ప్రమాదాల అంచున పోలీసుల సాహసం…
దిశ దశ, హైదరాబాద్:
నింగి నుండి కుండపోతగా కురుస్తున్న వాన… దిగువ నుండి పొంగిపొర్లతున్న వరదలు… దారులన్ని జలమయం.. ఏ రోడ్డు తెగిపోయిందో తెలియని ధైన్యం… అయినా మొక్కవోని ధైర్యం… రెస్క్యూ ఆపరేషన్ లో మేూము సైతం అంటూ తెలంగాణ పోలీసులు వరదల సమయంలో ప్రదర్శించిన సాహసం అంతా ఇంతా కాదు. ప్రాణ నష్టం సంభవించకూడదన్న ఒకే ఒక్క పిలుపుతో కాఖీలంతా కదనరంగంలోకి దూకి తమవంతు సేవాతత్పరతను ప్రదర్శించారు.
ఆరుగురిని కాపాడిన ఐడియా…
భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన రైతులు భారీ వర్షాలు కురుస్తుండడంతో పంట చేలల్లోని తమ కరెంటు మోటర్లను తీసుకుచ్చునేందుకు వెల్లారు. గ్రామాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న మానేరు నదిలో ఉధృతంగా వరద వస్తుండడం… దిగువన ఉన్న అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్ తో తమ చేలు ముంపునకు గురవుతాయని భావించిన ఆరుగురు రైతులు కరెంటు మోటార్లను తీసుకొచ్చుకునేందుకు చేలకు వెళ్లారు. ఈ క్రమంలో వరద మరింత తీవ్రం కావడంతో ఆరుగురు రైతులు వరదల్లో చిక్కుకపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రైతుల ఆచూకి కోసం ఆరా తీసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వారు ఏ ఏరియాలో ఉన్నారోనన్నది అంతు చిక్కకపోవడంతో వారిని గుర్తించడం ఎలా అని తర్జనభర్జన పడ్డారు. వారిని గుర్తించేందుకు పోలీసులకు వచ్చిన మెరుపులాంటి ఆలోచనను వెంటనే అమలు చేశారు. డ్రోన్ కెమరాలను పంపించి రైతుల ఆచూకి దొరకబట్టేందుకు ప్రయత్నించి సఫలం అయ్యారు. కాటారం డీఎస్సీ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్ లో డ్రోన్లు పోలీసుల అంచనాలకు తగ్గట్టుగానే రైతులు ఏ ప్రాంతంలో చిక్కుకపోయారో గుర్తించాయి. అంతే వెంటనే బోట్ల ద్వారా రైతులు చిక్కుకపోయిన ప్రాంతానికి చేరుకుని వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. డ్రోన్ కెమెరాలను వినియోగించాలన్న ఐడియా పోలీసు అధికారులకు రానట్టయితే రైతులు వరదల్లోనే కొట్టు మిట్టాడుతూ కాలం వెల్లదీయాల్సి వచ్చేది. కాగా వారి కుటుంబాలు కూడా ఆందోళనతో ఘడియలు లెక్కించాల్సి వచ్చేది. కానీ పోలీసులు తీసుకున్న చొరవతో అటు రైతులు క్షేమంగా బయట పడగా… ఇటు వారి కుటుంబాలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి. మరో వైపున కొయ్యూరు పోలీసులు కూడా వరదల్లో కొట్టుకపోతున్న ఇద్దరిని ప్రాణాలతో కాపాడారు. కొయ్యూర్ ఎస్సైఐ ఆధ్వర్యంలో వరదలను లెక్క చేయకుండా పోలీసు బృందం ఇద్దరిని కాపాడింది. మోరంచపల్లి వాగు వరదలో చిక్కుకున్న గ్రామస్థులకు సపరిచర్యలు అందించడంలో కూడా ఎస్పీ కర్ణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
మెట్ పల్లిలో…
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని వెల్లుల్ల రోడ్ లో కూడా పోలీసులు సాహసం చేశారనే చెప్పాలి. వెల్లుల్ల రోడ్ శివారు ప్రాంతాల్లోని ఇండ్ల చుట్టూ పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. అక్కడ నివసిస్తున్న వారు తాము ప్రాణాలతో బయటపడతామా లేదా అన్న ఆందోళనకు గురవుతున్నారు. మరో వైపున వరద కూడా క్రమక్రమంగా పెరుగుతుండడంతో వారిలో ఆందోళన మరింత పెరిగింది. పట్టణ శివార్లలోని ఇండ్లలో 23 మంది వరద నీటిలో చిక్కుకపోయారన్న సమాచారం అందుకున్న మెట్ పల్లి సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై శ్యాం ఆధ్వర్యంలో పోలీసులు వెల్లుల్ల రోడ్ కు చేరుకున్నారు. ఇండ్లలో ఉన్న వృద్దులు, చిన్నారులను ఎత్తుకుని మరీ బయటకు తీసుకొచ్చారు. పోలీసులు సత్వరమే స్పందించడంతో వరదల్లో చిక్కుకున్న వారంతా కూడా భయం గుప్పిట నుండి బయటపడ్డారు. వీరందరిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించిన మెట్ పల్లి పోలీసులు ఆదర్శ ప్రాయంగా నిలిచారు.
