చందనాపూర్ లో ఎస్సీ కాలనీ వాసుల నిరసన

12 గంటలుగా కొనసాగుతున్న ఆందోళన

సింగరేణి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు

దిశ దశ, పెద్దపల్లి:

సింగరేణి నిర్వాసితులు 12 గంటలుగా నిరసనలు చేస్తున్నారు. తమకు పరిహారం అందించే విషయంలో మీనామేషాలు లెక్కిస్తున్న అధికారులు కాలనీ ఖాలీ చేయాలని ఒత్తిళ్లు చేయడంతో మాత్రం ముందుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ ఎస్సీ కాలనీకి చెందిన వారంతా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతుండగా, మహిళలు రోడ్డుపై బైఠాయించారు. 2009లో 11 ఏ మైన్ విస్తరణ కోసం చందనాపూర్ ఎస్సీ కాలనీ భూసేకరణ చేసిన సింగరేణి సంస్థ 2018లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కొంతమందికి అమలు చేసినా మరో 15 మందికి అమలు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు రచ్చపల్లి, అడ్రియాలలో ఇచ్చినట్టుగా కాలనీకి చెందిన 76 మందికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న వారికి కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్వాసితులందరికీ పరిహారం ఇవ్వకుండానే సింగరేణి అధికారులు ఖాలీ చేయాలని అంటున్నారని, అంతేకాకుండా విద్యత్ సరఫరా నిలిపివేశారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాల్గైదు రోజులుగా సింగరేణి అధికారులు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమకు న్యాయం చేసేందుకు జిల్లా కలెక్టర్, ఆర్డీఓలు చొరవ తీసుకోవాలని వేడుకుంటున్నారు. 12 గంటల నుండి నిర్వాసితులు ఆందోళన చేస్తుండడం గమనార్హం. పోలీసులు గ్రామానికి చేరుకుని బాధితుల నుండి వివరాలు సేకరిస్తున్నారు.

You cannot copy content of this page