కురాకుల అనీల్, సర్దార్ కుల్దీప్ సింగ్ అలియాస్ కార్తీక్, పొన్నాల మనోహన్, ఏరుకొండ మహేష్, కొమ్మడవేని హరీష్, ఒడ్నల యజ్ఞేశ్ లను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న గాజు శంకర్, సుకే ఉదయ్ కుమార్ అలియాస్ చింటూ, మద్దెల వెంకటేష్, నన్నేవని భాగ్యలక్ష్మీలు పరారీలో ఉన్నారన్నారు. నిందితులపై ఐపీసీ 147, 148, 364, 302, 506, 201, 212, 109, 120బి రెడ్ విత్ 149 సెక్షన్లలో కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుల నుండి ఒక స్విఫ్ట్ కారు, మాడిఫైడ్ బ్లాక్ కలర్ జీప్, రెండు టూ వీలర్లు, ఆరు స్మార్ట్ ఫోన్లు, రెండు కత్తులను స్వాధీన పర్చుకున్నామని వివరించారు.

విచారణ కొనసాగుతోంది: ఏసీపీ

గోపు ప్రశాంత్ రెడ్డి హత్య కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకట రమణ తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి హత్యతో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. నిందితులందరికి శిక్ష పడేవిధంగా పకడ్భందీగా వ్యవహరిస్తున్నామని ఏసీపీ వెంకటరమణ వెల్లడించారు.

You cannot copy content of this page