ఆరోపణల పర్వంలో ఆ అధికారి… కరీంనగర్ కమిషనర్ గా సరెండర్…

దిశ దశ, హైదరాబాద్:

గ్రూప్ వన్ సర్వీసెస్ నుండి ఐఏఎస్ అధికారిగా ఎదిగిన ఆయనను  ఆరోపణలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  వివిధ ప్రాంతాల్లో పనిచేసిన ఆయన మొదట్లో డైనమిక్ ఆఫీసర్ గా పేరందుకున్నారు. ఆ తరువాత ఆయనను ఆరోపణలు చుట్టు ముడుతుండడం సంచలనంగా మారింది. తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో మరోసారి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

అమోయ్ కుమార్…

ఉమ్మడి నల్గొండ జిల్లా వాసి అయిన అమోయ్ కుమార్ గ్రూప్ వన్ సర్వీసుకు ఎంపికయిన తరువాత జగిత్యాల జిల్లాలో ప్రొబేషనరీ అధికారిగా వ్యవహరించి అక్కడే ఆర్డీఓగా కూడా బాధ్యతలు నిర్వహించారు. జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఉమ్మడి రాష్ట్ర మంత్రి ఒకరిని కలిసేందుకు వెల్లినప్పుడు గన్ మెన్లు మామూళ్లు అడిగారన్న విషయంపై చర్చ జరిగింది. ఆర్డీఓ స్థాయి అధికారినే అంగరక్షకులు మామూళ్లు అడగడంపై అధికార వర్గాల్లో కలకలం లేచింది. డైనమిక్ ఆఫీసర్ గా పేరున్న ఆయనను డబ్బులు అడిగారన్న విషయంపై అప్పటి పోలీసు అధికారుల దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లినట్టుగా ప్రచారం జరిగింది. ఆ తరువాత కొంత కాలానికి కరీంనగర్ మునిసిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు అమోయ్ కుమార్.  మంచి పేరున్న అధికారి కావడంతో అమోయ్ కుమార్ పేరును అప్పటి అధికారులు సిఫార్సు చేసి మరీ కరీంనగర్ బల్దియా కమిషనర్ గా పోస్టింగ్ ఇప్పించారు. మునిసిపాలిటీలో ఓచర్ బిల్లుల వ్యవహారానికి సంబంధించిన అంశం వెలుగులోకి రావడం… ఈ వ్యవహారంలో ఆయనపై కూడా ఆరోపణలు చుట్టు ముట్టడంతో అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా  వ్యవహరిస్తున్నాని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు వెల్లడంతో సూర్యపేటలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనను తప్పించాలని కమిషన్ ఆదేశించింది. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చింది. రాష్ట్రంలోనే ప్రయారిటీ జిల్లాల్లో రంగారెడ్డి టాప్ లో ఉండడం, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఆ జిల్లా బాధ్యతలు అప్పగించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఎన్నికల కమిషన్ జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చిందన్న చర్చ కూడా అధికార వర్గాల్లో సాగింది. అయితే ఇదే జిల్లాలో జరిగిన వ్యవహారాలకు సంబంధించిన విషయంలోనే ఆయనకు ఈడీ నోటీసులు ఇచ్చే పరిస్థితికి చేర్చాయని తెలుస్తోంది. ఎన్ ఫోర్స్ డైరక్టరేట్ అధికారుల ముందు హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తరువాత అమోయ్ కుమార్ విషయంలో తీసుకునే నిర్ణయాలపై స్పష్టత రానుంది.

కాళేశ్వరం ప్రాజెక్టు…

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా కూడా పనిచేసిన అమోయ్ కుమార్ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం భూ సేకరణ చేయడంలో సఫలం అయ్యారన్న పేరు గడించారు. జిల్లాలోని మహదేవపూర్ మండలం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు, కన్నెపల్లి పంపు హౌజ్ ల కోసం భూ సేకరణలో కీలకంగా వ్యవహరించారన్న విషయంతోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన వారి  దృష్టిలో మంచి అధికారిగా పేరందుకున్నారన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఆ తరువాతే ఆయనకు ప్రముఖ జిల్లాల్లో పోస్టింగులు వచ్చాయన్న వాదనలు కూడా లేకపోలేదు. ఎన్నికల కమిషన్ కారణంగా రంగారెడ్డి జిల్లాకు బదిలీపై వెళ్లిన అమోయ్ కుమార్ ఇప్పుడు ఈడీ నుండి నోటీసులు అందుకోవడంతో రాష్ట్ర అధికార వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది.

You cannot copy content of this page