ఎంపీ ఎన్నికల సన్నాహాక సమావేశం రసాభసా
దిశ దశ, కరీంనగర్:
ఎంపీ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సమావేశంలో కార్యకర్తలు తమ నైరాశ్యం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా ఉద్యమకారులకు మాత్రం న్యాయం జరగలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కరీంనగర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రసంగిస్తున్న క్రమంలో కిసాన్ నగర్ కు చెందిన కామారపు శ్యాం అనే ఉద్యమకారుడు లేచి నాయకులను నిలదీశాడు. వేదికపైన ప్రముఖులు ఉన్న సమయంలోనే శ్యాం తన ఆవేదనను వెల్లగక్కిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఉద్యమం అప్పటి నుండి పనిచేస్తున్న తన లాంటి వారికి అధికారంలో ఉన్నప్పుడు గుర్తింపే లేకుండా పోయిందన్నారు. ఇంతకాలం ఎవరెవరో వచ్చారని ఇఫ్పుడు ఎంపీ ఎన్నికల కోసం సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారంటూ శ్యాం నిలదీశాడు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఎంటీ న్యూసెన్స్ అంటూ కూర్చొవాలని చెప్పినా వినకుండా శ్యాం తన ఆవేనను వెల్లగక్కేందుకే మొగ్గు చూపారు. ఆయన్ని సముదాయించేందుకు కొంతమంది నాయకులు ప్రయత్నించినా వినకుండా నాయకుల వైఖరిని ఎండగట్టారు. గత ఎన్నికల్లో పనిచేసేందుకు తాను ముందుకు వచ్చినా బాధ్యతలు అప్పగించే వారే లేకుండా పోయారని, అసలైన కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందని శ్యాం మండిపడ్డారు.
కిరోసిన్ పోసుకున్నా…
ఓ వైపున శ్యామ్ తన ఆవేదనను వెల్లగక్కుతున్న క్రమంలోనే మరో సీనియర్ కార్యకర్త లేచి తాను గంగుల కమలాకర్ టికెట్ కోసం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాని అయినా తనను పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్ కార్యకర్తలు సమావేశంలోనే తమ ఆవేదన వెలిబుచ్చిన తీరుపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అధికారంలోకి వచ్చిన తరువాత తమలాంటి సామాన్యులకు పట్టించుకోలేదని, తమ బాగోగులు కూడా పట్టించుకున్న పాపన పోలేదన్న రీతిలో బీఆర్ఎస్ సీనియర్ క్యాడర్ నిరసన వ్యక్తం చేసింది. దీంతో కొద్దిసేపు పార్టీ మీటింగ్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో సీనియర్ కార్యకర్తల ఆవేదన ఈ లింక్ పై క్లిక్ చేసి మీరూ వినండి..
https://youtu.be/KOhohp1lROo