స్థానిక సమరంలో గెలిచేదెలా…
గులాభి శ్రేణుల తర్జనభర్జన
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ గులాభి శ్రేణులకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫీవర్ పట్టుకున్నట్టుగా ఉంది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయితే ప్రజల్లోకి వెల్లడం ఎలా అన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పొలిస్తే కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్న తీరు ద్వీతియ శ్రేణి నాయకులను కలవరపెడుతోంది.
ఆదర్శ జిల్లా…
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది కరీంనగర్ జిల్లా. అధినేత కేసీఆర్ స్వరాష్ట్ర కల సాకరం అయ్యేందుకు చేపట్టిన ప్రతి ఉద్యమాన్ని కూడా కరీంనగర్ నుండే ప్రారంభించారు. ఆయన అంచనాలకు తగ్గట్టుగా కరీంనగర్ వెన్నుదన్నుగా నిలిచింది కూడా. స్వరాష్ట్రం సిద్దించిన తరువాత కూడా అదే స్పూర్తిని నింపిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉద్యమ పార్టీకి జేజేలు పలికింది. అయితే ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కరీంనగర్ నాయకులు చేసిన తప్పిదాలు ఆ పార్టీని ఇప్పుడు వెంటాడుతున్నాయనే చెప్పాలి. ముఖ్య నేతల ఆశీస్సులతో ఇష్టారీతిన వ్యవహరించిన తీరువల్ల స్థానికంగా పార్టీపై వ్యతిరేకతను మూటగట్టుకున్నట్టయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కాలంలో భూ కబ్జా తదితర అంశాలకు సంబంధించిన కేసుల్లో ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారిపైనే కేసులు నమోదు కావడం నాయకత్వానికి తలనొప్పిగా తయారైందనే చెప్పాలి. కొంతమంది నాయకులు చేసిన తప్పిదాల ప్రభావం బీఆర్ఎస్ పై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తోంది. అరెస్ట్ అయిన వారిలో స్థానిక సంస్థలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారో వారి కుటుంబ సభ్యులో ఉండడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాష్ట్రంలో పార్టీలో అధికారంలో లేకపోవడం ఒక్కటే పార్టీకి మైనస్ పాయింట్ అయితే కరీంనగర్ లో మాత్రం పార్టీ స్థానిక నాయకులను వెంటాడుతున్న క్రిమినల్ కేసులు సవాల్ విసురుతున్నాయన్నది వాస్తవం. అంతేకాకుండా ఇటీవల కరీంనగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సేవకురాలు అయితే సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుని గురించి ఆరోపణలు చేస్తూ వైరల్ చేశారు. దీంతో మరోసారి బీఆర్ఎస్ నాయకుల ఆగడాలపై కరీంనగర్ లో చర్చనీయాంశంగా మారింది. తనకు జరిగిన అన్యాయం గురించి ఆ లీడర్ చేస్తున్న ద్రోహం గురించి ఆమె బాహాటంగా చేసిన ఆరోపణలు పార్టీ శ్రేణులను కలవరపెడుతున్నాయి. దీంతో ఆమె వాట్సప్ స్టేటస్ తొలగించాలని కోరుతూ బుజ్జగించేందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నెట్ వర్క్ పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న ప్రచారం నగరమంతా వినిపిస్తోంది.
నాట్ టు అరెస్టులు…
ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమను పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనన్న కలవరంతో ముందస్తుగా కోర్టులను ఆశ్రయించడం మొదలు పెట్టారు. పోలీసులు తమను ఫలానా కేసులో అరెస్ట్ చేయకుండా ఉండాలని హై కోర్టును ఆశ్రయించి నాట్ టు అరెస్ట్ ఆర్డర్లు తెచ్చుకున్నారు. ఐదారుగురు నాయకులు నాట్ టు అరెస్ట్ ఆర్డర్స్ తెప్పించుకుని తిరుగుతున్నారంటే వారు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అటు అరెస్టులు, ఇటు నాట్ టు అరెస్టు ఉత్తర్వుల నడుమ కొనసాగుతున్న తీరు వల్ల ప్రజల్లో పార్టీ అంటే ఒకరకమైన చులకన భావం ఏర్పడిందన్న ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల సమరానికి నోటిఫికేషన్ విడుదల అయితే ప్రజల నుండి తిరస్కరణ ఎదురయ్యే ప్రమాదం ఉంటుందన్న ఆవేదన వెల్లగక్కుతున్నారు కొందరు బీఆర్ఎస్ నాయకులు. మరో వైపున కరీంనగర్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్న క్రమంలోనే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చకచకా సెటిల్ మెంట్లు కూడా చేసుకున్నరని కూడా ప్రచారం జరిగింది. ఈ తప్పిదాల ప్రభావం ఒక్క కరీంనగరంలోనే కాకుండా సమీప గ్రామాల్లో కూడా పడే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.