పుట్ట మధుపై మహిళా ఎంపీపీ ఫిర్యాదు
దిశ దశ, మంథని:
అధికార బీఆర్ఎస్ పార్టీలో ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగే పరిస్థితికి చేరుకున్నట్టుగా ఉంది. తనను ఇష్టారీతిన తిట్టాడంటూ పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్, మంథని బీఆర్ఎస్ ఇంఛార్జి పుట్ట మధుపై ఓ మహిళా ఎంపీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని రామగిరి ఎంపీపీ అరెల్లి దేవక్క పార్టీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఇటీవలే పుట్ట మధుపై దేవక్క ఆరోణలు చేశారు. అయితే ఆమె ఆరోపణలు తిప్పి కొడ్తూ రామగిరి వైస్ ఎంపీపీతో పాటు మంథని ప్రాంతానికి చెందిన నాయకులు కౌంటర్లకు దిగారు. తాజాగా దేవక్క పుట్ట మధుపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. పుట్ట మధుతో పాటు మరో బీఆర్ఎస్ నాయకుడు పూదరి సత్యనారాయణ గౌడ్ కూడా తమను ఇబ్బందుకుల గురి చేస్తున్నాడంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీపీగా ఎన్నికయినప్పటి నుండి సోషల్ మీడియాలో తానో మహిళ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు రాతలు రాసి తన పరువుకు భంగం కలిగించాడని ఆరోపించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గం ఇంచార్జ్ అయిన పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ గారికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. తాను ఎంపీపీగా ఎన్నికయ్యే ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన కాపుర బోయిన శ్రీదేవి భాస్కర్ అనే అభ్యర్థికి తన నుండి రూ. పది లక్షలు ఇప్పించి ఆమెకు వైస్ ఎంపీపీ పదవి ఇచ్చారన్నారు. మిగతా బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలకు సైతం తలా రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని అందుకోసం మా వద్ద నుండి ఖాళీ చెక్కులను ఇప్పించారని దేవక్క ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మగా వచ్చిన డబ్బులను వైస్ ఎంపిపికి ఇచ్చామని, పార్టీ కోసం కూడా కొంత ఖర్చు పెట్టుకున్నామని, బీఆర్ఎస్ ఎంపీటీసీలకు ఇవ్వడానికి తన వద్ద డబ్బు లేదని చెప్పినా వినకుండా ముగ్గురు ఎంపీటీసీలు మాపై చెక్ బౌన్స్ కేసులు వేశారన్నారు. పార్టీ ఇంఛార్జిగా సమస్యను పరిష్కరించాలని పుట్ట మధు గారికి ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. కేసు వాపసు తీసుకోకుంటే జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని బతిమిలాడగా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పెద్దపల్లి జిల్లా పరిషత్ కార్యాలయానికి పిలిపించుకొని మహిళా ప్రజా ప్రతినిధి అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో తిట్టారని ఆరోపించారు. అంతేకాకుండా మిమ్మల్ని అన్నిరకాలుగా అణిచివేస్తానని హెచ్చరించారని, ఆయన మాటలను బట్టి తమకు ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆత్మ గౌరవాన్ని చంపుకోలేక మీడియా ముందు పూదరి సత్యనారాయణ, పుట్ట మధన్నలతో ప్రాణభయం ఉందని ఆవేదన వెలిబుచ్చామని చెప్పారు. అంతేకానీ పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించలేదన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న పుట్ట మధు సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు వ్యతిరేకంగా మాట్లాడే కదిరి కృష్ణను తీసుకొచ్చి నియోజకవర్గంలో బహుజన వాదం పేరుతో సదస్సులు నిర్వహించి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు సబ్బండ వర్గాల ప్రజలకు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే, మంథని నియోజకవర్గంలో మాత్రం పుట్ట మధుకర్ గారు బ్రాహ్మణిజం, బహుజనవాదం అంటూ ప్రజల్లో చీలికలు తీసుకువచ్చేలా సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల చిత్రపటాలు లేకుండానే సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఈ విషయాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. తాను పార్టీలో ఉంటూ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా పనిచేస్తుంటే కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మవద్దని, అవసరమైతే పార్టీ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ విచారణ చేసి మేము ఏదైనా తప్పు చేశామని తేలితే మీరు ఎలాంటి చర్యలు అయినా తీసుకొవచ్చన్నారు.