కల్వకుంట్ల కుటుంబమే లక్ష్యంగా విమర్శలు

పోలీసు అధికారులపైనా ఆరోపణలు…

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

దిశ దశ, కరీంనగర్:

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించిన కుట్ర కేసులో అరెస్ట్ అయిన ఆయన శుక్రవారం ఉదయం కొద్ది సేపటి క్రితం బయటకు వచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ కుటుంబంపై ధ్వజమెత్తిన ఆయన పేపర్ల లీకేజీ విషయంపై సూటిగా మూడు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారు.

మూడు డిమాండ్లు ఇవే…

రాష్ట్రంలో జరిగిన పేపర్ల లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలని, మంత్రి వర్గం నుండి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని, పేపర్ల లీకేజీతో విలువైన జీవితాలను కోల్పోయిన నిరుద్యోగులకు రూ. లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా పేపర్లు బయటకు వచ్చాయే తప్ప నా ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. తనపై ఎందుకు కుట్ర కేసు పెట్టారు..? ఎవరో నాకు షేర్ చేస్తే దానికి నేనెలా బాధ్యుడిని అవుతాను..? కావాలని కేసులో ఇరికించారని పోలీసు విభాగమే ఆవేదన వ్యక్తం చేస్తోందన్నారు. అందరినీ తప్పుదారి పట్టించేందుకే తనను అరెస్ట్ చేశారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినే అరెస్ట్ చేశామన్న సంకేతాలు ఇచ్చి కార్యకర్తల్లో మనో ధైర్యం కోల్పోయేలా చేయాలని చూశారన్నారు. అయితే బీజేపీ కార్యకర్తలు మాత్రం ఇలాంటి వాటిని పట్టించుకోరని, సిద్దాంతం కోసం పనిచేసే బీజేపీ కార్యకర్తలు వెనకడుగు వేయరని సంజయ్ స్పష్టం చేశారు. తన సెల్ ఫోన్ పోలీసు వద్దే ఉందని ఆరోపించిన సంజయ్ మొబైల్ ఫోన్ ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు. తన మొబైల్ కాల్ రికార్డ్స్ బయటకు తీయాలని సంజయ్ సవాల్ విసిరారు. కల్వకుంట్ల కుటుంబం మనుషులైతే లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.

లీకు… లిక్కర్ వీరులు.. మీరే

రాష్ట్రంలో లీకు వీరులు, లిక్కర్ వీరులు కల్వకుంట్ల కుటుంబమేనని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. తాగు తాగించు దందాలో కల్వకుంట్ల కుటుంబం కూరుకపోయిందని బండి సంజయ్ ఆరోపించారు. లిక్కర్ సేల్స్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే, లిక్కర్ వ్యాపారంలో కూతురు భాగస్వామం అయిందన్నారు. అయ్య తాగి పాలన చేస్తుంటే బిడ్డ తాగించే దందాలో ఉందని మండిపడ్డారు. కొడుకు డ్రగ్స్ తీసుకుంటాడని సంజయ్ ఆరోపించారు.

సీపీ ప్రమాణం చెయ్…

వరంగల్ సీపీ రంగనాథ్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నా కుట్ర కోణం దాగి లేదని నేను ప్రమాణం చేస్తున్నాను… నువ్వు కూడా నీ కుటుంబ సభ్యులను పక్కన పెట్టుకుని మూడు సింహాలు ఉన్న పోలీస్ క్యాప్ పై ప్రమాణం చేసి పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రమేయం ఉందని చెప్పు అని సవాల్ విసిరారు. అసలు సీపీకి లీకేజీకి మాల్ ప్రాక్టీస్ కు తేడా తెలుసా..? పరీక్ష టైం అయిన తరువాత పేపర్ బయటకు వస్తే మాల్ ప్రాక్టీసు అంటారని, ముందుగా బయటకు వస్తే లీకేజీ అంటారన్న విషయం కూడా ఆయనకు తెలియనట్టుందని విమర్శించారు. నల్లగొండతో సహా ఇంతకు ముందు ఎక్కడెక్కడ నువ్వు పనిచేశారో వాటన్నంటిని బయటకు తీస్తామని స్పష్టం చేశారు. పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుని నాపై నిందలు మోపుతూ క్రిమినల్ కేసులు పెట్టారని, అసలు ఆ పేపర్ వాట్సప్ లోకి ఎలా వచ్చిందన్న విషయం ఎందుకు విస్మరిస్తున్నారని అడిగారు. ఎవరైనా హిందీ పేపర్ ను లీక్ చేస్తారా..? అంతకు ముందు జరిగిన తెలుగు పేపర్ గురించి విచారణ జరపలేదెందుకు..? దీని వెనక ఎన్నదెవరో తేల్చాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలుగు పేపర్ లీక్ చేసింది నీ అయ్యా తాతా, పాకిస్తాన్ వాళ్లా బంగ్లాదేశ్ వాళ్లా ముందు తేల్చాలన్నారు.

