కాళేశ్వరం విషయంలో అలా… ట్యాపింగ్ విషయంలో ఇలా…

అంతుచిక్కని బీజేపీ నేతల వైఖరి…

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్ర బీజేపీ నాయకుల తీరు విచిత్రంగా ఉందా..? అప్పుడో రీతి… ఇప్పుడో రీతి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా..? రాష్ట్రం వ్యవహారాల విషయంలో బీజేపీ నాయకులు ఎందుకిలా చేస్తున్నారన్నదే అంతుచిక్కకుండా పోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన రాష్ట్ర బీజేపీ నేతలు… ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆరోపణలు… డిమాండ్లతోనే సరిపెడుతున్నారెందుకున్నదే మిస్టరీగా మారింది…

మేడిగడ్డ విషయంలో…

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు దూకుడు ప్రదర్శించారు. అక్టోబర్ 21న పిల్లర్లు కుంగిపోయిన విషయం వెలుగులోకి రాగానే బీజేపీ నేతలు హుటాహుటిన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో నేషలన్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) రంగంలోకి దిగిన సంగతి అందరికీ తెలిసిందే. మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించిన అంశంపై ఎన్డీఎస్ఏ బృందం కూడా కార్యరంగంలోకి దిగి నిర్మాణ లోపాలను ఎత్తి చూపింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇరిగేషన్ అధికారుల లోపాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రత్యేకంగా మేడిగడ్డను సందర్శించి కుంగుబాటుపై ఘాటైన విమర్శలు చేశారు.

ట్యాపింగ్ విషయంలో…

స్పెషల్ ఇంటలీజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) కేంద్రీకృతంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వెలుగులోకి రాగానే హైదరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత కానీ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి కస్టడీకి తీసుకుని విచారించిన సమయంలో కానీ బీజేపీ రాష్ట్ర నాయకుల నుండి స్పందన మాత్రం రాలేదు. మంగళవారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పై స్పందించారు. ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారించాలని కోరారు. అలాగే మెదక్ లోకసభ అభ్యర్థి రఘునందన్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంపై విమర్శలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు ముఖ్యనేతలు, అప్పటి పోలీసు ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా తన ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నారు.

ఎందుకిలా…

మేడిగడ్డ కుంగుబాటు గురైన సమయంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు మరో లేఖ రాస్తే బావుంటుంది కదా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు రిమాండ్ సీడీలు, కన్ఫెషన్ రిపోర్టులను కోర్టులో సమర్పించారు. వీటిని ఆధారం చేసుకుని ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతక సంబంధించిన విషయమని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విచారించాల్సిన అవసరం ఉందంటూ లేఖ రాయవచ్చు కదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. మేడిగడ్డ అంశం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితం అయింది కానీ.. ఫోన్ ట్యాపింగ్ విషయం దేశ రక్షణకే సవాల్ విసురుతోంది. ఇలాంటి అత్యాధునిక పరికరాలను విద్రోహ శక్తులు కూడా వినియోగించినట్టయితే ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొవల్సి వస్తుందో అందరికీ తెలిసిందే. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే శక్తులు వీటిని ఉపయోగించుకున్నట్టయితే రహస్యంగా సాగే నిఘా వర్గాల దర్యాప్తు కూడా ఘరానా క్రిమినల్స్ చేతికి చిక్కే ప్రమాదం ఉంటుంది. అలాంటి పరికరాలను తెలంగాణలో అధికారులే వినియోగించారన్న విషయంపై బీజేపీ నేతలు మీడియా ముందు డిమాండ్లు పెట్టి వదిలేయడం ఎందుకు..? ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ కూడా లోతుగా దర్యాప్తు చేయాల్సిన ఆవశ్యకత ఉందంటూ లేఖ రాస్తే కేంద్రం కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది కదా అన్న చర్చ మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ కు ముందే ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన ఈ కేసుపై అప్పుడే బీజేపీ నాయకులు చొరవ తీసుకుంటే కేంద్ర దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగే అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ట్యాపింగ్ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఆలస్యంగా స్పందించడంతో పాటు కేంద్రం జోక్యం కేసుల వారు లేఖ రాయవచ్చు కదా అన్న చర్చ తీవ్రంగా సాగుతోంది. బీజేపీ లీడర్లు ఎందుకిలా వ్యవహరిస్తున్నారన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి.

You cannot copy content of this page