హై కోర్టులో ప్రణిత్ రావు లంచ్ మోషన్ పిటిషన్
దిశ దశ, హైదరాబాద్:
పోలీసు కస్టడీలో ఉన్న సస్పెండెడ్ డీఎస్పీ దుగ్యాల ప్రణిత్ రావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరుపు న్యాయవాది రాజేందర్ రావు ఈ మేరకు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖాలు చేశారు. లోయర్ కోర్ట్ పోలీసు కస్టడీకి ఇచ్చిన తీరును సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు అయింది. వాస్తవమైన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా లోయర్ కోర్టు కస్టడీకి ఇచ్చిందని న్యాయవాది హై కోర్టుకు వివరించారు. కస్టడీ సమయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించలేదని, పోలీస్ స్టేషన్ లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ పూర్తయిన తరువాత తిరిగి జైలుకు తరలించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, దర్యాప్తులోని అంశాలు మీడియాకు లీక్ చేస్తున్నారని వివరించడంతో పాటు ఇలా ఎందుకు చేస్తున్నారో కూడా అందరికీ తెలిసిన విషయమేనన్నారు. రహస్యంగా విచారణ జరిపించాలన్న కారణంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారని, బంధువులు, న్యాయవాదిని కూడా అనుమతించడం లేదన్నారు. ప్రణిత్ రావును ప్రశ్నిస్తున్న సమయంలో ఏఎస్పీ డి రమేష్ పాల్గొనకుండా నియంత్రించాలని, ఇప్పటికే సమారం అందించినందున కస్టడీ రద్దు చేయాలని కూడా కోరారు. కస్టడీ అంశంపై వివరణ ఇవ్వాలని హై కోర్టు పోలీసులను ఆధేశించి, విచారణను బుధవారానికి వాయిదా వేసింది.