- ప్రచారాలకు వేదికగా మారిన వైనం
- దిశ దశ, కరీంనగర్:
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యాసంస్థల అధ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. కరీంనగర్ పట్టబద్దుల్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్ని కూడా రాజకీయ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. గతంలో ఏనాడు లేనివిధంగా ఈసారి విద్యాసంస్థల యజమానులు మండలిలో అడుగు పెట్టాలని వీళ్ళు ఊరుతున్నారు. దీంతో అభ్యర్థులు తమ ఉనికిని చాటుకునేందుకు ఆయా విద్యాసంస్థలను సందర్శించి తమ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన పట్టభద్రులు ఎమ్మెల్సీని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయా విద్యా సంస్థల్లో పనిచేస్తున్న పట్టభద్రులు తమకు అనుకూలంగా మల్చుకోవాలని భావిస్తున్న ఆశావాహులు వెనుకా ముందు ఆలోచించకుండా విద్యాసంస్థల్లోనే తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. శుక్రవారం వరకు కాలేజీలు కొనసాగడంతో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్న అభ్యర్థులు కాలేజీల్లో క్యాంపెయిన్ నిర్వహించడం గమనార్హం. ఓ వైపున తరగతులు కొనసాగుతున్న సమయంలోనే అక్కడ పనిచేస్తున్న పట్టభద్రులను ఆకట్టుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వకముందే విద్యాసంస్థల్లో తమ ప్రచారాన్ని పూర్తి చేసినట్టయితే కడ్ వర్తించదని భావించే ఈ ప్రచారం చేస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఇప్పుడు కమిషన్ జోక్యం చేసుకున్నా తాము సేఫ్ జోన్ లో ఉన్నామన్న వాదనలు వినిపించే అవకాశం ఉంటుందని అంచనా వేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
- ఆ సమయంలో…
- ఎన్నికల బరిలో నిలబడే ఔత్సాహికులను ఆయా విద్యాసంస్థల ఇంఛార్జీలు కూడా సాదరంగా స్వాగతం పలుకుతుండడం విచిత్రం. విద్యా సంస్థల్లోకి ప్రచారానికి అనుమతి ఇవ్వడమే తప్పయితే… క్లాసులు నడిచే సమయంలో ఆశావాహులను ఎలా అనుమతి ఇస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు మహిళా కాలేజీల్లోకి కూడా అభ్యర్థులను అనుమతించడం వెనక ఉన్న కారణం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది.
- కాలేజీలకు గిఫ్టులంటూ…
- కోడ్ కూయక ముందే అభ్యర్థుల ప్రచార కూతలకు సరికొత్త పేర్లను తెరపైకి తీసుక వస్తున్నారు. తమ కాలేజీకి గిఫ్ట్ ఇవ్వడానికి ఫలానా అభ్యర్థి వచ్చాడంటూ విద్యాశాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. ఇంతకాలం అటు వైపు కన్నెత్తి కూడా చూడని ప్రైవేటు విద్యాసంస్థల అధినేతలు ఇప్పుడు ఎందుకు ప్రభుత్వ కాలేజీ లపై వైపు అడుగులు వేస్తున్నారో అర్థం చేసుకోవల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇంతకాలం ప్రభుత్వ విద్యా వ్యవస్థను తగ్గించే విధంగా ప్రత్యామ్నాయ వ్యవస్థగా ప్రైవేటు ఎడ్యుకేషన్ విధానాన్ని పెంచి పోషించిన వారు ఇప్పుడు ప్రభుత్వ కాలేజీలపై మమకారం చూపించడం వెనక అంతర్యమేంటన్న చర్చ సాగుతోంది. అయినప్పటికీ ఉన్నత విద్యాశాఖ అధికారులు అభ్యర్థులను వెనకేసుకొచ్చే విధంగా మాట్లాడుతుండడం విమర్శలకు దారి తీస్తోంది.
- టిఎన్ఎస్ఎఫ్ ఆగ్రహం
- కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో జరుగుతున్న తంతుపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ మండిపడుతున్నారు. విద్యా సంస్థల్లోకి ప్రవేటు వ్యక్తులను అనుమతించడం ఏంటంటూ ఆయన అధికారుల నిలదీస్తున్నారు. అందునా మహిళా కాలేజీలోకి అనుమతులు లేకుండా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డిని ఎలా అనుమతించారంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారులు చెప్తున్న మాటలకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న నరేందర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుకు పొంతన లేకుండా పోయిందని రవీందర్ ఆరోపించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ విద్య విద్యా విధానంపై సరికొత్త ప్రేమను ప్రదర్శిస్తున్న ఆయన తీరుపై రవీందర్ ఆక్షేపించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్య విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు కరీంనగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న నిబంధనల వ్యతిరేక విధానాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వడిగ్రీ కాలేజీలోకి కాంటెస్టెడ్ అభ్యర్థిని ఎలా అనుమతించారో చెప్పాలన్నారు.
dishadasha
1232 posts
Prev Post
Next Post