గండ్రను వెంటాడుతున్న అసమ్మతి గండం

దిశ దశ, భూపాలపల్లి:

భూపాలపల్లి రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీలో నెలకొన్న వాతావరణం రోజు రోజుకు ఝటిలంగా మారుతోంది. ఓ వైపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖాయం కాగా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇంటి పోరు తప్పడం లేదు. దీంతో భూపాలపల్లి నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

బెట్టు చేస్తున్న చారీ సాబ్…

ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో మొదటి వరసలో నిలిచే ఎమ్మెల్సీ మధుసూధనా చారీ ఖచ్చితంగా తనకే టికెట్ కావాలని బెట్టు చేస్తున్నారు. పట్టు వీడకుండా తన ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా చేస్తూనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మధుసూధనా చారీపై కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో నిలిచిన గండ్ర రమణారెడ్డి గెలిచారు. ఎన్నికలు జరిగిన కొంతకాలానికే అనూహ్య మలుపులు ఇక్కడ చోటు చేసుకోవడంతో… ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి సొంత పార్టీ ఎమ్మెల్యే అయ్యారు. దీంతో అప్పుడే చారి భవిష్యత్తు ఏంటన్న విషయంపై ఇంటా బయటా చర్చ తీవ్రంగా సాగింది. ఎన్నికలు వచ్చే సరికి పరిస్థితులు చక్కదిద్దుకుంటాయని భావించినప్పటికీ సమస్య ముదిరి పాకన పడ్డట్టుగానే అనిపిస్తున్నది. మధుసూధన చారీ నుండి ఆటంకం ఉండకూడదని భావించిన అధినేత కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. దీంతో టికెట్ విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉండవని అంచనా వేసినప్పటికీ గండ్రకు టికెట్ ఇవ్వడంపై మాత్రం వ్యతిరేకత తీవ్రంగా వస్తూనే ఉంది. ఇప్పటికే మధుసూధనా చారీ టికెట్ తనకే వస్తుందని ప్రచారం చేసుకుంటూ ప్రచార రథాలను కూడా రంగంలోకి దింపారు. మరో వైపున ఉద్యమ కారులు కూడా ఆయనకు అండగా నిలుస్తూ గండ్ర రమణారెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో భూపాలపల్లిలో రాజకీయాలు అనూహ్య మలుపు తిరుగుతున్నాయనే చెప్పాలి.

నిజామాబాద్ ఎన్నిక రిపిటేనా..?

భూపాలపల్లి నియోజకవర్గంలో మధుసూధన చారీకి మద్దతు అనూహ్యంగా పెరుగుతుండడం గమనార్హం. గత ఎన్నికల్లో ఆయనను ఓడించడం సరికాదన్న భావనకు వచ్చిన కొంతమంది ఆయన్ని కలిసి మరీ మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా శనివారం హైదరాబాద్ లో ఉద్యమ కారులంతా చారీ ఇంట్లో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక వేళ గండ్రకు టికెట్ ఇస్తే మాత్రం ఉద్యమకారులంతా కూడా బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు. 150 మంది ఉద్యమకారులంతా కూడా గండ్రకు వ్యతిరేకంగా పోటీ చేసి తమ వ్యతిరేకతను ప్రత్యక్ష్యంగా చూపించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. గత లోక సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి పోటీ చేసిన కవితకు వ్యతిరేకంగా పసుపు రైతులు బరిలో నిల్చి ఓడించిన సంగతి తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లిలో నిజామాబాద్ ఎంపీ ఎన్నికలు మరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ ఇది ఆచరణలో పెట్టినట్టయితే మాత్రం అధికార పార్టీకి భూపాలపల్లి ఫలితాలు మరింత ప్రతికూలంగా వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే చారీపై ఉన్న సింపతికి తోడు గండ్ర రమణారెడ్డిపై వ్యతిరేకతను ప్రదర్శించేందుకు నామినేషన్లు వేస్తే మాత్రం అధిష్టానానికి సరికొత్త తలనొప్పి తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతన్నాయి.

You cannot copy content of this page