దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
దత్తాత్రేయుడు అనగానే గుర్తుకు వచ్చేవి ఆయన జన్మించిన పిఠపురం, భక్తులకు కొంగు బంగారంగా నిలిచే గానుగాపురంతో పాటు ప్రసిద్ది గాంచిన ఇతర క్షేత్రాలు మాత్రమే. ప్రపంచంలో వివిధ రూపాల్లో వెలిసిన దత్తాత్రేయుడిని ఎక్కడైనా దర్శించుకోవడం సాధారణం. కానీ తెలంగాణాలో వెలిసి ఈ క్షేత్రం మాత్రం ఇతర దత్తాత్రేయుడి క్షేత్రాలకన్నా పూర్తి భిన్నమైన చరిత్రను తనలో దాచుకుంది. అత్యంత అరుదైన చరిత తనలో దాచుకున్న ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే…?
రాహు శయన దత్తుడు…
ప్రపంచలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో దత్తాత్రేయుడు రాహు శయునుడై వెలిశాడు. దాదాపు 7 శతాబ్దాల క్రితం వెంకట అవధూత ఇక్కడ రాహు శయన దత్తుడిని ప్రతిష్టించారని చరిత్ర చెబుతోంది. అంతేకాకుండా ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి కూడా వెలిసి ఉండడం మరో స్పెషాలిటీ. అయితే రాహు శయనుడై ఉన్న దత్తాత్రేయుడు పడుకున్న పాములా వెలిసి ఉండడం గమనార్హం. అత్యంత చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ క్షేత్రం కరీంనగర్, సిరిసిల్ల ప్రధాన రహదారిలో మిడ్ మానేరు బ్యాక్ వాటర్ లో ముంపునకు గురైంది. అయితే మధ్య మానేరు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈ క్షేత్రాన్ని వేరే చోటకు తరలించేందుకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి నిదులు కెటాయిస్తామని ప్రకటించినా స్థానికులు మాత్రం ఒప్పుకోలేదు. ఎత్తైన ప్రదేశలో వెలిసిన ఈ క్షేత్రంపై మూడు వేప చెట్లు కూడా ఉంటాయి. ఒక చెట్టు ఆకు వగరుగా, మరో చెట్టు ఆకు చేదుగా, ఇంకో చెట్టు ఆకు తీపిదనాన్ని అందిస్తుంటాయి. ప్రతి పౌర్ణమి రోజు ఈ ప్రాంత వాసులు దత్తుని సమక్షంలో ప్రత్యేకంగా వ్రతాలు చేస్తుంటారు. అయితే మిడ్ మానేరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా సాధారణ భక్తులు స్వామి వారిని దర్శించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ప్రాంతానికి చెందిన భక్తులు మాత్రం ప్రత్యేకంగా బోట్లు ఏర్పాటు చేసుకుని స్వామిని దర్శించుకుంటుంటారు. వేద పండితులు మాత్రం నిత్యం స్వామి వారికి అలంకారం చేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఈ దత్త క్షేత్రానికి అనుభందంగా ప్రత్యేకంగా వేద పాఠశాల కూడా ఏర్పాటు చేశారు. అయితే గత కొంతకాలం దత్తాత్రేయుడిని చేరుకోవడానికి చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మిడ్ మానేరు నీటిని దిగువకు వదిలినప్పుడు మాత్రం భక్తులు వెల్లి స్వామిని దర్శించుకుంటున్నారు.
దత్తుడిని దత్తత తీసుకుంటా: ఎంపీ బండి సంజయ్
మంగళవారం దత్త పౌర్ణమి పురస్కరించుకుని వరదవెల్లి రాహు శయన దత్తుడి సన్నిధిలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… దత్తాత్రేయుడిని భక్తులు దర్శించుకునేందుకు ప్రత్యేకంగా బోట్లు ఏర్పాటు చేయిస్తానని, అలాగే ఈ క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యక చొరవ తీసుకుంటానన్నారు. ఈ క్షేత్రాన్ని దత్తత తీసుకుని ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లే విధంగా అవసరమైన కృషి చేస్తానన్నారు.
ఈ దత్త క్షేత్ర చరిత్ర పూర్తిగా తెలుసుకునేందుకు ఈ క్రింది లింక్ పై ప్రెస్ చేయండి…