కనీస వేతన చట్టం అమలుకు కృషి: అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

దిశ దశ, కామారెడ్డి:

ఎమ్మెల్సీగా గెలిచిన తరువాత కనీస వేతన చట్టం అమలు చేసేందుకు కృషి చేస్తానని అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. తనను గెలిపించి పట్టు భద్రులు గెలవాలని పిలుపునిచ్చారు. శనివారం కామారెడ్డిలో ఓటరు నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులతో పాటు కనీస వేతనాల చట్ట అమలయ్యేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. గత ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని పనికి తగ్గ వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. కోటి మంది ప్రైవేటు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి చేసి కనీస వేతన చట్టం అమలు చేసేందుకు శ్రమిస్తానన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీ లేకపోవడం బాధాకరమని, ఇక్కడి యువతకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తానని ఇందుకు అనుగుణంగా చర్యలు చేపడతానని ప్రకటించిన నరేందర్ రెడ్డి ప్రతి మూడు నెలలకు ఓ సారి ఫీజు రియంబర్స్ మెంట్ నిధులు విడుదలయ్యేలా ప్రభుత్వం దృష్టికి తీసుకవస్తానన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల ఏర్పాటు కోసం ప్రభుత్వం విధించిన నిబంధనలు కఠినంగా ఉన్నాయని వాటిని సడలించి నూతన విద్యా సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తానన్నారు.

నా వేతనం అలా…

ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత తనకు వచ్చే వేతనాన్ని సంక్షేమ నిధిలో జమ చేస్తానని అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తన వేతనాన్ని నిరుపేద విద్యార్థులు, పట్టభద్రుల సంక్షేమం కోసం వెచ్చిస్తానని ఇందులో ఒక్క రూపాయి కూడా తాను తీసుకునేది లేదని స్పష్టం చేశారు.

You cannot copy content of this page