బలవన్మరణానికి అనుమతి ఇవ్వాలని వేడుకోలు
వారసత్వంగా సంక్రమించిన భూమిని కాపాడుకునేందుకు చివరకు ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకుంది. ఇందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను వేడుకున్న ఘటన సంచలనం కల్గిస్తోంది. తమ సొంత భూమిని కాపాడుకునేందుకు కారుణ్య మరణం కోసం అనుమతి ఇవ్వాలని ఈ మేరకు దరఖాస్తు చేసుకుంది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం శిఖర్ గన్ పల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మ భర్త ద్వారా వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే తన భర్త మరణించిన తర్వాత ఆ భూమిని అదే గ్రామానికి చెందిన నర్సింహస్వామి అనే వ్యక్తి బలవంతంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై జడ్చర్ల పోలీస్ స్టేషన్ చుట్టూ గత ఐదేళ్లుగా తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని వెంకటమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులుగా చెలామణి అవుతున్న వారే తన భూమిని కబ్జాకు పాల్పడ్డారని, పోలీసులు కూడా వారికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించింది.