ఏసీబీ దాడుల్లో చిక్కుతున్న మీడియేటర్లు
దిశ దశ, హైదరాబాద్:
కమిషన్ల కోసం కక్కుర్తి పడి అవినీతి అధికారులకు వత్తాసు పలుకుతున్న మధ్యవర్తులూ బహుపరాక్ గా ఉండండి. లంచం తీసుకునే అధికారి కోసం దారి తప్పినట్టయితే మీరూ జైలు జీవితం గడపాల్సిందేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. అధికారుల మెప్పు కోసమో లేక స్వార్థం కోసమో లంచం తీసుకునేందుకు మీడియేటర్ గిరి చేస్తే కేసులు వెంటాడుతాయన్న విషయం తెలుసుకోండి అంటున్నారు తెలంగాణ ఏసీబీ అధికారులు. ఇటీవల కాలంలో ఏసీబీ దాడుల్లో చిక్కుతున్న మధ్య వర్తులు కూడా ఊచలు లెక్కపెడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. తాజాగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహెద్ పాషాకు అసిస్టెంట్ గా వ్యవహరిస్తున్న ప్రైవేటు వ్యక్తి మహ్మద్ అంజాద్ ను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అవినీతికి పాల్పడే అధికారులు తాము సేఫ్ గా ఉండాలని భావించి మధ్యవర్తులను ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. నేరుగా లంచం తీసుకున్నట్టయితే ఏసీబీకి సమాచారం ఇచ్చి పట్టించే అవకాశాలు ఉన్నాయని భావించి అధికారులు మీడియేటర్లను పురమాయిస్తున్నారు. అయితే ఏసీబీ అధికారులు మిమ్మల్ని కూడా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్తున్నారు. ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు నమోదు చేస్తున్న ట్రాప్ కేసుల్లో మీడియేటర్లపై కూడా అవినీతి నిరోధక చట్టం ప్రకారం అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. దీంతో మధ్యవర్తులుగా చెలామణి అవుతున్న వారు కూడా కేసుల్లో ఇరుక్కుని కేసుల పాలవుతున్నారు. దీంతో అధికారులను మచ్చిక చేసుకున్న మీడియేటర్లు కూడా న్యాయ స్థానాల్లో విచారణకు హాజరు కావల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తమకు కూడా కొంతమేర డబ్బు చేతికి అందుతుందని ఆశపడి మధ్యవర్తుల అవతారం ఎత్తిన వారంతా కూడా జైళ్లకు వెళ్లకతప్పడం లేదు. ఇటీవల కాలంలో ఏసీబీ కూడా కోర్టుల్లో రిమాండ్ రిపోర్టులను దాఖలు చేసిన సందర్భంతో పాటు ఆయా కేసుల్లో నిందితులకు శిక్ష పడేందుకు ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. కోర్టుల్లో తీర్పు వచ్చినట్టయితే అవినీతికి పాల్పడిన అధికారులతో పాటు మీడియేటర్లకు కూడా శిక్ష పడే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసుల్లో మీడియేటర్లను కూడా అరెస్ట్ చేసిన ఘటనలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్సై వెంకన్న అతని డ్రైవర్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సదానందంను కూడా అరెస్ట్ చేశారు.
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ తహసీల్దార్ ఆఫీసులో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ మన్నె సంతోష్, ధరణీ ఆపరేటర్ అరుణ్ కుమార్, వరంగల్ జిల్లా పరకాల సబ్ రిజిస్ట్రార్ కందాల సునిత, ప్రైవేటు డాక్యూమెంట్ రైటర్ బొట్ల నరేష్, మెదక్ జిల్లా హవేలీ ఘన్ పూర్ ఎస్సై కె అనంద్ గౌడ్, రిపోర్టర్ మహ్మద్ మస్తాన్, నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ ఎస్ హెచ్ ఓ ఎం రవి, 102 అంబూలెన్స్ డ్రైవర్ విక్రమ్, జగిత్యాల జిల్లా రాయికల్ ఎస్సై టి అజయ్, రాయికల్ కు చెందిన పి రాజును అరెస్ట్ చేశారు. ఇసుక వాహనానికి సంబంధించిన ఈ వ్యవహారంలో రాయికల్ ఎస్సై అజయ్ ని పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు స్కెచ్ వేయగా ఏసీబీ అధికారుల ఉనికిని గుర్తించిన ఎస్సై లంచం తీసుకోకుండానే అక్కడి నుండి వెల్లిపోయారు. దీంతో మధ్యవర్తిగా వ్యవహరించిన రాజును ఏసీబీ అదికారులు అరెస్ట్ చేశారు. బీచుపల్లి పదో బెటాలియన్ అసిస్టెండ్ కమాండెంట్ వి నరసింహ స్వామి, రిటైర్డ్ ఏఆర్ ఎస్సై అబ్దుల్ వాహబ్, సూర్యపేట సబ్ రిజిస్ట్రార్ బానోతు సురేందర్ నాయక్, డాక్యూమెంట్ రైటర్లు కల్లూరి శ్రీనివాస్, తంగెళ్ల వెంకటరెడ్డిలను, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న తస్లిమాతో పాటు డాక్యూమెంట్ రైటర్ ను, కుషాయిగుడా ఎస్ హెచ్ ఓ జి వీరస్వామి, ఎస్సై షేక్ షపీ, ఉపేందర్ ప్రైవేటు వ్యక్తిని, హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి, ధరణి ఆపరేటర్ రాకేష్ లపై కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్ శివగరుపు సురేష్ బాబు, డాక్యమెంట్ రైటర్ కొత్తకోట శ్రీధర్ ను కూడా అరెస్ట్ చేశారు. శామీర్ పేట తమసీల్దార్ అరెస్ట్ సమయంలోనూ మీడియేటర్ ను రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇంతకాలం మద్యవర్తులు తీసుకున్నారని తప్పించుకునేందుకు మార్గాలు వెతుక్కుంటున్నారని గమనించిన ఏసీబీ అధికారులు లంచాలు వసూలు చేయడంలో మీడియేటర్ల పాత్రకు సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా సేకరిస్తున్నారు. దీంతో అవినీతి అధికారులతో చేతులు కలిపితే తమ చేతులకు కూడా బేడీలు పడక తప్పదన్న విషయాన్ని మధ్యవర్తులు గుర్తించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.