మహా ప్రస్థాన… ప్రస్థానం…

‘అలిశెట్టి’ కవితలు ఆంగ్ల అనువాదం…

ఇంగ్లీష్ ఉపాధ్యాయుని సరికొత్త ప్రయత్నం…

దిశ దశ, హుజురాబాద్:

మ్మ చేతి గోరుముద్దలు తింటూ పురాణ ఇతిహాసాల గురించి తెలుసుకున్నారు… అస్త్రశస్త్రాల వినియోగంలో పరాక్రమవంతుల గొప్పతనం గురించి తల్లి వివరించిన తీరు గుండెల్లో పదిలంగా దాచుకున్నారు. తల్లి అడుగుజాడల్లో నడిచిన ఆ యువకుడు విద్యనందించే గురువుగా బడి బాట పట్టారు. విద్యార్థులను తీర్చిదిద్దే పనితో పాటు సామాన్యుడి జీవితానికి నిలువుటద్దం పట్టే కవితల సమాహారాన్ని ఆంగ్లీకరించే ప్రయత్నంలో నిమగ్నం అయ్యారు.

వైవిద్యంగా…

తెలుగు పాఠ్యాంశ బోధనలు చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న తన తల్లి చెప్పిన పాఠాలపై సంపూర్ణ అవగాహన పెంచుకున్న కొత్తకొండ మనోజ్ వైవిద్యంగానే ముందుకు సాగారు. తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా అమ్మ సేవలు అందిస్తే మనోజ్ మాత్రం ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశారు. కాకతీయ యూనివర్శిటీలో చదువుకుంటున్న క్రమంలో శ్రీశ్రీ రచించిన మహా ప్రస్థానం పఠించిన ఆయన తెలుగు భాషపై ఆసక్తిని పెంచుకుని ఎంఏ తెలుగు పూర్తి చేశారు. బీఈడీ పట్ట భద్రుడైన మనోజ్ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ గా బాద్యతలు నిర్వర్తిస్తున్నారు. హుజురాబాద్ లో నివాసం ఉంటున్న ఆయన అలిశెట్టి కవితా సంకలనాలను చదివిన తరువాత వాటిని ఇంగ్లీష్ లోకి అనువదించాలని భావించి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు. ‘‘A Progressive Rendering’’ పేరిట అలిశెట్టి రచించిన సిటీ లైఫ్ కవితలను ఇంగ్లీష్ లోని తర్జుమా చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన సంగనబట్ల చిన్న రామకృష్ణయ్య చిన్నారుల కోసం రచించిన వెయ్యి కథల్లో కొన్నింటిని ఎంపిక చేసుకుని ‘‘The Scorpion’s Awakening and other stothes’’ పేరిట మరో పుస్తకాన్ని కూడా అనువాదం చేసిన మనోజ్ సంఘ సంస్కర్తల గురించి కూడా వెలుగులోకి తీసుకవచ్చే ప్రయత్నం చేశారు.

తరగతి గదిలో…

పుస్తక విజ్ఞానానికే పరిమితం కాకుండా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు మనోజ్ కుమార్. సామాజిక అంశాలతో పాటు మానవ సంబంధాలు వాటి విలువలను కూడా స్టూడెంట్స్ కు వివరిస్తూ వారిలో సామాజిక సృహను కల్పించేందుకు శ్రమిస్తున్నారు. పుస్తకాల్లోని పాఠ్యాంశాన్ని సంపూర్ణంగా చదివి వాటిలోని నిగూఢతను విద్యార్థులకు సవివరింగా తెలియజేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు టీచర్ మనోజ్. ప్రధాని నరేంద్ర మోడి నిర్వహించిన పరీక్షా పే చర్చ అన్న అంశంపై తాను గమనించిన అంశాలను వివరిస్తూ ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. మనోజ్ సూచించిన అంశాలను పరిశీలించిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ప్రత్యుత్తరం పంపించారంటే ఆయనలోని జిజ్ఞాస ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లీష్ దినపత్రికలకు ప్రత్యేకంగా వ్యాసాలు రాస్తున్న మనోజ్ తన ఇంటిలోని ఓ గదిని ప్రత్యేకంగా గ్రంథాలయంగా మార్చుకుని నిత్య విద్యార్థిగా మారిపోయిన తీరు ఆదర్శప్రాయమనే చెప్పాలి.

ముందుమాట మాధ్యుర్యం: కొత్తకొండ మనోజ్

అలిశెట్టి ప్రభాకర్ రచించిన సిటీ లైఫ్ కవితలను ఇంగ్లీష్ భాషలోకి అనువదించిన తరువాత కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహిత వారాల ఆనంద్ కు పంపించాను. అలిశెట్టి కవితా సంకలనాలను ఇంగ్లీష్ భాషలోకి అనువదించిన తీరును పరిశీలించి తనకు సలహాలు సూచనలు ఇవ్వాలని అభ్యర్థించాను. కానీ నేను ఊహించని విధంగా వారాల ఆనంద్ ముందు మాట రాసి పంపించడం నాలో సరికొత్త ఉత్సహాన్ని నింపింది. తప్పిదాలు ఎత్తి చూపితే వాటిని సవరించుకోవాలని భావిస్తే వారు నాపై చూపిన ఆదరణ జీవితంలో మధురానుభూతిని అందించింది. సీనియర్ జర్నలిస్టులతో పాటు పలువురు నేను ఇంగ్లీష్ లోకి తర్జూమా చేసిన రచనలను అసాంతం చదివి అభినందించిన తీరు అబ్బురపరిచింది. వారి ఇన్సిపిరేషన్ తో మరిన్ని ఆవిష్కరణలే చేయాలన్న తపన నాలో మొదలైంది. నేను చేస్తున్న ప్రయత్నాలకు వెన్నుదన్నుగా ప్రతి ఒక్కరూ నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. తపస్వి మనోహర్ పబ్లికేషన్స్ యాజమాన్యం కూడా నాకు అండగా నిలిచి నా రచనల ముద్రణ విషయంలో బాసటగా నిలవడం నాలో మరింత స్పూర్తిని నింపింది.

You cannot copy content of this page