పుట్ట మధుపై ఆరోపణలు

కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీపీ

తనను టార్గెట్ చేశారంటూ ఆవేదన

పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుపై మరోసారి ఆరోపణలకు దిగారు మహిళా ఎంపీపీ. మధుతో పాటు ఆయన అనుచరులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. గతంలోనూ ఈ మహిళా ఎంపీపీ పుట్ట మధు అనుచరుడి కారణంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ మీడియా ముందు ఆరోపణలు చేయడం… తాజాగా పుట్ట మధు లక్ష్యంగా విమర్శలు చేయడం కలకలం సృష్టిస్తోంది.

ఆ ఇద్దరి బారి నుండి కాపాడండి…

జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, ఆయన అనుచరుడు పూదరి సత్యనారాయణల బారి నుండి తనను కాపాడాలని పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిషత్ అధ్యక్షురాలు ఆరెల్లి దేవక్క కొమురయ్య వేడుకున్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్టాడుతూ… మండలం మొత్తం పూదరి సత్యనారాయణ గుప్పిట పెట్టుకుని అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ తమపైకి ఉసిగొల్పుతున్నారన్నారు. కొత్త కొత్త ఆదేశాలు ఇప్పిస్తూ తనను ఇరుకున పెడుతున్నారని, కావాలని చెక్ బౌన్స్ కేసు పెట్టించారని మండిపడ్డారు. తన సొంత పత్రికలో బూతు రాతలు రాస్తూ మహిళా సమాజం తలదించుకునే పదాలను ఉపయోగించారని దేవక్క ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ మహిళా నాయకురాలినని కూడా చూడకుండా కక్ష్య సాధింపులకు గురి చేస్తున్నారని, చెక్ బౌన్స్ కేసు విషయంలో జడ్పీ ఆఫీసులో మాట్లాడుకుందామని పిలిపించుకుని ఇష్టారీతిన దూషించాడని ఆరోపించారు.

బహుజన వాదం అంటే ఇదేనా..?

బహుజనం వాదం మహిళా అభ్యున్నతి అంటే తనను వేధించడమేనా..? సొంతపార్టీ నాయకురాలినైన తనపై కేసు పెట్టించి జైలుకు పంపిస్తారా మధన్న అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తాను ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్నా తనను ఇక్కట్లకు గురి చేస్తున్నారని దేవక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోయిన ఎంపీటీసీ పూదరి సత్యనారాయణ, మంథని ఇంఛార్జి పుట్ట మధులు కావాలని తనకు ఆటంకాలు సృష్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లో చేరిన వైస్ ఎంపీపీకి రూ. 10 లక్షలు ఇవ్వాలంటే తాను పొలం అమ్ముకుని డబ్బులు ఇచ్చానని, ఆ తరువాత పూదరి సత్యనారాయణ మిగతా ఎంపీటీసీలను తనపై ఉసిగొల్పి డబ్బులు అడగాలని గొడవ పెట్టించాడని, తనతో కావాలనే బ్లాంక్ చెక్ ఇప్పించాడని ఆవేదన వ్యక్తం చేశారు.

You cannot copy content of this page