అడ్మినిస్ట్రేషన్ లోపాలు ఉన్నాయా..?
దిశ దశ, మానకొండూరు:
జ్యోతిష్మతి కాలేజ్ విద్యార్థి అభిలాష్ ఘటన తరువాత అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా..? హాస్టల్ లో ఉండాల్సిన విద్యార్థులు బయటకు ఎలా వెల్తున్నారు..? అతనికి అనుమతి ఇచ్చింది ఎవరు..? అనుమతి ఇవ్వకుండానే విద్యార్థులు బయటకు వెల్తున్న విషయాన్ని గమనించే పరిస్థితి కాలేజీలో లేకపోవడం ఏంటీ..?
అభిలాష్ ఘటన చెప్తున్న వాస్తవాలు…
జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లోమా ఫస్ట్ ఈయర్ చదువుతున్న ఎనగంటి అభిలాష్ మిస్సింగ్ మిస్టరీ నేపథ్యంలో వెలుగులోకి వస్తున్న విషయాలు కాలేజీ యాజమాన్యం వైఫల్యాలను కూడా ఎత్తి చూపుతున్నాయి. మార్చి 1న అభిలాష్ కాలేజీలో కనిపించకుండా పోగా అతని పేరెంట్స్ కు మరునాటి రాత్రి 7.30 గంటల ప్రాంతంలో సమాచారం ఇచ్చారని ఫిర్యాదులో వివరించారు. ఈ ఫిర్యాదు అందుకున్న ఎల్ ఎండీ పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీయడం ఆరంభించారు. అయితే మార్చి 1న అభిలాష్ మద్యాహ్నం ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. తిరిగి కాలేజీ హాస్టల్ కు వచ్చిన అభిలాష్ మళ్లీ బయటకు వెల్లిపోయాడని ఆ తరువాత అతని స్నేహితునికి కాల్ చేసి కాలేజ్ బ్యాక్ సైడ్ నుండి రావాలని సూచించినట్టుగా కూడా తెలుస్తోంది. కాలేజ్ లో చదువుకుంటూ అదే హాస్టల్ లో ఉన్న స్టూడెంట్ గురించి వార్డెన్ పట్టించుకోలేదన్న విషయం స్పష్టం అవుతోంది. మరోవైపున క్లాసులకు అటెండ్ కాని విషయం గుర్తించి హాస్టల్ వార్డెన్ నుండి హెచ్ ఆర్ కానీ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కానీ ఎందుకు ఆరా తీయలేదు. అంటే ఈ కాలేజీ స్టూడెంట్స్ బయటకు వెల్లి రావడం సాధారణమేనా అన్న విషయం తేలాల్సి ఉంది. బయటి హాస్టల్ లో ఉన్నట్టయితే దారి తప్పుతారన్న ఉద్దేశ్యంతోనే పేరెంట్స్ తమ పిల్లలను కాలేజ్ హాస్టల్ లో జాయిన్ చేసినా వారిపై అజమాయిషీ చేయకపోవడం ఏంటన్నది కూడా అంతుచిక్కకుండా పోతున్నది. అభిలాష్ మృతదేహ వ్యవసాయ బావిలో లభ్యం అయిన తరువాత కాలేజీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ… తమకు తెలియకుండానే విద్యార్థులకు బయటకు వెల్తుంటారని… వెనక మార్గం గుండా వెల్లిపోతున్నారని చెప్పారు. అంటే కాలేజీ హాస్టల్ లో ఉంటున్న స్టూడెంట్స్ కు రాచమార్గంగా కాలేజ్ వెనక ప్రాంతం తయారైందని తేటతెల్లం అవుతున్నది. సాధారణంగా ఇంజనీరింగ్ కాలేజీ చుట్టూ కంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తారు కానీ ఈ కాలేజీ వెనక ప్రాంతంలో రక్షణ చర్యలేవి తీసుకొన్నట్టుగా స్ఫష్టం అవుతోంది. మరో వైపున హాస్టల్ లో ఉండే విద్యార్థులను కనిపెట్టుకుంటూ ఉండాల్సిన వార్డెన్లు వారిని నియంత్రించకపోవడం ఏంటన్నది కూడా అర్థం కావడం లేదు. ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు తమ బిడ్డలను కాలేజీకి అప్పగిస్తే హాస్టల్ నుండి విద్యార్థులు వెనక మార్గం గుండా బయటకు వెల్లడం కామన్ అన్నట్టుగా చెప్తుండడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ కాలేజీలో చదువుకునే కొంతమంది స్టూడెంట్స్ స్థానికంగా ఉండే హాస్టల్ లో ఉంటున్న విషయంపై కూడా పూర్తి వివరాలు సేకరించే విధానం ఉన్న జ్యోతిష్మతిలో తమ కాలేజీ ఆవరణలో ఉన్న హాస్టల్ విద్యార్థులపై దృష్టి సారించే విషయంలో ఎందుకు విఫలం అవుతున్నారోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సీసీ ఫుటేజీని పట్టించుకోవడం లేదా..?
