అడవిలోనే పురుడు పోసుకున్న అమ్మ

108 సిబ్బంది చొరవతో తల్లి, బిడ్డ క్షేమం

ఆదిలాబాద్ జిల్లాలో ఘటన

దిశ దశ, ఆదిలాబాద్:

అడవితోనే మమేకమైన ఆదివాసీలు నేటికీ ఆధునిక వైద్యం అందుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. అడవి బిడ్దలుగా ఎదిగిన ఆ తల్లులు తమ కడుపున పుట్టబోతున్న బిడ్డలు క్షేమంగా బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టే పరిస్థితుల రావాలంటూ వేడుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. నేటికీ అటవీ ప్రాంతాల్లోని రహదారులు జనజీవనానికి సవాల్ విసుతరుతూనే ఉన్నాయి. దీంతో గర్భం దాల్చిన ప్రతి తల్లి కూడా సుఖ ప్రసవం కోసం తల్లడిల్లిపోతూనే ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారిపోయాయనే చెప్పాలి. వానాకాలం వచ్చిందంటే చాలు ఆదివాసీ బిడ్డలు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. తాజాగా ఊట్నూరు మండలం దొంగచింత పంచాయితీ పరిధిలో చోటు చేసుకున్న ఘటన రవాణా వ్యస్థకు అద్దం పడుతున్నది. దొంగచింత పంచాయితీ పరిధిలోని చిన్నుగూడకు చెందిన ఆత్రం భీంభాయి అనే గర్భిణీకి పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. దీంతో 108 సిబ్బంది హుటాహుటిన బయలుదేరినప్పటికీ రహదారి సౌకర్యం లేని చిన్నుగూడకు మార్గమధ్యలో ఉన్న వాగు కూడా పొంగిపొర్లుతోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గం లేక 108లో పనిచేస్తున్ ఈఎంటీ శంకర్, పైలెట్ సచిన్ లు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన వాగు దాటుకుంటూ మార్గమధ్యలో ఉన్న గర్భిణీ వద్దకు చేరుకున్నారు. ఆమెను తీసుకుని తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో గర్భిణీకి పురిటి నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. ఆ తల్లి పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు తల్లిబిడ్డ క్షేమంగా ఉండేందుకు 108 సిబ్బందిని చొరవ చూపాలని కోరారు. పురిటీ నొప్పులు క్రమక్రమంగా పెరుగుతుండడంతో 108 సిబ్బంది గర్భిణీ కుటుంబ సభ్యుల సహకారంతో డెలివరీ చేశారు. ఆత్రం భీంబాయికి పండంటి మగబిడ్డ పుట్టడం… తల్లి బిడ్డ అప్పటివరకయితే ఆరోగ్యంగా ఉండడంతో నెమ్మదిగా తల్లిబిడ్డలను వాగు దాటించి 108 వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇద్దరిని పరీక్షించిన డాక్టర్లు ఆరోగ్యం బాగా ఉందని చెప్పిన తరువాత గర్భీణీ కుటుంబ సభ్యుల్లో ఆనందం వ్యక్తం అయింది. ఓ వైపున చిరు జల్లులు, మరో వైపున అడవి, నీటి ప్రవాహంతో ఉన్న వాగు ఉన్నా కూడా 108 సిబ్బంది చూపించిన చొరవ వల్ల తల్లి, బిడ్డ క్షేమంగా ఉండడంతో వారిని ప్రతి ఒక్కరూ అభినందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కీకరణ్యాలు విస్తరించి ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను మరింత మెరుగు పర్చాలన్న అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి.

You cannot copy content of this page