జర్నలిస్టుల ప్లాట్ల దందా… ఇదిగో ‘సాక్ష్యం’…

అంతర్మథనంలో  రిపోర్టర్లు…

దిశ దశ, వేములవాడ:

అధికారులను మేనేజ్ చేశారా..? లేక తప్పుడు సమాచారం ఇచ్చి పట్టాలు పొందారో తెలియదు కానీ అక్కడ జర్నలిస్టుల నివేశన స్థలాల కెటాయింపు ప్రక్రియ తీరు అందరిని విస్మయపరుస్తోంది. సంబంధం లేని ప్రాంతంలో ఓ జర్నలిస్టుకు నివేశన స్థలం కెటాయించినట్టుగా వెలుగులోకి వచ్చిన పట్టా నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో గతంలో జరిగిన జర్నలిస్టుల నివేశన స్థలాల కెటాయింపులోనూ అక్రమాలు జరిగాయా అన్న ఆందోళన మొదలైంది. స్థానికంగా పనిచేయని వారి పేరిట కూడా పట్టాలు ఎలా పుట్టుకొచ్చాయన్నదే వేములవాడ జర్నలిస్టులకు అంతు చిక్కకుండా పోతోంది. స్థానికంగా అర్హులైన వారు ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న వారికి వేములవాడ సమీపంలోని నాంపల్లి శివారులో ప్లాట్లు కెటాయించడం వెనక దాగి ఉన్న ఆంతర్యం ఏంటన్న చర్చ వేములవాడలో జోరుగా సాగుతోంది.

అదెలా సాధ్యం..?

వేములవాడ మండలంలో పని చేస్తున్న జర్నలిస్టులకు నివేశన స్థలాలు కెటాయిస్తూ 2018లో ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పుడు విడుదలైన జాబితాలో లేని వ్యక్తుల పేరిట పట్టా కాగితాలు పుట్టుకరావడం వెనక అసలేం జరిగి ఉంటుందన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి వేములవాడలో. గతంలో కరీంనగర్ జర్నలిస్టు కాలనీలో సొసైటీలో భూమి అలాట్ కాగా, గత ఎన్నికలకు ముందు ఇచ్చిన జాబితాలో కూడా సదరు జర్నలిస్టు పేరు ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన సదరు జర్నలిస్టుకు సంబంధించిన పట్టా 2018లోనే ఇచ్చినట్టుగా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఒకే వ్యక్తికి ప్రభుత్వ భూమిని పలుమార్లు కెటాయించడం వెనక జరిగిన తతంగం ఏంటి..? అతనికి రెవెన్యూ అధికారులు కూడా వత్తాసు పలకడం వెనుక మతలబు ఏంటన్నదే మిస్టరీగా మారింది. కనీసం ఆ జిల్లాలో్ పనిచేయని సమయంలో అతనికి ప్లాట్ ఎలా కెటాయించారు..? అసలు స్థానిక జర్నలిస్టులకు తెలియకంగా కొత్త పట్టాలు ఎలా జారీ అయ్యాయి అన్న విషయంపై జర్నలిస్టు వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. నాంపల్లి శివార్లలోని సర్వే నెంబర్ 391లో 33వ ప్లాటు ఎ వెంకట రమణా రావుకు కెటాయించినట్టుగా అతని ఫోటోతో కూడిన పట్టా కాగితం విడుదల కావడం సంచలనంగా మారింది. కొంతకాలం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రముఖ తెలుగు దినపత్రికల్లో ఒకదానికి ప్రాతినిథ్యం వహించిన రమణా రావు ఆ తరువాత వేరే జిల్లాకు బదిలీ అయ్యారు. అయితే ఆయనకు 2018లో వేములవాడతో సంబంధం లేకున్నా 180 చదరపు గజాల భూమిని కెటాయిస్తూ ఉత్తర్వులు విడుదల కావడం వెనక అసలేం జరిగింది అన్న విషయంపై స్థానిక జర్నలిస్టు సంఘాల నాయకులు దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. 2018లో వేములవాడ జర్నలిస్టులకు నివేశన స్థలాలకు పట్టాలు విడుదల చేసినప్పుడు 3 ప్లాట్లు మిగిలి ఉండగా అందులో తొలిసారి విడుదల చేసిన జాబితాలో లేని వారి పేరిట పట్టాలు పుట్టుకరావడం ఏంటన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదే సంస్థలో పని చేస్తున్న మరో జర్నలిస్టు స్థానికుడే అయినప్పటికీ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రిపోర్టర్ గా కొనసాగుతున్నారు. సిరిసిల్ల జర్నలిస్టులకు పట్టాలు ఇచ్చిన జాబితాలో సదరు జర్నలిస్టు ఆసరి మహేష్ కు అలాట్ అయిందని ప్రచారం జరుగుతోంది. అయితే అతనికి కూడా వేములవాడ నాంపల్లి శివార్లలో 180 చదరపు గజాల 1 నంబర్ ప్లాట్ అలాట్ చేయడంతో స్థానిక జర్నలిస్టులు మండిపడుతున్నారు. దశాబ్దాల కాలంగా ఇదే వృత్తిలో కొనసాగుతున్న వారికి, స్థానికంగా పని చేస్తున్న వారికి కాకుండా ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న జర్నలిస్టులకు పట్టాలు రావడం వెనక ఏదో  గూడ్ ఫుఠాణీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. నిబద్దతో కూడిన జర్నలిస్టులకు నివేశన స్థలాలు కెటాయించే విషయంలో మీనామేషాలు లెక్కిస్తున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ స్థానికేతరులైన జర్నలిస్టులకు మాత్రం దర్జాగా ప్లాట్లు అలాట్ చేస్తూ పట్లాలు జారీ కావడంపై విస్మయం వ్యక్తం అవుతోంది.

