26 నుండి నిరవధిక దీక్షలు
సిరొంచ తహసీల్దార్ కు వినతి
దిశ దశ, దండకారణ్యం:
గోదావరి పరివాహక ప్రాంతంలో మళ్లీ ఆందోళనకు సమాయత్తం అవుతున్నారు సరిహద్దు ప్రాంత రైతులు మాట ఇచ్చి నిలబెట్టుకోలేదని, ఇంత కాలం వేచి చూసి విసుగు చెందామని ఇక తాము నిరవధిక దీక్షలకు పూనుకుంటామని తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ వెనక్కి తగ్గేది లేదని రైతాంగం స్పష్టం చేస్తోంది.
నాలుగు ప్రధాన డిమాండ్లు…
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలోని మేడిగడ్డ బ్యారేజీ బాధిత రైతులతో మరిన్ని గ్రామాల బాధితులు చేతులు కలిపారు. బ్యారేజ్ బ్యాక్ వాటర్ తో తమ పంటలు మునిగిపోతున్నాయని, గేట్లు ఎత్తినప్పుడు తమ భూముల్లోని క్రాప్ అంతా కొట్టుకపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 26 నుండి సిరొంచ తహసీల్ కార్యాలయం ఆవరణలో తాము నిరవధిక దీక్షకు పూనుకుంటున్నామని కొద్దిసేపటి క్రితం సిరొంచ రైతులు అక్కడి తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. గతంలో తమకు పలుమార్లు మాట ఇచ్చి మోసం చేశారని ఇక తాము వినేది లేదని చేతల్లో చూపితేనే తాము సమ్మతిస్తామంటూ రైతాంగం స్పష్టం చేసింది. ఇప్పటికే నోటిఫై చేసిన భూములకు సంబంధించిన భూముల పరిహారం వెంటనే విడుదల చేయాలని, అదనంగా ముంపునకు గురవుతున్న భూముల గురించి చేసిన సర్వే వివరాలను వెల్లడించి అదనపు భూములను కూడా ముంపునకు గురవుతున్నాయని ప్రకటించి పరిహారం అందించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు ఎత్తినప్పుడు ఉధృతంగా దిగువకు వెల్తున్న వరద నీరు అంకీస, ఆసరెల్లి వరకు ఉన్న పరివాహక గ్రామల్లోని పంటలన్ని కూడా ముంపునకు గురవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గేట్లు ఎత్తినప్పుడల్లా జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ భూములను కూడా సేకరించి పరిహారం అందించాలని కోరుతున్నారు. ఐదేళ్లుగా ఉన్న భూములను మేడిగడ్డ కోసం సమర్పించి ఆదాయం లేక అల్లాడిపోతున్నామని బాధిత గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో కొత్త డిమాండ్ ను కూడా బాధిత రైతులు ప్రభుత్వం ముందు ఉంచారు. మేడిగడ్డ బ్యారేజీ వల్ల ఎగువ, దిగువ ప్రాంతాల భూములు ముంపునకు గురవుతున్నందున ప్రతి రైతుకు పరిహారం చెల్లించడంతో పాటు ప్రాజెక్టు కోసం పంట భూములు నష్టపోయామని దృవీకరిస్తూ సర్టిఫికెట్ కూడా ఇప్పించాలని అడుగుతున్నారు.
డిప్యూటీ సీఎం మాట కూడా…
డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ ను కలిసి కూడా గోడు వెల్లబోసుకున్నా తమకు న్యాయం జరగడం లేదని సిరొంచ ఏరియా రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఖచ్చితంగా పరిహారం ఇప్పిస్తానని ఫడ్నవిస్ మాట ఇవ్వడమే కాకుండా ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా సమావేశాలు కూడా ఏర్పాటు చేయడంతో తమలో ఆశలు చిగురించాయని బాధిత గ్రామాల రైతులు తెలిపారు. అయితే నెలలు గడిచినా మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల నుండి మాత్రం స్పందన రాకపోవడంతో చివరకు తాము మళ్లీ ప్రత్యక్ష్య పోరాటం చేయాలని నిర్ణయించామని మేడిగడ్డ బాధిత రైతాంగం ప్రకటించింది. ఈ నెల 26 నుండి నిరవధికంగా జరగనున్న ఈ ఆందోళనకు అనుమతి ఇవ్వాలని, తాము శాంతియుతంగానే ఇరు రాష్ట్రాల నుండి రావల్సిన సాయం కోసం నిరసనలు తెలుపుతామని వెల్లడించింది.