తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2022 పరీక్ష రాసే అభ్యర్థులకు ఉస్మానియా యూనివర్సిటీలోని సెట్ కార్యాలయం అలర్ట్ జారీ చేసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 13న జరగాల్సిన పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే 14, 15వ తేదీల్లో జరగాల్సిన టీఎస్ సెట్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని సెట్ సభ్య కార్యదర్శి ఆచార్య మరళీకృష్ణ స్పష్టం చేశారు.
అలాగే వాయిదా వేసిన పరీక్షను మార్చి 17వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. సెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 10 వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పలు సబ్జెక్టులకుగానూ టీఎస్ సెట్ కోసం 50 వేల మందికిపైగా దరఖాస్తు చేస్తున్నారు. పరీక్షల కోసం తెలంగాణలో పది పరీక్షా కేంద్రాలతో పాటు ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, విజయవాడలో నాలుగు సెంటర్లను ఏర్పాటు చేశారు.
ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించనున్నారు. రెండు పేపర్లు ఉంటారు. పేపర్ 1 లో 50 ప్రశ్నలకు గాను 100 మార్కులు.. పేపర్ 2 లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. 29 సబ్జెక్టులలో ఈ టెస్ట్ జరుగుతుంది. టీఎస్ సెట్‌ను చివరిసారిగా 2019లో నిర్వహించారు. తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్ కు సంబంధించి హాల్‌టికెట్లను మార్చి 1న అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, విజయవాడ, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం పట్టణాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేశారు.