దిశ దశ, కరీంనగర్:
క్యాబినెట్ మినిస్టర్ కాదు… ఉన్నతాధికారి అంతకన్నా కాదు… కానీ ఆయన్ని చూడగానే జిల్లా స్థాయి అధికారి నుండి సాధారణ ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ అలెర్ట్ అయ్యేవారు… కొంతమంది పోలీసు అధికారులైతే అఫిషయల్ సెల్యూట్ చేసేందుకూ వెనకాడలేదు… ఆయన చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడేవారు. ఆయన కనుసైగ చేస్తేనే ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్లలోనూ కదలికలు మొదలయ్యేవన్న చర్చ కరీంనగర్ అంతటా సాగింది. నిన్న మొన్నటి వరకు అధికారంలో లేకున్నా చెలాయించిన ఆయన చుట్టూ… మంగళవారం కూడా పోలీసు అధికారులు చుట్టు ముట్టారు… ఒకప్పుడు ఆయన స్టేషన్ లోకి వెల్తే అన్న వచ్చాడంటూ కొనియాడిన గొంతుకలు ఆయన దరి చేరేందుకు కూడా వెనుకంజ వేశాయి. అన్న వైపు కన్నెత్తి చూడడానికి కూడా అక్కడ పనిచేస్తున్న వారిని భయం వెంటాడింది. ప్రత్యామ్నాయ అధికారానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన ఆయన ఒంటిరిగా స్టేషన్ లో కూర్చుండి పోయాడు. నిన్న మొన్నటి వరకు ఏ చట్టమైతే ఆయనకు చుట్టంలా ఉండేదో అదే చట్టం ఆయన్ని కటకటాల పాలు చేసింది.
నందెల్లి మహిపాల్…
అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధిగా ఉన్న నందెల్లి మహిపాల్ వివిధ రాజకీయ పార్టీల్లో తిరిగినా క్రియాశీలక పాత్ర మాత్రం పోషించలేదు. ఒక్క పీఆర్పీ ఆవిర్భావం అయిన తరువాత మాత్రం చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల పర్యటనల్లో యాక్టివ్ గా కనిపించాడు. అయితే గత ఐదేళ్లలో మాత్రం ఆయన రేంజే మారిపోయిందన్న వాదనలు కరీంనగర్ అంతాటా వినిపిస్తున్నాయి. ఏసీపీ స్థాయి నుండి సామాన్య కానిస్టేబుల్ వరకు, తహసీల్దార్ నుండి వీఆర్ఏ వరకు ఆయన ప్రతి ఒక్కరి పోస్టింగ్ ఆయన కనుసన్నల్లోనే సాగాయన్నది బహిరంగ రహస్యం. దీంతో కరీంనగర్ అంటే మహిపాల్… మహిపాల్ అంటే కరీంనగర్ అన్న స్థితికి మారిపోయాయి అప్పటి పరిస్థితులు.
ఎన్ఓసీలా…
నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకుంటేనే కొన్ని ఫైళ్లకు ప్రభుత్వ శాఖల్లో క్లియరెన్స్ అవుతుండడం సహజం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా కరీంనగర్ లో నెలకొందన్న వాదనలు వినిపించాయి. నందెల్లి మహిపాల్ క్లియరెన్స్ ఇస్తేనే పోస్టింగుకు సంబంధించిన లెటర్లు ఐజీ, డీజీపీ కార్యాలయాలకు వెల్లేవన్న ప్రచారం బాహాటంగానే సాగింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్లు ఉంటేనే పోస్టింగులు ఇస్తామని ఎలా అయితే కుండ బద్దలు కొట్టారో అదే పద్దతి కరీంనగర్ లోనూ సాగింది. ఇక్కడ నందెల్లి మహిపాల్ క్లియరెన్స్ ఇస్తేనే సిఫార్సు లేఖలు బయటకు వచ్చాయన్నది వాస్తవం. దీంతో అధికారం చెలాయించే వారి ప్రాపకం కంటే మహిపాల్ ప్రాపకం కోసమే అధికార యంత్రాంగం ఉవ్విళ్లూరాల్సి వచ్చింది. జర్నలిస్టులపై కేసులు పెట్టాలన్నా… వారిని టార్గెట్ చేయాలన్నా… చివరకు సొంత పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదులే అయినా స్టేషన్లలో చలనం రావాలంటే ఆయన నుండి కాల్ రావల్సిందే. అట్రాసిటీ కేసులో ఫిర్యాదులు చేయించి ముప్పు తిప్పలు పెట్టించి చివరకు తమకు అనుకూలంగా మల్చుకున్న సందర్భాలు ఎన్నెన్నో. ఇందుకు స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు కూడా వత్తాసు పలికిన సందర్బాలు కోకొల్లలనే చెప్పాలి. తాము కొన్న భూమికి అడ్డంగా వేరే వారి భూములు ఉంటే వాటిని కొనేందుకు కూడా స్టేషన్ల కేంద్రీకృతంగానే సాగించిన చరిత్ర నాటిది. సర్కారు భూములను కూడా దురక్రమాణలు చేసి గుట్టలు మాయం చేసిన ఘటనల్లో ఏకంగా సొంతపార్టీ సర్పంచులపై కూడాఅట్రాసిటీ కేసు ముసుగేసి మరీ ఠాణాల చుట్టూ తిప్పుకున్న చరిత కూడా కరీంనగర్ కమిషనరేట్ పోలీసులకే దక్కింది. మహిపాల్ అరెస్ట్ పై గులాభి పార్టీ నాయకుల్లోనూ సంబరాలు వ్యక్తం అవుతున్నాయంటే ఆనాడు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు.
అంకుల్ చెప్పినా…
నందెల్లి మహిపాల్ అరెస్ట్ కు ముందు కరీంనగర్ లో జరిగిన ప్రచారాలు అన్నీ ఇన్నీ కావు… అంకుల్ అంతా సెట్ చేసేశారు… ఆయనపై ఈగ వాలదంటూ చెప్పుకున్నారు కొంతమంది. అంకుల్ ఇన్ వాల్వ్ కాగానే ఆఫీసర్ సెట్ అయిపోయాడంటూ కూడా ప్రగల్బాలు పలికారు. ‘కీ‘ రోలో పోషించిన మహిపాల్ అరెస్ట్ అయిన తరువాత ధీమా వ్యక్తం చేసిన గ్యాంగులు తప్పుడు ప్రచారం కోసం ఏం చెప్తాయో వేచి చూడాలి.
కాల్స్ డాటా తీస్తే…
నందెల్లి మహిపాల్ పై కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు ఆయన సీడీఆర్ తీసి విచారణ చేస్తే సొంత విభాగానికి చెందిన ప్రబుద్దుల గుట్టు కూడా రట్టు అయ్యే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాట్సప్ కాల్ డాటాతో పాటు ఫేస్ యాప్, సిగ్నల్ యాప్ వంటి ప్రత్యామ్నాయ యాప్స్ నుండి కూడా వివరాలు సేకరిస్తే అసలు గుట్టు రట్టవుంతుందంటున్న వ్యాఖ్యలు కరీంనగర్ అంతటా వినిపిస్తున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకుని లోతుగా అధ్యయనం చేస్తే ఎన్నెన్నో విషయాలు వెలుగులోకి రాక తప్పదని అంటున్నారు స్థానికులు.