కరీంనగర్ పోలీసులపైనా…

మరోవైపున తనను అరెస్ట్ చేసిన తీరుపై బండి సంజయ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తనకు నోటీస్ ఇవ్వకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక ఎంపీనని చూడకుండా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ పోలీసు అధికారులు కొందరు డబ్బుల కోసం పోస్టింగ్ ల కోసం పనిచేస్తున్నారని, కింది స్థాయి పోలీసులు నవ్వుకుంటున్నారన్నారు. కిందిస్థాయి పోలీసులచే గొడ్డు చాకిరి చేయిస్తున్నారని వారికి ఎలాంటి న్యాయం చేయడం లేదని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన తీరుపై ఖచ్చితంగా ప్రివిలేజ్ కు వెల్తామని అప్పుడు ప్రొటెస్ట్ చేస్తే ఇప్పుడు దాడి చేశారని ఈ విషయంపై ఫిర్యాదు చేసి తీరుతామని సంజయ్ స్ఫష్టం చేశారు. నా ఇంటిపై పోలీసులు దాడి చేశారన్నారు. నక్సల్స్ ను ఎదురించి అమరులైన పోలీసు వీరులను తాము మర్చిపోలేదని వారిని ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటామన్నారు. అయితే కొంతమంది పోలీసు అధికారులు మాత్రం మర్చిపోయి డబ్బుల కోసం పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాచరిక పాలనకు కొమ్ము కాస్తున్నారని మండి పడ్డారు.

అత్త చనిపోయిన బాధలో..

నా భార్య తల్లి చనిపోయారు, 9వ రోజు పిట్టకు పెట్టే కార్యక్రమం కోసం కరీంనగర్ కు చేరుకున్నాను. మరునాడు ఉదయం నా అత్తకు పిట్టకు పెట్టే ఫార్మాలిటీ చేయాలనుకున్నాం, నా తల్లి తరువాత నన్ను తల్లిలా చూసుకున్న అత్తమ్మకు నేను చేయాల్సిన కార్యక్రమాన్ని చేయకుండా అడ్డుకున్నారు కరీంనగర్ పోలీసులు.

జైలు నుండి బయటకు వస్తున్న బండి సంజయ్

బావ బామ్మర్ధులపై ఫైర్…

మరో వైపున బండి సంజయ్ మంత్రులు తన్నీరు హరీష్ రావు, కేటీఆర్ లపై ఘాటు విమర్శలు చేశారు. నాపై పీడీ యాక్టు పెట్టడం కాదు ముందు నీపై మర్డర్ కేసు పెట్టాలని ఉద్యమంలో 1400 మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. అప్పుడు అగ్గిపెట్ట కూడా దొరకలేదా నీీకు అగ్గిపెట్టె మంత్రివి అంటూ ఎద్దెవా చేశారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి అని ప్రకటించిన వెంటనే బీఆర్ఎస్ పార్టీలోంచి జంప్ అయ్యేది మొదలు నువ్వేనంటూ బండి సంజయ్ హరీష్ రావుపై ఆరోపణల పర్వం గుప్పించారు. పిచ్చోని చేతిలో రాయిలా ఉందన్న కేటీఆర్ ను కూడా వదిలి పెట్టకుండా సంజయ్ ప్రజా సమస్యలు, ఉద్యోగులకు అశనిపాతంగా మారిన జీవోలకు వ్యతిరేకంగా, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే తాను చేస్తున్న పోరాటాలను చూసి తట్టుకోలేక పిచ్చోని చేతిలో రాయి అంటూ కేటీఆర్ వ్యాఖ్యలపై సంజయ్ మండిపడ్డారు. ఆయన చదువుకున్న తెలివిలేని వ్యక్తంటూ దుయ్యబట్టారు.

సర్దేశాయ్ వ్యాఖ్యలపై…

మరోవైపున బండి సంజయ్ సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యలను కూడా ఊటంకించిన సంజయ్ కేసీఆర్ ఫ్యామిలీపై విచారణ జరిపించాలన్నారు. ఆయన ఇతర పార్టీల వారికి ఎన్నికల ఖర్చులు భరిస్తానని చేసిన కామెంట్ ఆధారంగా కేసీఆర్ అన్ని వేల కోట్లు ఎలా సంపాదించారో బయటకు తీయాల్సిన అవసరం ఉందని సంజయ్ అభిప్రాయపడ్డారు.

అన్నా చెల్లలు ఇక జైలుకే…

చివరకు కల్లకుంట్ల తారక రామారావు, కవితలను వదిలిపెట్టకుండా సంజయ్ ఘాటైన విమర్శలు చేశారు. వారిద్దరు కూడా జైలుకు వెల్లి తీరుతారని, చెల్లెలు వంతు వచ్చిందని, ఇక మిగిలింది కేటీఆర్ వంతేనంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తానేం దందాలు చేసి జైలుకు వెల్లలేదని, మీ కుటుంబంలా లంగ, దొంగ దందాలు చేయలేదన్నారు. మీరు వేల కోట్లు ఎలా సంపాదించుకున్నారన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు మాకు శతృత్వం లేదని, అయితే తానీ విషయం భయపడి చెప్పడం లేదన్న బండి సంజయ్ జై తెలంగాణ అంటూ జెండా మోసిన మీ బ్రతుకులు ఏమయ్యాయో ఆలోచించుకోవాలన్నారు. ఆ కుటుంబం కోసం పని చేయడమేనని, కూతురు కవిత లిక్కర్ కేసులో ఇరుక్కుంటే బీఆర్ఎస్ కార్యకర్తలను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆయన కుటుంబం కోసమే మిమ్మల్ని వాడుకుంటున్నారన్న విషయం గమనించాలన్నారు. సింగరేణిలో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం చేయదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ విషయం ప్రధాని మోడీ కూడా వెల్లడించారని, కేసీఆర్ లా ప్రధాని అబద్దాలు ఆడరన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. సింగరేణి సంస్థ కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంలా మారిపోయిందన్నారు. నిన్నటి వరకు కూతురు, నేడు కొడుకు వాడుకుంటున్న ఈ సంస్థను రేపు అల్లుడు వాడుకుంటాడని ఆరోపించారు.

You cannot copy content of this page