దాదాపు రెట్టింపు అయిన రెవెన్యూ…
ఎక్సైజ్ కు పెరిగిన డిమాండ్
దిశ దశ, హైదరాబాద్:
తెలంగాణ సర్కార్ లిక్కర్ ను ముట్టుకుంటే చాలు… వేల కోట్ల రూపాయలు వరదలా వచ్చి చేరుతున్నాయి. గత సంవత్సరంతో పోలీస్తే దాదాపు రెట్టింపు అప్లికేషన్లు ఎక్సైజ్ విభాగానికి వచ్చి చేరాయి. శుక్రవారం చివరి రోజు కావడం… అందునా శ్రావణ మాసం కూడా రావడంతో మద్యం వ్యాపారులు పోటీ పడి మరీ దరఖాస్తులు ప్రవాహాన్ని నడిపించి సర్కారుకు ఆదాయంతో యమా కిక్కిచ్చేశారు. ఒకప్పుడు ఏడాదికి రెంటల్ పేరిట వచ్చే ఆదాయాన్ని మించి ఇప్పుడు కేవలం అప్లికేషన్ల ద్వారానే సర్కారు ఖజానాలో వచ్చి పడుతుండడం గమనార్హం. గతంలో కంటే ఈ సారి ఇతర రంగాల్లో ఉన్న వ్యాపారులు కూడా లిక్కర్ దందాలోకి ఎంట్రీ ఇవ్వడం వల్లే ఈ స్థాయిలో అప్లికేషన్లు వచ్చాయని అంచనా వేస్తున్నారు. మరో వైపున ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ, వచ్చే ఏడాది లోక సభతో పాటు మునిసిపల్, పంచాయతి రాజ్ ఎన్నికలు కూడా జరగనుండడంతో తమ వ్యాపారం మూడు బ్రాండ్లు… ఆరు నోట్ల కట్టలు అన్నట్టుగా సాగుతుందేమోనని భావించి వ్యాపారులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో ఒక్కో అప్లికేషన్ కు రూ. 50 వేలు అంటేనే జంకిన వ్యాపారులు ఇప్పుడు రూ. 2 లక్షలు నాన్ రిఫండబుల్ అన్న కండిషన్ పెట్టినా వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. 2021-23 సంవత్సరాలకు రాష్ట్రంలోని 2,620 దుకాణాలకు 68691 అప్లికేషన్లు రాగా, 2023-2025 సంవత్సరాల కోసం 1,31,490 దరఖాస్తులు రావడం గమనార్హం. అప్పుడు సర్కారుకు రూ. వెయ్యి 300 కోట్ల పై చిలుకు ఆదాయం అప్లికేషన్ల ద్వారా రాగా ఈ సారి 2వేల 600 కోట్ల పై చిలుకు రావడం గమనార్హం. నాన్ రిఫండబుల్ అమౌంటే ఈ స్థాయిలో సర్కారు ఖజానాలో పడిందంటే రెంటల్ కూడా గతం కంటే రెండు రెట్లకు పైగానే వచ్చే అవకాశం ఉంటుందన్న అంచనాలు మొదలయ్యాయి. దీంతో ఈ సారి కూడా తెలంగాణా సర్కారుకు లిక్కర్ అమ్మకాలతో భారీగానే ఆదాయాన్ని గడించనుంది.