శాప విమోచన కల్గిందా..? వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రస్థానం…

దిశ దశ, వేములవాడ:

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు అప్రతిహతంగా తన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఓ వైపున ప్రజా క్షేత్రంలో తిరుగుతూ మరో వైపున తన ప్రత్యర్ధులపై న్యాయ పోరాటం చేస్తూ అలుపెరుగకుండా శ్రమిస్తూ వచ్చారు. వరసగా నాలుగు సార్లు ఓడిపోయినా పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు సాగి ఎట్టకేలకు చట్టసభకు ఎన్నికయ్యారు. వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆది శ్రీనివాస్ ప్రస్థానం.

రాజన్న ఆలయ ఛైర్మన్ గా…

దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడ రాజన్న ఆలయ ఛైర్మన్ గా ఆది శ్రీనివాస్ రెండు సార్లు చేశారు. అంతకు ముందు ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా స్థానిక సంస్థలకు ప్రాతినిథ్యం వహించారు. బీసీ నాయుకుడిగా ఎదిగిన ఆది శ్రీనివాస్ వేములవాడ రాజన్న ఆలయ పాలకమండలి అధ్యక్షుడిగా రెండు సార్లు చేశారు. తనకు ఈ పదవి కావాలని జిల్లా నాయకుల నుండి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కూడా కోరి మరీ ఛైర్మన్ అయ్యారు ఆది శ్రీనివాస్. అయితే వేములవాడ రాజన్న క్షేత్ర పాలక మండలి బాధ్యతలు నిర్వర్తించిన వారు ఎవరూ కూడా రాజకీయంగా ఎదగలేదన్న సెంటిమెంట్ ఉంది. రాజన్న గుడి ఛైర్మన్ గా పని చేసిన ఆది శ్రీనివాస్ రాజకీయ భవితవ్యం కూడా అంతేనంటూ ఆందోళనలు వ్యక్తం చేశారు. ఇందుకు తగ్గట్టుగానే ఆది శ్రీనివాస్ 2009 నుండి వేములవాడ నుండి పోటీ చేసి ఓటమి చవి చూస్తూనే ఉన్నారు. రాజన్న ఆలయ కమిటీ సెంటిమెంట్ ఆది శ్రీనివాస్ విషయంలోనూ పని చేస్తోందన్న వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. 2009లో తన ప్రత్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి న్యాయ స్థానాలను కూడా ఆశ్రయించారు. రమేష్ బాబు జర్మని పౌరుడిగా ఉన్న ఆధారాలను చూపించి అటు కేంద్ర హోం శాఖకు ఇటు కోర్టులకు దరఖాస్తులు చేసుకుని పోరాటం కొనసాగించాడు. రమేష్ బాబు పౌరసత్వ వివాదం విషయంలో కోర్టుల తీర్పు వచ్చినట్టే రావడం మళ్లీ ఎదో కారణం చేత ఆగిపోవడం జరుగుతూ వచ్చింది. అయినప్పటికీ పౌరసత్వ అంశం విషయంలో రాజీ పడకుండా ముందుకు సాగారు. ఈ విషయంలో కూడా ఆయన రాజన్న ఆలయ పదవి ఇబ్బంది పెడుతున్నదన్న వాదనలు తెరపైకి తీసుకొచ్చారు. అవేవి పట్టించుకోకుండా ప్రజా క్షేత్రంలో తన సత్తా చాటుకోవాలన్న లక్ష్యంతోనే ముందడుగు వేశారు.

అనూహ్య పరిణామాలు…

వరస ఓటమిలతో రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్న ఆది శ్రీనివాస్ ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న తపనతో వేములవాడ ప్రజలతో మమేకమై తిరిగిన ఆది శ్రీనివాస్ తాజాగా జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీకి అడుగుపెడుతున్నారు. ఆదివారం నాటి ఫలితాల్లో ఆయన గెలవడంతో ఆది శ్రీనివాస్ చిరకాల వాంఛ నెరవేరినట్టయింది. ఈ సారి బీసీ కార్డు నినాదంతో పాటు ఆది శ్రీనివాస్ పై సానుభూతి కూడా పెద్ద ఎత్తున వచ్చింది. అంతేకాకుండా రాష్ట్రంలో మార్పు రావాలి అన్న నినాదం కూడా ఆయన గెలుపునకు టానిక్ లా పనిచేసింది. అధికార బీఆర్ఎస్ పార్టీలో అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలు కూడా ఆయనకు లాభించాయని చెప్పవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును కాదని చల్మెడ లక్ష్మీ నరసింహరావు అభ్యర్థిత్వం వైపు బీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపడంతో రమేష్ బాబుకు బలంగా ఉన్న ఓటు బ్యాంకు అంతా కూడా ఆది శ్రీనివాస్ కు అనుకూలంగా మారిపోయింది. బీజేపీ టికెట్ ఆశించిన మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమకు చివరి నిమిషంలో టికెట్ నిరాకరించి చెన్నమనేని వికాసరావుకు బీఫారం ఇచ్చింది ఆ పార్టీ అధిష్టానం. ఈ నేపథ్యంలో నిరాశకు గురైన తుల ఉమ ఇంటికి చేరుకుని ఆమెను ఓదార్చడమే కాకుండా జాతీయ నాయకులను కూడా ఆమె ఇంటికి వెల్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే తుల ఉమ మాత్రం తిరిగి బీఆర్ఎస్ లోకే చేరడంతో అప్పటి వరకు దొరల తీరును ఏకి పారేసిన ఆమె మళ్లీ వారి చేతుల్లోనే ఉన్న పార్టీ జెండా కప్పుకోవడం కూడా వేములవాడ ప్రాంత వాసులను విస్మయపరిచింది. దీంతో బీసీ కార్డు నినాదం అప్పటికే బలంగా వినిపిస్తున్న యువత నుండి ప్రతి ఒక్కరూ కూడా తుల ఉమ తీరుపై చర్చించుకుని ఆది శ్రీనివాస్ కే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. ఒకప్పుడు వేములవాడ పట్టణ ప్రజలు ఆది శ్రీనివాస్ కు అందలం ఎక్కించేందుకు సాహసించలేదు… కానీ ఈ సారి మాత్రం ఆయనకు అనుకూల వాతావరణం ఏర్పడినట్టయింది. దీంతో వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గెలుపు నల్లేరుపై నడకే అన్నట్టుగా మారిపోయింది. రాజన్న ఆలయ సెంటిమెంట్ ను అధిగమించి అసెంబ్లీకి ఎన్నికైన ఆధి శ్రీనివాస్ కు ఇప్పుడు శాప విమోచన కల్గిందని అంటున్న వారు కొందరైతే… ఆ సెంటిమెంట్ ను కాలరాసి చరిత్ర తిరగ రాశారని ఆయన అభిమానలు అంటున్నారు.

You cannot copy content of this page