Nalgonda Intelligence SP Kavitha: షాడో టీమ్స్… కలెక్షన్ ఆపరేషన్..?

నిఘా ఆఫీసర్ పైనే నిఘా తప్పలేదా..?

దిశ దశ, హైదరాబాద్:

ఎవరేం చేస్తున్నారు..? ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయి..? ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు ఏమైనా సాగుతున్నాయా..? ప్రతిపక్ష పార్టీ నాయకుల తీరేంటి..? అధికార పక్ష నేతల వ్యూహాలు ఏమిటీ… అధికార యంత్రాంగం ఏం చేస్తోంది ఇలాంటి అంశాలపై ఆరా తీసేందుకు అనుక్షణం నిఘా వేయాల్సిన విభాగంలో పని చేస్తున్న ఓ ఆఫీసర్ పైనే ఉన్నతాధికారులు నిఘా వేయాల్సి వచ్చింది. ఓ సీనియర్ అధికారిపై ఉన్నతాధికారులు ఆరా తీయాల్సిన పరిస్థితి వచ్చింది. నల్లగొండ జిల్లా ఇంటలీజెన్స్ ఎస్పీగా పనిచేస్తున్న గంజి కవితపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా వేయక తప్పలేదు. బాధితులు రాసిన లేఖలు హైలెవల్ ఆఫీసర్స్ ముందుకు వచ్చిపడడంతో అసలేం జరుగుతోందన్న వివరాలు తెలుసుకోక తప్పలేదు. 9 పేజీల సుదీర్ఘమైన లేఖ రాసిన బాధితుడు ఇంటలీజెన్స్ ఎస్పీ గంజి కవిత అసలేం చేస్తున్నారు..? నిఘా మాటున కింది స్థాయి సిబ్బంది దగా చేస్తున్నారన్న రీతిలో ఆ లేఖలో వివరించారు. ఈ లేఖ కాస్తా లీకు కావడంతో ఇంటలీజెన్స్ విభాగంతో పాటు రాష్ట్ర పోలీసు వర్గాల్లోనూ సంచలనంగా మారింది.

ఆరోపణల లేఖ…

ప్రత్యేకంగా ఓ షాడో టీమ్ ఏర్పాటు చేసుకున్న ఎస్పీ గంజి కవిత అక్రమ వ్యవహారాలు నిర్వహించేందుకు వారిని పురమాయించారని, చివరకు తన సోదరుడి క్షద్ర పూజల కోసం అవసరమైన పూజా సామాగ్రిని కూడా కింది స్థాయి పోలీసు ఉద్యోగులచే తెప్పించుకున్నారని, కూతురు బర్త్ డే ఫంక్షన్ సందర్భంగా వసూళ్లకు పాల్పడ్డారని, రాఖీలు కట్టి మరీ ఖరీదైన చీరలు, బంగారు ఆభరణాలు బహుమతుల రూపంలో తీసుకునే వారని ఆ లేఖలో వివరించారు. ఓ సీఐ నుండి రూ. 14 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని, వటవర్ల పల్లి వద్ద నిర్వహిస్తున్న హోటల్ ఆమెదేనని, ఇంటితో పాటు హోటల్ కు అవసరమైన సామగ్రిని పంపిచాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నారు. ఏడేళ్లుగా నల్లగొండలోనే పనిచేస్తున్న ఆమె పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆ లేఖలో వివరించారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓ పత్రిక రిపోర్టర్ చే కథనాలు కూడా రాయించారని, పోలీసులు అవినీతి పరులు అంటూ తరుచూ పై అధికారులకు నివేదికలు పంపిస్తుంటారని కూడా ఆ లేఖలో వివరించారు. పోలీసు విభాగంలోనే అధికారిగా పని చేస్తున్న ఆమె భర్త గురించి కూడా ఈ లేఖల్ ప్రస్తావించడం గమనార్హం. ఉన్నతాధికారుల వద్దకు చేరిన ఈ లేఖ ఆదారంగా పోలీసు అధికారులు స్పెషల్ టాస్క్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఆమెను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు వచ్చాయి.

నివేదికలు సరైనవేనా..?

నల్లగొండ ఇంటలీజెన్స్ ఎస్పీ గంజి కవితపై తాజాగా వచ్చిన ఆరోపణలు కొత్త అనుమానాలకు తెరలేచినట్టయింది. ఏడేళ్లుగా అదే జిల్లాలో పని చేస్తున్న ఆమె నేతృత్వంలో ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి చేరిన నివేదికల్లో ఎంత మేర విశ్వసనీయత ఉండి ఉంటుందన్న చర్చ కూడా ఇంటలీజెన్స్ వర్గాల్లో సాగుతోంది. ఈ విభాగం నుండి వెల్లే కాన్ఫిడెన్షియల్ రిపోర్టులను ప్రభుత్వం ఎక్కువ శాతం పరిగణనలోకి తీసుకుంటుంది. పోలీసు విభాగంలో లూప్ లైన్ వింగ్స్ లో ఒకటైన ఇంటలీజెన్స్ విభాగానికి అత్యంత ప్రత్యేకత ఉంటుంది. నిఘా విభాగం నుండి పైకి చేరే ప్రతి అంశాన్ని కూడా అత్యంత విశ్వసనీయంగా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే తాజాగా ఆమెపై బయటకు వచ్చిన 9 పేజీల లేఖ వల్ల అధికారులకు సరికొత్త అనుమానాలు వస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇంతకాలం నల్లగొండ జిల్లా నుండి వచ్చిన నివేదికల్లో తప్పిదాలు జరిగి ఉంటాయా వాస్తవ విషయాలే తమకు చేరాయా అన్న విషయంపై కూడా తర్జనభర్జనలు సాగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

వర్గపోరా..?

మరో వైపున నల్లొండ జిల్లాలో రెండు లూప్ లైన్ విభాగాల మధ్య కోల్డ్ వార్ కూడా నడుస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇంటలీజెన్స్ విభాగంతో పాటు లా అండ్ ఆర్డర్ విభాగంతో అనుబంధంగా ఉంటే మరో లూప్ లైన్ వింగ్ మధ్య విబేధాలు పొడసూపాయన్న ప్రచారం కూడా సాగుతోంది. నిఘా విభాగం నుండి తరుచూ తమపై వెలుతున్న నివేదికల నేపథ్యంలో ఇతర విభాగానికి చెందిన వారూ కూడా కస్సుబుస్సుగా ఉన్నట్టుగా పోలీసు వర్గాల్లో టాక్. ఈ నేఫథ్యంలోనే ఎస్పీ గంజి కవితపై లేఖ వెలువడడం వెనక ఏదో గూడుఫుఠాని జరిగి ఉంటుందన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా పోలీసు విభాగంలో నాన్ క్యాడర్ ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారిపై అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు రావడం మాత్రం సంచలనంగా మారింది.

You cannot copy content of this page