దిశ దశ; కరీంనగర్:
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్ ల సాన్నిహిత్యంపై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి మరో సారి ఫైర్ అయ్యారు. గురువారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలు లేవనెత్తుతూ దుయ్యబట్టారు. గ్రానైట్ వ్యవహారంపై ఇచ్చని ఫిర్యాదు విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. ఈ మీడియా సమవేశంలో ముత్యాల విజయ్ కుమార్, పెద్దెల్లి శేఖర్, కూరవెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
అంబటి జోజిరెడ్డి ఏమన్నారంటే…
ఒకరినొకరు విమర్శలు చేసుకున్నారు… ప్రత్యర్థులుగా నటించారు… మీరిద్దరూ అగ్గిమీద గుగ్గిలంలా మండిపోతే మాకేదో మంచి జరుగుతుందనుకున్నాం కానీ ఏండ్లు గడుస్తున్నా చర్యలు చేపట్టడం లేదందుకు చెప్పాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉంది. కరీంనగర్ లో కారెక్కి కమలం తిరుగుతోందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం మరోకటి లేదు. కమలం వాడకుండా ఉండాలంటే కారులో ఏసీ అవసరం అనుకుందో ఏమో కానీ కమల వికాసం కోసం కరీంనగర్ ప్రజలకు విలాపం మిగుల్చుతున్నారనిపిస్తోంది. మూడేళ్ల క్రితం కరీంనగర్ సమీపంలోని గ్రానైట్ దందా వెనక జరిగిన అక్రమాలపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీడియా ముందు మాట్లాడిన తీరు చూసి మేమంతా సంబరపడిపోయాం. కరీంనగర్ ప్రజల పాలిట శాపంగా మారిన గ్రానైట్ మాఫియా అక్రమాలు వెలుగులోకి వచ్చినట్టయితే మేమంతా కొద్దో గొప్పే ప్రకృతిని కాపాడుకుంటామని ఆశించాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఎంపీనే రంగంలోకి దిగాడంటే గ్రానైట్ మాఫియా పనైపోయిందని ఊహించాం. కానీ ఇదంతా ఆరంభ శూరత్వమేనని అంతిమం వరకు కొనసాగలేదని ఇప్పుడు అర్థం అవుతోంది. గ్రానైట్ వ్యవహారంలో విజిలెన్స్ అధికారులు వే బిల్లుల రీ సైక్లింగ్ దందాతో పాటు గ్రానైట్ బ్లాకులను తరలించినప్పుడు అక్రమాలు జరిగాయని నివేదికలు ఇచ్చారు. మైనింగ్ యాక్టు ప్రకారం వీరిపై ఐదు రెట్ల పెనాల్టీ కూడా వేయాలని ఉంది. ఈ మేరకు మైనింగ్ అధికారులు పకడ్భందీగా ఇచ్చిన నివేదికల ఆధారంగా పెనాల్టీ వసూలు కాలేదన్నది వాస్తవం. ఈ విషయంలో ఎంపీగా బండి సంజయ్ రంగంలోకి దిగగానే మేమంతా కూడా సంతోషించాం. ఇక గ్రానైట్ మాఫియా ఆట కట్టవుతుందని భావించినప్పటికీ అటు ఈడీ కానీ ఇటు సీబీఐ కాని దర్యాప్తును వేగవంతం చేయకపోవడంతో మాకు అనుమానాలు మొదలయ్యాయి. మరో వైపున ఈ విషయంలో బీజేపీ నాయకులు పేరాల శేఖర్, భేతి మహేందర్ రెడ్డిలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు సాగుతోందన్న ప్రచారం జరుగుతోంది. కానీ బండి సంజయ్ ఇచ్చిన ఫిర్యాదులు దర్యాప్తు సంస్థలకు పంపనే లేదని తెలిసింది. ఆయన కేవలం కేంద్ర మంత్రులకు మాత్రం ఫిర్యాదు చేశారని, చట్టబద్దమైన దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయలేదు. వైసీపీ నేత సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. అయితే అధికారం, పలుకుబడి లేని వారు ఇచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత లేకుండా పోతే ఎంపీ హోదాలో ఇచ్చిన ఫిర్యాదులపై కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..? ఒక వేళ ఎంపీ బండి సంజయ్ చట్ట బద్దమైన దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినట్టయితే ఇందుకు సంబంధించిన కంప్లైంట్ కాపీలను బహిర్గతం చేయడంతో పాటు దర్యాప్తు సంస్థలు ఆయన చొరవ కారణంగానే విచారణ చేపట్టినట్టుగా వచ్చిన ప్రత్యుత్తరం కాపీలను బహిరంగంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంపీ బండి సంజయ్ కేవలం గొడవ పెట్టినట్టుగా మొదట్లో హంగామా చేయడం ఆ తరువాత చేతులు ముడుచుకుని కూర్చోవడం అలవాటుగా మారిపోయిందని నేను ఆరోపిస్తున్నాను. ఎందుకంటే గ్రానైట్ అక్రమాలపై ఆయన ఇప్పటి వరకు పట్టించుకోకపోవడమే మా అనుమానాలకు కారణం. ఒకవేళ ఆయన నిజంగానే నిబద్దతో అక్రమాలను ప్రశ్నించినట్టయితే ఇందుకు సంబంధించి ఆయాశాఖల అధికారుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను బయటకు విడుదల చేయాలని కోరుతున్నాను. లేనట్టయితే ఆయన నామమాత్రంగానే ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారని కరీంనగర్ ప్రజలు నమ్మాల్సి వస్తుంది. ఆయన ఏ అమ్మవారినైతే నమ్మి త్రిశక్తి ఆలయంగా నిర్మించారో అదే ఆలయం సాక్షిగా… ఆ ముగ్గురు అమ్మల ప్రాంగణంలో సాక్షాధారాలు అన్ని కూడా చూపించాలని కోరుతున్నాం. బండి సంజయ్ వ్యవహారం ఎలా ఉంటుందంటే… రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఇసుక మాఫియా విషయంలో అక్కడి దళిత బిడ్డలును ఎంతటి టార్చర్ పెట్టారో దేశానికంతా తెలుసు. అప్పుడు బండి సంజయ్ సీరియస్ గా తీసుకోవడంతో బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ కూడా జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కమిషన్ సభ్యులు రాములు గారు కూడా నేరెళ్ల గ్రామానికి వచ్చి విచారణ జరిపారు. ఇదంతా బాగానే ఉన్న ఆ తరువాత ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక ఏమైంది..? ఈ నివేదిక ఆధారంగా చర్యలు ఎవరిపై తీసుకున్నారు..? బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరుపున ఇచ్చిన భరోసా ఏమిటీ అన్నది తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. ఈ అంశంపై ఎంపీగా గెల్చిన సంజయ్ ఓ సారి ఎస్టీ కమిషన్ సభ్యునికి పిటిషన్ ఇచ్చి నివేదిక కోసం ప్రయత్నించినట్టు డ్రామాలు ఆడాడు తప్ప కమిషన్ రిపోర్టు మాత్రం బయటకు రాలేదు. ఇంతవరకూ ఈ అంశం గురించి మళ్లీ ఎంపీ బండి సంజయ్ ఎందుకు పట్టించుకోలేదు..? బాధితులకు న్యాయం చేసే విధంగా బాధ్యులపై చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేయలేదెందుకు అన్నదే మా ప్రశ్న. అంటే బండి సంజయ్ ఇలాంటి అంశాలను వెలుగులోకి తీసుకరావడం దాని ద్వారా ప్రజల్లో లబ్ది పొందడం ఆ తరువాత చేతులు ముడుచుకుని కూర్చోవడానికి మొగ్గు చూపుతున్నారని అర్థం అవుతోంది. కాబట్టి కరీంనగర్ సమాజం ముందు సంజయ్ ని ఎలా నిలబెట్టాలో ఇక్కడి ప్రజలే నిర్ణయించాలని వేడుకుంటున్నా. ఇక్కడి ప్రజలు, యువతలో భావోద్వేగాలను రగిల్చి ఆయన పబ్బం గడుపుకోవడం తప్ప మరోటి చేయరు. కరీంనగర్ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న గంగుల కమలాకర్ కుటుంబానికి గ్రానైట్ వ్యాపారంతో సంబంధాలు ఉన్నందున ముందు రచ్చ చేసి ఆ తరువాత ఊరుకోవడం, నేరెళ్ల ఘటనను పట్టించుకోకపోవడమే ఆయన వైఖరికి సాక్షిభూతంగా మేం చెప్తున్నాం.
Disha Dasha
1884 posts