శనిగకుంట మత్తడి కూల్చివేత కేసు…
పరారీలో నాయకులు…
తాళాలు వేసిన పోలీసులు
దిశ దశ, చెన్నూరు:
అనుకున్నది ఒక్కటి… అయినది ఒక్కటి… బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్టా… అన్నట్టుగా మారిందక్కడి వారి పరిస్థితి. ఏదో ఉహించుకుని… ఏదో చేయబోతే…. డామిట్ కథ అడ్డం తిరిగిందన్నట్టుగా మారింది. కుంట మత్తడి పేల్చివేత కేసులో నిందితులను అరెస్ట్ చేశారు… ఇక మనం సేఫ్ అనుకున్నవారిని కూడా వదలడం లేదు పోలీసులు. దీంతో పట్టణంలో లేకుండా పలాయనం చిత్తగించారు కొందరు అనుమానితులు. మరికొందరు స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
చెన్నూరుల్ హాట్ టాపిక్…
ఇటీవల చెన్నూరు శివార్లలోని శనిగకుంట మత్తడిని అగంతకులు పేల్చివేసిన సంగతి తెలిసిందే. ప్రజల ఆస్తుల ధ్వంసం కేసు కావడంతో పోలీసులు కూడా సీరియస్ గానే తీసుకున్నారు. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గడ్డం వివేకానంద కూడా కూడా పోలీసులకు ఫ్రీ హైండ్ ఇచ్చేశారు. ఈ వ్యవహారం వెనక ఎవరున్నా… చివరకు తమ పార్టీ శ్రేణులు ఉన్నా వదలొద్దని స్పష్టం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం వెనక రియల్ మాఫియా కూడా ఉందన్న ప్రచారం జరగినప్పటికీ… సిమెంట్ రోడ్డు వేయడంతో పాటు, మట్టిని అడ్డుగా పోయడంతో తమ ఇండ్లలోకి కుంట బ్యాక్ వాటర్ రావడంతో మునిగిపోయాయన్న కారణంతోనే కొంతమంది మత్తడిని పేల్చివేశారని నిర్దారించారు. దీంతో ఈ కేసు అంతటితో ముగిసిందని అన్ని వర్గాలు అనుకున్నాయి. అయితే ఈ కేసు వెనక మరి కొంతమంది హస్తం ఉందని, దీని వెనక భారీ స్కెచ్ ఉందని గుర్తించిన పోలీసులు అనుమానితులను విచారించే పనిలో పడ్డారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న అధికార పార్టీకి చెందిన నాయకులను రోజూ పోలీస్ స్టేషన్ కు పిలిచి పోలీసులు విచారిస్తున్నారు. మరో వైపున ప్రతిపక్ష పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తుండడంతో వారిద్దరూ స్థానికంగా కనిపించుకుండా పోయారు. దీంతో ఆ ఇద్దరి పాత్ర కూడా ఈ వ్యవహారంలో ఉందన్న ప్రచారం పట్టణమంతా పాకిపోయింది. అయితే పోలీసులు మాత్రం ఈ వ్యవహారంపై ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం.
ఉన్నట్టుండి…
అయితే చెన్నూరు పోలీసులు ఉన్నట్టుండి ఓ నాయకునికి సంబంధించిన ఆస్తులకు తాళాలు వేయడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. మునిసిపల్ ఛైర్ పర్సన్ అర్చనా గిల్డా భర్త, బీఆర్ఎస్ నాయకుడు రామ్ లాల్ గిల్డాకు చెందిన రైస్ మిల్లుతో పాటు కొత్త బస్ స్టేషన్ ప్రాంతంలోని రిలయన్స్ గ్రూప్స్ షాప్స్ కు అద్దెకు ఇచ్చిన కాంప్లెక్స్ కు కూడా పోలీసులు తాళాలు వేయించారు. దీంతోపాటు రామ్ లాల్ గిల్డా అనుచరులను కూడా చెన్నూరు పోలీసులు విచారించేందుకు పోలీసు స్టేషన్ కు తరలించడం చర్చనీయాంశంగా మారింది. శనిగకుంట మత్తడి పేల్చివేత కేసులో బడాబాబుల హస్తం ఉందన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తుండడంతో మొదట్లో నిందితుల అరెస్ట్ వ్యవహారంతోనే కేసును చల్లబర్చారన్న ప్రచారానికి తెరపడినట్టయింది.