మరో వైపున జ్యోతిష్మతి ఇంజనీరింగ్ విద్యాసంస్థల ఆవరణలోనే గర్ల్స్, బాయ్స్ హాస్టల్స్ ఏర్పాటు చేసిన యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంది. విద్యార్థుల రక్షణతో పాటు కాలేజీ కంపౌండ్ లోనే ఉన్నప్పుడు ప్రతి స్టూడెంట్ పై నిఘా కట్టుదిట్టం చేయాల్సి ఉంటుందన్నది వాస్తవం. స్టూడెంట్స్ వెనక వైపు నుండి బయటకు వెల్తున్నారని కూడా చెప్తున్న కాలేజీ యాజమాన్యం సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్టు వివరించింది. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా విద్యార్థులకు కాలేజ్ ప్రిమిసెస్ దాటి వెల్లిపోతున్నారన్న విషయాన్ని ఇంతకాలం ఎందుకు గుర్తించలేదు..?
కఠినత్వానికి కేరాఫ్…
ఈ కాలేజీ యాజమాన్యం పద్దతి తప్పినట్టయితే చాలా కఠినంగా వ్యవహరిస్తుందని గతంలో సంఘటనలు రుజువు చేస్తున్నాయి. గతంలో వేరే ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ జ్యోతిష్మతి కాలేజీ స్టూడెంట్ తో అసభ్యకరంగా ప్రవర్తించాడని అతనికి దేహశుద్ది చేశారు. మీడియా ముందే లెక్చరర్ వ్యవహరించిన తీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా జ్యోతిష్మతి అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎంతో కఠినంగా ఉంటుందని తేటతెల్లం అయింది. అంతేకాకుండా డే స్కాలర్స్ స్టూడెంట్స్ ఏఏ హాస్టల్ లో ఉంటున్నారన్న విషయాన్ని కూడా ఆరా తీసే విధానం అవలంభిస్తుంటారని కూడా పేరుంది. అంతేకాకుండా కాలేజీ మెయిన్ గేటు పరిసర ప్రాంతాల్లో వేరే కాలేజీల స్టూడెంట్స్ అడ్డాలు పెడితే వారిపై కూడా కఠినంగా వ్యవహరించిన సంఘటనలు కూడా ఉన్నాయని స్థానికంగా ప్రచారం. స్టూడెంట్స్ క్రమ శిక్షణ విషయంలో స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టడంలో తమకు తామే సాటి అన్న రీతిలో వ్యవహరిస్తున్నప్పటికీ జ్యోతిష్మతి కాలేజీ ప్రిమిసెస్ లో ఉన్న హాస్టల్ నుండి స్టూడెంట్స్ దర్జాగా బయటకు వెల్లడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటీ..? ఇతర కాలేజీల స్టూడెంట్స్, లెక్చరర్లు, ప్రైవేటు హాస్టల్ లో ఉండే విద్యార్థుల విషయంలో వ్యవహరిస్తున్న కఠినమైన తీరును తమ సొంత హాస్టల్ విద్యార్థుల విషయంలో ప్రదర్శించడం లేదా..? ఉన్నట్టయితే స్టూడెంట్స్ దర్జాగా బయటకు ఎలా వెల్లిపోతున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది.