దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో గౌతమ్ అదానీ ఒకరు. అంబానీతో పోటీ పడుతున్న ఈ ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు అధినేత. సోలార్, థర్మల్ విద్యుత్తు తయారీ, రవాణా, ఓడరేవుల నిర్వహణ, పలు వ్యాపార వ్యాపార కార్యకలాపాల వెనక తనదైన ముద్ర వేశారు. అయితే ఇప్పుడు అదానీ హిండెన్‌బర్గ్ నివేదిక ఇచ్చిన దెబ్బకు విలవిల్లాడుతున్నారు. హిండెన్ బర్గ్ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేని అదానీకి మరో షాక్ తగిలింది.
హిండెన్ బర్గ్ రిపోర్టు అదానీ సంపదా అంతా కూడా మంచులా కరిగిపోతుంది. బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ రిపోర్టు ప్రకారం అదానీ ప్రపంచ టాప్ పది ధనవంతుల జాబితాలో చోటును కోల్పోయారు. ప్రస్తుతం అదానీ 84.4 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానంలో నిలిచారు. మూడు రోజుల్లో ఆదానీ సంపద 34 బిలియన్ డాలర్లు కోల్పోయినట్లు బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ తెలిపింది. హిండెన్ బర్గ్ రిపోర్టు రాకముందు అదానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో మూడో స్థానంలో ఉండేవారు.
2022లో దాదాపు 40 బిలియన్ డాలర్ల వార్షిక లాభంతో అతి పెద్ద సంపద సృష్టించుకున్న అదానీ, ఇప్పుడు ఆ మొత్తాన్నీ పోగొట్టుకున్నారు. అంటే. ఒక సంవత్సర కాలంలో సంపాదించిన మొత్తాన్ని కేవలం ఒక్క నెల రోజుల్లో, అందులోనూ సింహభాగాన్ని కేవలం మూడు రోజుల్లో కోల్పోయారు. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కంటే అదానీ ఒక మెట్టు పైనే ఉన్నారు. ముకేష్ అంబానీ 12వ స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ ఇప్పటికీ అత్యంత సంపన్న భారతీయుడిగానే ఉన్నారు.
అదానీ గ్రూప్ కంపెనీల్లో అనేక మోసాలు, అక్రమాలు, స్టాక్ మానిప్యులేషన్ జరిగిందని ఆరోపిస్తూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కంపెనీ 32,000 పదాలతో కూడిన ఒక నివేదికను గత వారం విడుదల చేసింది. అప్పటి నుంచి సోమవారం వరకు, వరుసగా మూడు ట్రేడింగ్ రోజుల్లో ప్రతి రోజూ బిలియన్ల డాలర్లను అదానీ కోల్పోయారు.