అరుదైన కార్యక్రమానికి ముస్తాబు…
దిశ దశ, కాళేశ్వరం:
కాశీనాన్ మరణాన్ ముక్తి… కాళేశ్వరస్య దర్శనాన్ ముక్తీ… కాశీలో మరణించిన వారికి ముక్తిని ప్రసాదిస్తే… కాళేశ్వరాన్ని దర్శించుకున్న వారికి ముక్తిని ప్రసాదిస్తాడు ఆ బోళా శంకరుడు అని పురాణాలు చెప్తున్నాయి. దేశంలోనే అత్యంత అరుదైన క్షేత్రాల్లో ఒకటిగా కీర్తించబడుతున్న కాళేశ్వరానికి ఉన్న ప్రత్యేకతలు అన్ని ఇన్ని కావు. ప్రయాగ రాజ్ తరువాత త్రివేణి సంగమం ఏర్పడింది ఇక్కడే కావడం ఒకటైతే… త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా బాసిల్లుతోంది. అరుదైన ఆలయాల సమాహారంగా వెలిసిన కాళేశ్వర క్షేత్రం చాలా కాలం తరువాత అరుదైన కార్యక్రమానికి నోచుకుంది. 42 ఏళ్ల తరువాత కుంబాభిషేకం కార్యక్రమం ఇక్కడ నిర్వహించబోతున్నారు రుత్వికులు. శుక్రవారం నుండి మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి తుని తపోవన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో శతచండీ మహారుద్ర సహిత సహస్ర ఘటాభిషేకం, కుంబాభిషేకం నిర్వహిస్తున్నారు. 1982 తరువాత ఈ అరుదైన కార్యక్రమాన్ని కాళేశ్వరంలో నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ఉన్న ఈ ఆలయానికి గోదావరి నదికి అవతలి వైపున మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా విస్తరించి ఉండగా, మరో వైపున మంచిర్యాల జిల్లా చెన్నూరు ఉంది.
జీర్ణోద్దారణతో…
1970వ దశాబ్దాంలో కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి క్షేత్రం రూపు రేఖలు మారిపోయాయి. కీకారణ్యంలో ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించేందుకు కాలి బాటన, ఎద్దుల బండ్లపై వెల్లి దర్శించుకునే వారు ఈ ప్రాంత వాసులు. శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని వెలుగులోకి తీసుకరావాలని సంకల్పించారు శృంగేరి పిఠాధిపతి. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కరీంనగర్ ఎమ్మెల్యే జువ్వాడి చొక్కారావును శృంగేరి పీఠాధిపతి ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. కాళేశ్వరం క్షేత్రాన్ని అభివృద్ది చేయాల్సిన బాధ్యతలు అప్పగించి, క్షేత్రం ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి హోదాలో చొక్కారావు రహదారులు కూడా లేని కాళేశ్వరానికి చేరుకుని జీర్ణోద్దారణ కోసం పూనుకున్నారు. మహదేవపూర్ నుండి కాళేశ్వరానికి రోడ్డు సౌకర్యం కూడా లేని ఆ కాలంలో చొక్కారావు స్థానికంగా ఉన్న పండితులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న వేద పండితులను కాళేశ్వరం క్షేత్రానికి తీసుకవచ్చి జీర్ణోద్దారణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జీర్ణోద్దారణ కార్యక్రమం 1982లో పూర్తి అయిన తరువాత ఆలయ రూపు రేఖలే మారిపోయాయి. అప్పుడు శృంగేరీ పీఠాధిపతి కుంబాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఆలయంలో కుంబాభిషేకం కార్యక్రమం జరపలేదని కాళేశ్వరం ఆలయ ప్రధాన అర్చకుడు పనకంటి నగేష్ శర్మ తెలిపారు. 42 ఏళ్ల తరువాత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దేవాదాయ శాఖ అధికారులు మూడు రోజుల పాటు నిర్వహించ తలపెట్టారు. వచ్చే మే నెలలో ప్రాణహిత పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ముందుగా కుంబాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంత రాష్ట్ర సరిహధ్దు ప్రాంతం కావడంతో పాటు గోదావరి నది ఒడ్డున వెలిసిన ఈ ఆలయ సమీపంలోనే మహారాష్ట్ర మీదుగా వస్తున్న ప్రాణహిత నది గోదావరి నదిలో కలుస్తోంది. ఇక్కడే అంతర్వాహినిగా సరస్వతి నది కలుస్తోందని చరిత్ర చెబుతోంది. మూడు నదుల సంగమంగా భాసిల్లుతున్న ఈ క్షేత్రంలో మూడు నదులకు పుష్కరాలు జరిపించే ఆనవాయితీ కూడా కొనసాగుతోంది. 7వ తేదిన ప్రారంభం కానున్న ఈ ప్రత్యేక కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఏర్పాట్లు పూర్తి…
శుక్రవారం నుండి ప్రారంభం కానున్న కుంబాభిషేకం కార్యక్రమ ఏర్పాట్లు పూర్తి చేశారు దేవాదాయ శాఖ అధికారులు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. అలాగే కాళేశ్వరం క్షేత్రంలో భారీ బందోబస్తు చేపట్టేందుకు కూడా బలగాలను మోహరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.