కాంగ్రెస్ పార్టీలో టఫ్ ఫైట్… ఎమ్మెల్సీ ఎన్నికల తీరు…

దిశ దశ, కరీంనగర్:

రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు ఉవ్విళ్లూరుతున్నారు. తమకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఎవరికి వారే ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. అధిష్టానం పెద్దల నుండి క్లియరెన్స్ కోసం ఎదురు చూడకుండా టికెట్ ఆశిస్తున్న వారంతా కూడా కార్యరంగంలోకి దూకడం విశేషం.

పోటీ తీవ్రం…

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పదవి కాలం గడువు త్వరలో ముగియనుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ఈ సారి పోటీ చేసే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతోంది. కొంతమంది నాయకులు కూడా ఆయనను సంప్రదించినప్పుడు తాను పోటీ చేసే ఆలోచనలో లేనని జీవన్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో కరీంనగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుండి అధికార కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించే వారి సంఖ్య తీవ్రంగా పెరిగింది.

మరో ప్రయత్నం…

తాజాగా జరిగిన ఎంపీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వెలిచాల రాజేందర్ రావు పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ అవకాశం ఇచ్చినట్టయితే మరోసారి ప్రజా క్షేత్రంలోకి వెల్లి ఓటర్లను ఆకట్టుకుంటానన్న ధీమాతో ఉన్నారు. ఒకరిద్దరు మంత్రులు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల సపోర్ట్ కూడా ఉందని రాజేందర్ రావు సన్నిహితులు చెప్తున్నారు గతంలో తన తండ్రి జగపతి రావు 1978లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహించారని ఆయన ఇమేజ్ కూడా తనకు కలిసి వస్తుందని రాజేందర్ రావు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ తనకు మరోసారి అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనను కొంతమంది ముఖ్య నాయకుల ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది.

అల్ఫోర్స్ అధినేత…

ఇకపోతే అల్ఫోర్స్ విద్యా సంస్థలతో ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వి నరేందర్ రెడ్డి కూడా ఈ సారి ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం ఇస్తుందన్న ధీమాతో ఉన్న ఆయన ఒక వేళ తనకు ఛాన్స్ ఇవ్వకపోయినట్టయితే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఆయన ఇప్పటికే కార్యరంగంలోకి దిగి విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టయితే బావుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నరేందర్ రెడ్డి, ఒకరిద్దరు మంత్రులతో పాటు ముఖ్య నాయకులను కూడా కలిసినట్టుగా సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి వద్ద కూడా తన అభ్యర్థిత్వం విషయంలో సానుకూలంగా స్పందించాలన్న ప్రతిపాదన కూడా చేసినట్టుగా చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అల్ఫోర్స్ విద్యా సంస్థలు తన గెలుపులో కీలక భూమిక పోషించే అవకాశం ఉందని నరేందర్ రెడ్డి అంచనా వేస్తున్నారు.

విన్నర్ పబ్లికేషన్స్…

ఇకపోతే విన్నర్ పబ్లికేషన్స్ పేరిట గ్రూప్స్ యువకులకు కోచింగ్ ఇవ్వడంతో పాటు ప్రిపరేషన్ మెటిరియల్ కూడా తయారు చేసి అందించిన ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ కూడా ఈ సారి బరిలో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. బోయినపల్లి మండలం గుండన్నపల్లికి చెందిన ప్రసన్న హరికృష్ణ తనవద్ద కోచింగ్ తీసుకున్న అభ్యర్థులతో పాటు తన విజన్ ఏంటో పట్టభద్రులకు తెలిసినందున తనకు లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. గ్రూప్స్ ఉద్యోగాల సంఖ్య పెంచాలన్న ప్రతిపాదన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఉంచడం వంటి అంశాలు తనకు ప్లస్ ఆవుతాయని ఆశిస్తున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు అత్యంత సన్నిహితుడు కూడా కావడంతో సీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు తనకు అండగా నిలుస్తారన్న భావనతో హరికృష్ణ ఉన్నారు. ఆయన కూడా ఇప్పటికే ప్రచారంలో నిమగ్నం కావడం విశేషం. ప్రొఫెషనల్స్ తో పాటు పట్టభద్రులను వ్యక్తిగతంగా కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.

మాజీ ఎమ్మెల్సీ…

తెలంగాణ ఉద్యమ సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన ఆర్ సత్యనారాయణ కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సంగారెడ్డి ప్రాంతానికి చెందిన ఆయన గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. ఎమ్మెల్సీగా గెలిచిన కొద్ది రోజులకే స్వరాష్ట్ర గళం వినిపించేందుకు చట్ట సభల ప్రతినిధులు రాజీనామా చేయాలన్న పిలుపును అందుకుని తన పదవికి రాజీనామా చేశారు సత్యనారాయణ. గత లోకసభ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఈ సారి తనకు టికెట్ ఇచ్చినట్టయితే గతంలో తనకు ఉన్న పరిచయాలు లాభిస్తాయని, జర్నలిస్టుగా కూడా పనిచేసిన తనకు కలిసి వస్తుందని అంటున్నారు.

అధిష్టానం మదిలో..?

అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎవరిని ఎంపిక చేయాలో అన్న విషయంలో అధిష్టానం ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతుందో అన్నదే అంతు చిక్కకుండా పోతోంది. ఇక్కడి నుండి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులంతా కూడా ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఎన్నికల్లో మరో నాలుగు నెలల తరువాత జరగనున్న నేపథ్యంలో ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం అవసరమా అన్న భావనతో పార్టీ ముఖ్య నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసి, నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై దృష్టి సారించే యోచనలో ఉన్నట్టుగా సమాచారం. అధిష్టానం అభ్యర్థుల విషయంలో స్పష్టత ఆశావాహులు మాత్రం పట్టభద్రుల మద్దతు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తుండడం గమనార్హం.

You cannot copy content of this page