అతి పెద్ద రేడియో నెట్‌వర్క్‌ల్లో ‘ఆకాశవాణి’ ఒకటి

ఏదైనా సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే ప్రస్తుతం సోషల్ మీడియా ఉంది కానీ, ఒకప్పుడు సమాచారం కోసం రేడియో పైనే ఆధారపడేవారు. అప్పట్లో ప్రభుత్వ రేడియో కేంద్రం ఆకాశవాణి ఎప్పటికప్పుడు విశ్వసనీయ వార్తలను అందిస్తూ, ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తున్నప్పటికీ, రేడియో శ్రోతలు ఇంకా ఉన్నారు.

భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాలు 1923 జూన్‌లో ‘రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి’ ద్వారా ప్రసారం చేయబడ్డాయి. దీని తర్వాత ‘బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ’ ఏర్పాటు చేయబడింది. ప్రయోగాత్మకంగా జూలై 1927లో కలకత్తా, బొంబాయి నగరాలలో ‘ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ’ ప్రసారాలు చేసింది. ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ప్రసారాలు చేసింది. 1936 సంవత్సరములో ఆకాశవాణి ప్రభుత్వ సంస్ధగా అవతరించింది.

ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా.. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆసక్తికర సమాచారం వెల్లడించింది. 75 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఆకాశవాణి… ప్రసార భాషలు, శ్రోతల సంఖ్య, విస్తీర్ణం తదిరత అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రసార నెట్ వర్క్ లలో ఒకటిగా నిలిచిందని పేర్కొంది. దేశవ్యాప్తంగా 92 శాతం విస్తీర్ణంలో 467 కేంద్రాలు ఉండగా.. 99.19 శాతం మందికి రేడియో అందుబాటులో ఉంది. ఆకాశవాణి 23 భాషల్లో, 146 మాండలికాల్లో ప్రసారాలు కొనసాగిస్తోంది. ఆకాశవాణి 662 బ్రాడ్ కాస్టింగ్ ట్రాన్స్ మిటర్లు, 432 ఎఫ్ఎం రేడియో ట్రాన్స్ మిటర్లు కలిగి ఉందని పేర్కొంది.

ఆకాశవాణి నెట్‌వర్క్‌లో ఒక్కరోజులో 647 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. భారతీయ, విదేశీ భాషల్లో ప్రసారాలు సాగిస్తున్న ఆకాశవాణికి 47 ప్రాంతీయ వార్తా విభాగాలు, 116 ప్రాంతీయ చానళ్లు, వివిధ భారతి స్టేషన్లు, 17 లైవ్ స్ట్రీమింగ్ చానళ్లు ఉన్నాయి. భారత్‌లోనే కాదు ఆస్ట్రేలియా, దక్షిణాసియా, ఆఫ్రికా, పశ్చిమ ఆసియా, బ్రిటన్, యూరప్ దేశాల్లోనూ ఆకాశవాణి ప్రసారాలు వినిపిస్తాయని పేర్కొంది.

You cannot copy content of this page