దిశ దశ, హైదరాబాద్:
ధరణీ మాయాజాలం ఇంకా బాధితులను వెంటాడుతూనే ఉంది. భూ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరగక తప్పని పరిస్థితికి మాత్రం పుల్ స్టాప్ పడడం లేదు. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిన ఓ బాధితున్ని లంచం డబ్బులు కావాలని అడగడంతో ఏసీబీని ఆశ్రయించి ఏకంగా అడిషనల్ కలెక్టర్ నే పట్టించిన ఘటన కలకలం సృష్టిస్తోంది. జిల్లా స్థాయి అధికారులు కూడా అవినీతికి పాల్పడేందుకు వెనకాడడం లేదని ఈ ఘటన తేటతెల్లం చేస్తోంది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు జిల్లా స్థాయి అధికారి అయినా కూడా అవినీతి పాల్పుడుతున్నా పట్టుకోవడానికి మాత్రం వెనకాడలేదు. సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, కలెక్టరేట్ ‘ఇ’ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ వై మదన్ మోహన్ రెడ్డిలు రూ. 8 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గుర్రంగూడ క్రాస్ రోడ్డు లంచం తీసుకుంటున్న వీరిద్దరిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ గ్రామానికి చెందిన జక్కిడి ముత్యంరెడ్డి నుండి రూ. 8 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ధరణీ పోర్టల్ లో ప్రొహిబిటెడ్ జాబితా నుండి 14 గుంటల భూమిని తొలగించేందుకు లంచం డిమాండ్ చేసినట్టుగా ఏసీబీ అధికారులు వెల్లడించారు. ‘ఇ’ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ మధన్ మోహన్ రెడ్డి షిప్ట్ డిజైర్ కారులో దొరికిన లంచం డబ్బుల తీసుకున్న తరువాత పట్టుకున్న ఏసీబీ అధికారులు ఫినాలిప్తలీన్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్దారణ అయింది. అనంతరం మధన్ రెడ్డిని ఈ వ్యవహారంలో అడిషనల్ కలెక్టర్ ఎంవి భూపాల్ రెడ్డి భాగస్వామ్యం కూడా ఉందని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి మధన్ మోహన్ రెడ్డి కాల్ చేయగా పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ వద్దకు చేరుకున్నారు. అధికారిక వాహనంలో వచ్చిన భూపాలరెడ్డికి మధన్ మోహన్ రెడ్డి రూ. 8 లక్షల బ్యాగును అందించారు. వెంటనే ఏసీబీ అధికారులు అడిషన్ కలెక్టర్ ను అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అడిషనల్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంటులను అదుపులోకీ తీసుకున్న ఏసీబీ అధికారులు కోర్టులో హాజరు పర్చనున్నామని వెల్లడించారు. అధికారులు వీరిద్దరి ఇండ్లలో సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. లెక్కకు మించిన ఆస్తులకు సంబంధించిన ఆదారాలు దొరికినట్టయితే అక్రమ ఆస్తుల కేసు కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.
వ్యూహాత్మకంగా…
ఈ కేసులో ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మొదట లంచం తీసుకుంటూ పట్టుబడిన ‘ఇ’ సీనియర్ అసిస్టెంట్ మధన్ మోహన్ రెడ్డిని పట్టుకున్న అధికారులు అతన్ని అరెస్ట్ చేయడంతో సరిపెట్టాలని భావించలేదు. ధరణీ పోర్టల్ లో నిషేధిత జాబితాలో ఉన్న భూమిని సాధారణ మాడ్యూల్ లోకి మార్చేందుకు ఉన్నత స్థాయి అధికారి ప్రమేయం లేకుంటే కాదని తెలుసుకున్నారు. దీంతో మధన్ మోహన్ రెడ్డిని పట్టుకున్న తరువాత విచారించిన ఏసీబీ అధికారులు అతని ద్వారానే అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి లంచం ఇస్తుండగా మరోసారి పట్టుకున్నారు. లంచం తీసుకున్న ఉద్యోగి ద్వారా అవినీతి నగదును తీసుకుంటున్న అడిషనల్ కలెక్టర్ ను కూడా పట్టుకుని ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా వ్యవహరించారు.