వేధింపులు గురి చేస్తున్నారంటూ సర్పంచ్ ఆవేదన
దిశ దశ, జనగామ:
బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మరోసారి వివాదాలు చుట్టు ముడ్తున్నాయి. మహిళల వేదింపుల విషయంలో మరోసారి ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా మహిళా సర్పంచే తనకు వేధింపులు తప్పడం లేదంటూ మీడియా ముందు చెప్పుకోవడం సంచలనంగా మారింది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనను వేధింపుకు గురి చేస్తున్నారని సర్పంచ్ నవ్య ఆరోపించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కుర్సాపురం సర్పంచ్ గా పనిచేస్తున్నతనను రెండేళ్లుగా ఎమ్మెల్యే రాజయ్య వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనమాట వినకుంటే మీడియేటర్ల ద్వారా ఇబ్బందులు పెడుతున్నారని, ప్రలోభాలకు గురి చేస్తున్నారని కూడా నవ్య ఆరోపించారు. ఎమ్మెల్యే రాజయ్యలో మార్పు వస్తుందని ఇన్నాళ్లూ చూసినప్పటికీ ఫలితం రాకపోగా వేదింపులు తీవ్రం కావడంతో అందరికీ చెప్పుకోవల్సి వచ్చిందని వివరించారు. ఎమ్మెల్యే ఫోన్ కాల్స్ రికార్డులు కూడా ఉన్నాయని. సమయం వచ్చినప్పుడు అవి కూడా బయట పెడతానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటీఆర్ లు ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాను వేదింపులకు గురైన విషయాన్ని అధిష్టానానికి కూడా విన్నవిస్తానని సర్పంచ్ వివరించారు.