దిశ దశ, దండకారణ్యం:
దండకారణ్య అటవీ ప్రాంతంలో వైమానిక దాడులు మళ్లీ తెరపైకి వచ్చాయి. వైమానిక దాడులపై మావోయిస్టు పార్టీ ఓ ప్రకటనతో పాటు కొన్ని ఫోటోలను కూడా మీడియాకు విడుదల చేసిందిదండకారణ్య అటవీ ప్రాంతంలో వైమానిక దాడులు మళ్లీ తెరపైకి వచ్చాయి. వైమానిక దాడులపై మావోయిస్టు పార్టీ ఓ ప్రకటనతో పాటు కొన్ని ఫోటోలను కూడా మీడియాకు విడుదల చేసింది. . ఈ నెల 7వ తేది రాత్రి 11.45 నిమిషాల ప్రాంతంలో బలగాలు వైమానిక దాడులకు పాల్పడ్డాయని మావోయిస్టు పార్టీ ఆరోపిస్తోంది. దక్షిణ బస్తర్ ఏరియా డివిజన్ కమిటీ గంగా పేరిట విడుదలైన ఈ ప్రకటనలో సరిహద్దు అటవీ ప్రాంతంలో జరుగుతున్న దాడులతో జరిగిన నష్టాన్ని వింరించారు. చత్తీస్ గడ్ లోని బీజాపూర్ సరిహద్దు ప్రాంతాల్లోని పాలగూడ, ఇట్టగూడ, జిలోర్గడ, గొమ్మగూడ, కంచల్ గ్రామాల సమీప అటవీ ప్రాంతాల్లో ఈ వైమానిక దాడులు జరిగాయని, సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ దాడుల్లో రాకెట్ లాంఛర్లను కూడా ఉపయోగించారని సౌత్ బస్తర్ ఏరియా డివిజన్ కమిటీ పేర్కొంది. రాకెట్ లాంఛర్ల ద్వారా 30 వరకు బాంబులను పేల్చారని, ఈ బాంబులు పడిపోయిన ప్రాంతం నుండి 100 నుండి 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు నాశనం కావడంతో పాటు వన్యప్రాణులు కూడా ప్రాణాలు కోల్పోయాయన్నారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ ‘‘కగార్’’ పేరిట రాత్రి పగలు దాడులకు పాల్పుడతున్నారంటూ గంగా ఆందోళన వ్యక్తం చేసింది. వేసవి కాలం కావడంతో ఆయా ప్రాంతాల్లో నివసించే గిరిజనులు ఇప్పపూలను సేకరించేందుకు అడవుల్లో సంచరిస్తుంటారని, వన్యప్రాణులు వచ్చే అవకాశం ఉంటుందని వాటిని నిలువరించేందుకు గిరిజనులు ఇప్పచెట్ల వద్దే ఎక్కువ సమయం కాపలా ఉంటారన్నారు. వైమానిక దాడులతో అటవీ ఉత్పత్తులు సేకరించే గిరిజనులతో పాటు సమీప గ్రామాలకు చెందిన వారు కూడా భయాందోళనకు గురై బాంబుల దాడులకు చిక్కకుండా తప్పించుకోవల్సి వచ్చిందని గంగా వివరించారు. గత నాలుగు నెలల్లో సౌత్ బస్తర్ డివిజన్ లోని బీజాపూర్, సుక్మా జిల్లాల్లో 11 ఫార్వార్డ్ ఆఫరేషన్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారని, వీటిలో సీఆర్పీఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్, డీఆర్జీతో పాటు ఇతరాత్ర బలగాలను మోహరించారన్నారు. బేస్ క్యాంపుల్లో ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన డ్రోన్లను కూడా అందుబాటులో ఉంచారని, ట్రక్కుల కొద్ది ఆధునిక ఆయుధాలు సమకూర్చారని, మందుగుండు సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచారని గంగా ఆరోపించింది. 81 మి.మి., 51 మి.మి. మోర్టార్లను డ్రోన్ల ద్వారా పేల్చుతున్నారన్నారు. ఆదివాసీలపై ఆదిపత్యం చెలాయించేందుకు భీకర పోరుకు శ్రీకారం చుట్టిందని సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఆరోపించింది. ప్రతి 2 నుండి 3 కిలోమీటర్ల పరిధిలో క్యాంపులను ఏర్పాటు చేసి సౌత్ బస్తర్ అటవీ ప్రాంతాన్ని బలగాలతో నింపేశారని గంగా ఆరోపించారు.