దిశ దశ, కరీంనగర్:
దశాబ్దాలుగా కలాన్ని నమ్ముకుని కాలం వెల్లదీస్తున్న కార్మికుల నెత్తిన శఠగోపం పెట్టేశారా..? జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇప్పించే ముసుగులో బినామీల పేర్లను చేర్చారా లేక నకిలీలకు అవకాశం కల్పించారా అన్న చర్చ సాగుతోంది కరీంనగర్ జర్నలిస్టుల్లో. ఊరించి ఊరించి చేతికి పట్లా కాగితాలు ఇప్పించనప్పటికీ చివరి క్షణంలో ఊసురుమనిపించారన్న వేదన జర్నలిస్టు సమాజంలో వ్యక్తం అవుతోంది. జిల్లా కేంద్రంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జర్నలిస్టులకు కెటాయించిన ప్లాట్లలో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ అంతా ప్రహసనంగా మారిందన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో జర్నలిస్టేతరులు పేర్లు ఉండడంతో సీనియర్ జర్నలిస్ట్ తాడూరు కరుణాకర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తమకు అన్యాయం జరిగిందని కొంతమంది జర్నలిస్టులు కోర్టును ఆశ్రయించారు. అయితే అప్పుడు కెటాయించిన ఈ ప్లాట్లను అనర్హులకు కెటాయించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నా దిద్దుబాటు చర్యలు మాత్రం చేపట్టకపోవడం విచిత్రంగా మారింది.
సంస్థలేం చేస్తున్నాయ్..?
సమాజాన్ని సంస్కరించే బాధ్యతలు తమ భూజాలపై వేసుకున్న నాలుగో స్తంభం అయిన మీడియా సంస్థలు అచేతనావస్థకు చేరాయా అన్న చర్చ కూడా సాగుతోంది. పత్రికల్లో పని చేయని వ్యక్తులకు భూమిని కెటాయించడమే ఓ తప్పిదం అయితే… సంస్థలో పనిచేయని వారు ఫలనా పేపర్లో రిపోర్టర్లంటూ జాబితాలో వివరించడం విస్మయానికి గురి చేస్తోంది. ఇద్దరు వ్యక్తుల పేరిట అలాట్ అయిన ప్లాట్ల విషయంలో సాక్షి దినపత్రిక నుండి ఎలాంటి స్పందన లేకపోవడం సరికొత్త చర్చకు దారి తీసింది. ఎన్నికలకు ముందు హడావుడిగా ఇచ్చిన ఈ ప్లాట్లలో 122, 123 సీరియల్ నంబర్లలో ఉన్న పేర్లు సాక్షి దినపత్రికలో పని చేస్తున్నట్టుగా జాబితాలో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదు అందుకున్న తరువాత రెవెన్యూ అధికారులు వీరిద్దరికి సాక్షి దినపత్రికతో ఏ మాత్రం సంబంధం లేదని నిర్దారించారు. అయినప్పటికీ సంస్థ ప్రతినిధులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించిన తీరు అందరినీ విస్మయపరుస్తోంది. అసలు సాక్షి పత్రికలో పని చేయకున్నా ఇద్దరు వ్యక్తులు ఆ సంస్థ పేరిట జర్నలిస్టు కోటాలో ప్లాట్లు తీసుకోవడం వెనకున్న ఆంతర్యం ఏంటన్నదే మిస్టరీగా మారింది. సాక్షితో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులు అదే సంస్థలో పనిచేస్తున్నట్టుగా ప్లాట్లు పొందినప్పటికీ ఈ విషయంలో సదరు సంస్థ మిన్నకుండి పోవడానికి కారణం ఏంటన్న చర్చ స్థానికంగా సాగుతోంది. కరీంనగర్ లో పని చేస్తున్న బ్యూరో ఇంఛార్జి, ఎడిషన్ ప్రతినిధులు కూడా ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేయకపోవడం ఏంటీ..? తమ సంస్థను అబాసుపాలు చేసే విధంగా సంబంధం లేని వ్యక్తులు ప్లాట్లు పొందడం వెనక అసలేం జరిగింది అన్న విషయాలపై సంస్థ యాజమాన్యం కూడా పట్టించుకోని వైఖరి అవలంభించడం కరీంనగర్ జర్నలిస్టులను విస్మయానికి గురి చేస్తోంది. సాధారణ వ్యక్తులు సంస్థ పేరు చెప్పుకుని ఏకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్నా కూడా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సాక్షి యాజమాన్యం ఫిర్యాదు చేయకపోవడం వెనక ఏదైనా మతలబు ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
మా కొడుపు కొడ్తారా..?
రిపోర్టర్లుగా, ఫోటో గ్రాఫర్లుగా, కెమెరా మెన్లుగా, నియోజకవర్గ ఇంఛార్జీలుగా పని చేస్తున్న తమకు ప్లాట్లు కెటాయించే విషయంలో లెక్కలు వేశారు కానీ… అసలు జర్నలిజంతోనే సంబంధం లేని వారిని జర్నలిస్టులని తప్పుడు సమాచారం ఇచ్చి ప్లాట్లు కెటాయించడం సరైంది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షి దినపత్రికను దిగజార్చే విధంగా సంబంధం లేని వ్యక్తులు ఆ సంస్థలో పని చేస్తున్నట్టుగా లాభోక్తులుగా మారి అసలైన జర్నలిస్టుల కడుపు కొట్టే విధంగా వ్యవహరించారని కరీంనగర్ కలం యోధులు మండిపడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులు ప్రముఖ దినపత్రిక పేరును వాడుకుని ప్లాట్లు తీసుకునేంత సాహసం చేయడం వెనక ఆ సంస్థలో పనిచేస్తున్న వారి హస్తం ఏమైనా ఉందా అన్న అనుమానాలూ వస్తున్నాయి. సంస్థల కోసం, సమాజం కోసం వార్తా సేకరణలో తలమునకలవుతున్న తమను విస్మరించి నకిలీలకు అవకాశం దక్కడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు స్థానిక జర్నలిస్టులు.