విప్లవ ప్రాంతంలో పుట్టినా… విప్లవాత్మకమైన నిర్ణయంతో ముందుకు…

కాఖీ కావాలని బాల్యంలో నాటుకున్న బీజం

ఐపీఎంకు ఎంపికయిన వంగపల్లి బిడ్డ నరేష్ రెడ్డి

దిశ దశ, హుజురాబాద్:

రాజకీయ కార్యక్రమాల్లో తలమునకలయ్యే తండ్రి… ఎర్ర జెండాల పాటలతో హోరెత్తుతున్న పల్లెలు… నాలుగు దశాబ్దాల క్రితం ఆ ప్రాంతం పేరు చెప్పగానే ఉలిక్కిపడి చూసే పరిస్థితులు… అలాంటి విచిత్రమైన ప్రాంతంలో పుట్టిన ఆయన సాయుధుడిగానే జీవనం సాగిస్తున్నారు కానీ ఎంచుకున్న మార్గం మాత్రం వేరు. ఎర్ర జెండా ఎత్తి జై కొట్టడం సరికాదని… పోలీసు అధికారి అయితేనే సమాజాన్ని సన్మార్గంలో నడిపించవచ్చని భావించారాయన. నాన్న సర్పంచ్ గా ఉన్నప్పుడు ఇంటికి వచ్చే పోలీసు అధికారులను చూసిన ఆ చిరు మనసులో కాఖీ యూనిఫాం వేసుకోవాలన్న తపన  బలంగా నాటుకపోయింది. దీంతో విప్లవగీతాలకు ఆకర్షితుడై కామ్రేడ్ అనిపించుకోవడానికంటే కాఖీ యూనిఫాం వేసుకుని పోలీసు అనిపించుకోవడమే బెటర్ అనుకున్నారాయన.

వైవిద్యమైన పరిస్థితుల్లోనూ…

1991 బ్యాచ్ కు చెందిన పింగళి నరేష్ రెడ్డి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లికి గ్రామానికి చెందిన వారు. రెండున్నర దశాబ్దాలుగా గ్రామానికి సర్పంచ్ గా సేవలందించిన పింగలి పురుషోత్తం రెడ్డి, వసుమతి దంపతులకు జన్మించిన నరేష్ రెడ్డి వైవిద్యమైన పరిస్థితుల్లో ఎదిగారు. తండ్రికి ఉన్న పొలిటికల్ ఇమేజ్ కి ప్రభావితుడై ఖద్దరు బట్టలు వేసుకునేందుకు కానీ, అప్పుడు గ్రామాల్లో వేళ్లూనుకున్న రాడికల్ పోరాటాల వైపు కానీ ఆయన దృష్టి పడలేదు. ఇంటర్ విద్యనభ్యసించేదుకు జమ్మికుంట కాలేజీలో చేరినప్పుడు కూడా నరేష్ రెడ్డి ప్రతి కూల పరిస్థితులనే ఎదుర్కొన్నారు. ప్రాథమిక విద్యనభ్యసించేప్పుడు తన తండ్రి వద్దకు వచ్చే పోలీసు అధికారులను సునిశితంగా గమనించిన ఆయన ఎధగిన తరువాత పోలీసు కావాలన్న ధృడ సంకల్పాన్ని ఏర్పర్చుకున్నారు. దీంతో తాను పెరిగి పెద్ద అయిన ప్రాంతాల్లో విప్లవ పాఠాలు, పాటలు వినిపిస్తున్నా… అటువైపు తన ఆలోచనలను పెట్టకుండా కాఖీ యూనిఫాం వైపే పయనించారు. ఆర్ఎస్ యూ వంటి సంఘాల ప్రతినిధులకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సాహసించారు… కానీ విప్లవకారులతో చేయి కలిపేందుకు మాత్రం మొగ్గు చూపలేదు. అదే స్పూర్తితో ఉన్నత విద్యనభ్యసించి సబ్ ఇన్స్ పెక్టర్ గా ఖమ్మం జిల్లాలో తొలిసారి బాధ్యతలు చేపట్టారు. విప్లవ ప్రాంతంలో పుట్టి పెరిగిన నరేష్ రెడ్డి ఫస్ట్ పోస్టింగ్ జిల్లాలోని కొనిజర్లలో వేశారు అధికారులు. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైనా ఆ మండలంలో తన చాకచక్యంతో కక్ష్యలు, కార్పణ్యాల వాతావరణానికి పుల్ స్టాప్ పెట్టారు. మండలంలో తన బ్రాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రదర్శిచిన నరేష్ రెడ్డి గురించి అప్పటి తరం వారు ఇప్పటికీ చర్చిస్తారు. ఆ తరువాత ఖమ్మం జిల్లాలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పనిచేసిన ఆయన లొంగుబాట్లను ప్రొత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని సఫలం అయ్యారు. అశ్వరావుపేటలో గిరిజనులు, గిరిజనేతరులు వర్గాలుగా విడిపోయి యద్ద వాతవారణాన్ని తలపించేలా వ్యవహరించడంతో వాటిని చక్కదిద్దేందుకు ఆయన తీసుకొన్న చొరవను ఉన్నతాధికారులు సైతం అభినందించారు. రౌడిల అణిచిత, ట్రాఫిక్ క్రమబద్దీకరణ వంటి చర్యలతో ఎస్సై, సీఐగా ఖమ్మం జిల్లాలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఏసీపీగా ప్రమోషన్ వచ్చిన తరువాత బేగంపేటలో పోస్టింగ్ పొందిన ఆయన కరోనా విపత్కర పరిస్థితుల్లో వలస కూలీలను గమ్య స్థానాలకు చేర్చడంలో ప్రత్యేక శ్రద్ద కనబర్చారు.

పథకాల వెల్లువ…

ఎంతో ఇష్టంగా ఎంచుకున్న పోలీసు విభాగంలో సేవలందించేందుకు అంతకన్నా ఎక్కువ ఇష్టాన్ని ప్రదర్శించిన నరేష్ రెడ్డి తాజాగా ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపికయ్యారు. దేశంలోనే అత్యంత అరుదుగా ఇచ్చే ఈ మెడల్ కు రాష్ట్రం నుండి ఎంపికయిన ఇద్దరు డీఎస్పీలలో నరేష్ రెడ్డి ఒకరు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 11 మంది ఐపీఎంకు సెలెక్ట్ అయ్యారు. ఏసీపీ నరేష్ రెడ్డికి ఇప్పటికే పలు పథకాలు వరించాయి. 1999లో సేవా పథకం, 2010లో ఉత్తమ సేవా పతకం, 2019 లో మహోన్నత సేవా పతకాలు కూడా అందుకున్న ఆయన అందుకున్న ఇతర అవార్డులు, రివార్డులు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యంత అరుదైన పురస్కారాలలో ఒకటైన ఇండియన్ పోలీస్ మెడల్ కు నరేష్ రెడ్డి ఎంపిక కావడం పట్ల పలువురు అభినందించారు.

You cannot copy content of this page