ప్రముఖ పత్రికలయితే…

ప్రముఖ పత్రికలయితే బారా ఖూనీ మాఫీ అన్నట్టుగా మారిపోయిందా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది జర్నలిస్టు వర్గాల నుండి. పెద్ద పెద్ద మీడియా సంస్థలు పెడుతున్న రెవెన్యూ, సర్క్యూలేషన్ టార్గెట్లను సాధించలేక వృత్తితో ఉన్న అనుభందాన్ని తెంచుకోలేక చిన్న పత్రికలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న వారిపట్ల వివక్ష చూపుతున్న అధికారులు బడా పేపర్లలో పని చేస్తున్న వారి పట్ల ప్రత్యేక మమకారం చూపిస్తున్న తీరే వేములవాడలో నివేశన స్థలాలు కెటాయించిన తీరు నిదర్శనంగా మారిపోయింది. అనర్హులైన నివేశన స్థలాల పట్టాలను రద్దు చేసి స్థానికంగా ఉన్న జర్నలిస్టులకు ఆ ప్లాట్లను అలాట్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. పెద్ద పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు సంబంధించిన ‘సాక్ష్యా’ధారాలు వెలుగులోకి వచ్చినందున యాజమాన్యం కూడా వాస్తవాలను గుర్తించి చర్యలు తీసుకుంటే బావుంటుందని లేనట్టయితే సంస్థలో ముసుగులో నిబంధనలను అతిక్రమించి ఇష్టానుసారంగా వ్యవహరించే ప్రమాదం కూడా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సంస్థలో పనిచేస్తున్న కొంతమంది పెద్ద తలల అండదండల కారణంగానే ఇలాంటి వారికి కొమ్ము కాస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఇలాంటి వారిని పెంచిపోషించినట్టయితే సంస్థలపై సమాజంలో చులకన భావం ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకత ఆయా సంస్థలపై కూడా ఉందని అంటున్న వారూ లేకపోలేదు.

You cannot copy content of this page