డిపో ముందు ధర్నాలు…
మోహరించిన పోలీసు బలగాలు…
దిశ దశ, జగిత్యాల:
హిందు సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో హై అలెర్ట్ వాతావరణం నెలకొంది. శుక్రవారం రాత్రి నుండే డేగ కళ్లతో పోలీసులు పట్టణాన్ని సునిశీతంగా పరిశీలిస్తున్నారు. శనివారం తెల్లవారు జామున విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ తో పాటు ఇతర హిందూ సంఘాలు ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. జగిత్యాల డిపో ముందు నిరసనలు వ్యక్తం చేయగా పోలీసులు వారిని నిలువరించారు. ఆర్టీసీ అధికారులు కూడా డ్రైవర్లు, కండక్టర్లతో డిపోలో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారు. జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ యాదవ్ ను అన్యాయంగా సస్పెన్షన్ చేశారంటూ హిందూ సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. జగిత్యాల పట్టణం సంపూర్ణ బంద్ పాటించి అనిల్ యాదవ్ కు బాసటగా నిలవాలని వ్యాపార, వాణిజ్య వర్గాలను కోరాయి. ఈ బంద్ తో తనకు సంబంధం లేదని అనిల్ ప్రకటించడంతో పాటు ఇలాంటి ఆందోళనలు చేయవద్దని కోరారు. ఈ వీడియో కూడా వైరల్ అయినప్పటికీ హిందూ సంఘాలు మాత్రం బంద్ పాటించేందుకే మొగ్గు చూపాయి. దీంతో జగిత్యాల పట్టణంలోని పలు కూడళ్లలో పోలీసు బలగాలను మోహరించారు ఉన్నతాధికారులు.
పోలీసు అధికారుల సంఘం ఏది..?: బండి సంజయ్
శనివారం నాటి బంద్ పిలుపునకు బీజేపీ కూడా సంపూర్ణ మద్దతు ఇస్తుందని, బంద్ లో బీజేపీ శ్రేణులో కూడా పాల్గొంటాయని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. అమాయకుడైన ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేసి ఓ వర్గానికి కొమ్ము కాశారంటూ సంజయ్ దుయ్యబట్టారు. అన్యాయంగా క్రమ శిక్షణ చర్యలు తీసుకున్న విషయంలో పోలీసు అధికారుల సంఘం ఏం చేస్తుందని బండి సంజయ్ ప్రశ్నించారు. అనిల్ విషయంలో సంఘం ప్రతినిధులు జోక్యం చేసుకోకపోవడం ఏంటని ఆయన నిలదీశారు. పోలీసులు కూడా మనుషులేనని వాళ్లకు కూడా కుటుంబాలు ఉన్నాయని అనిల్ సస్పెన్షన్ ఎత్తివేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. జగిత్యాల వ్యాపార, వాణిజ్య వర్గాలు కూడా ఈ బంద్ లో పాల్గొనాలని కోరారు. జగిత్యాల సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిందని, ఒక వర్గం వ్యక్తులు విచ్చలవిడిగా అరచకాలు చేస్తున్నారని, చిన్న సంఘటన జరిగితే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం నల్ల జెండాలను ప్రదర్శిస్తున్నారని బీఎస్కే మండిపడ్డారు. పీఎఫ్ఐ జిందాబాద్ అంటూ మెరుగుతున్నారని, పోలీస్ స్టేషన్లపై దాడులు చేయడం, ఎస్సైలను బెదిరించడం దీనికి కొంతమంది లీడర్లు పోటీ పడి సపోర్ట్ చేస్తున్నారని మండి పడ్డారు. ఇక నుండి బీజేపీ జగిత్యాలపై దృష్టి పెడుతుందని ఎవరొస్తారో చూస్తామని బండి సంజయ్ ఘాటుగా స్పందించారు.