సిరిసిల్లలో…
సిరిసిల్ల పట్టణంలో వరద నీటి బీభత్సం అతలాకుతలం చేసిందనే చెప్పాలి. పట్టణంలోని శాంతినగర్, రాజీవ్ నగర్ కాలనీలతో పాటు రగుడు వద్ద వరద నీరు పొంగి పొర్లింది. మరో వైపున చిన్న బోనాల చెరువు కూడా తెగిపోవడంతో జనజీవనం అంతా కూడా భయంతో జీవనం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో వరద నీటిలో చిక్కుకపోయి అవస్థలు పడుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వారిని కాపాడారు. వారిని ఎత్తుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిరిసిల్ల డీఎస్పీ ఉదయ్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ లు వరద నీటిలో చిక్కుకున్న వారి కోసం తీసుకున్న చొరవ అభినందనీయం.
గ్రేటర్ లో గ్రేట్ జాబ్…
వరంగల్ మహానగర పాలక సంస్థ వరదల్లో చిక్కుకుని ఎలా విలవిలలాడిపోయిందే అందరికీ తెలిసిందే. గత రెండు రోజులుగా వరద నీరు చేరని కాలనీలు ఉన్నాయని చెప్తే అతిశయోక్తనే చెప్పాలి. అంటే ఈ మహానగరాన్ని వరదలు ఏ స్థాయిలో ముంచెత్తాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వరంగల్ కమిషనరేట్ పోలీసులు మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ భాధితులను కాపడడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నగరంలోని భగత్ సింగ్ కాలనీ, కాకతీయ యూనివర్శిటీ ఏరియాల్లో హై రిస్క్ రెస్క్యూ ఆఫరేషన్ చేశారు. ఓ చోట 50 మందిని కాపాడగా, మరో చోట 20 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో భారీ నష్టం తప్పినట్టయింది. మరో వైపున నయ్యూం నగర్ ఏరియాలో కూడా చిక్కుకున్న పలువురి తాళ్ల సాయంతో బయటకు తీసుకవచ్చారు పోలీసులు.
పెద్దపల్లి జిల్లాలో…
పెద్దపల్లి జిల్లాలోని మానేరు పరివాహక ప్రాంతంలో చిక్కుకున్న 19 మందిని కాపాడేందుకు పోలీసులు స్పీడ్ బోట్ల సాయంతో బయటకు తీసుకొచ్చారు. పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ నేతృత్వంలో పోలీసులు మానేరు పరివాహక ప్రాంతంలో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా కాపాడడంలో సక్సెస్ అయ్యారు. ఉత్తర తెలంగాణాతో పాటు హైదరాబాద్ మహానగరాన్ని కూడా పరేషాన్ చేసిన వర్షాల వల్ల సామాన్య జనం ఎదుర్కొన్న కష్టాలు అన్ని ఇన్ని కావు. క్రిటికల్ పరిస్థితుల్లో కూడా పోలీసులు దూకుడుగా వ్యవహరించి ప్రాణ నష్టం వాటిల్లకుండా చొరవ తీసుకోవడం ఆదర్శనీయమనే చెప్పాలి. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చాలా చోట్ల కూడా పోలీసులు రోప్స్ సాయంతోనే రంగంలోకి దిగడం విశేషం. వరద ఉధృతి ఉన్న ప్రాంతాల్లో మాత్రం బోట్ల సాయం తీసుకుని బాధితులను సేఫ్టీ ఏరియాల్లోకి షిప్ట్ చేశారు.