ప్రభుత్వ కాలేజీలో ప్రైవేటు విద్యా సంస్థల ఛైర్మన్…

 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం ప్రచారం

దిశ దశ, కరీంనగర్:

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన అల్ఫోర్స్ విద్యా సంస్థల ఛైర్మన్ వి నరేందర్ రెడ్డి కార్యరంగంలోకి దూకారు. అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు. తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగానైనా సరే ఎమ్మెల్సీగా పోటీ చేసి తీరుతానని ప్రకటించిన మరునాడే ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టడం గమనార్హం. ఇందులో భాగంగా బుధవారం పలు ప్రభుత్వ కాలేజీలకు వెల్లి అక్కడి అధ్యాపక బృందాన్ని కలిసి తనకు మద్దతు ఇవ్వాలని నరేందర్ రెడ్డి కోరారు.

ఆ కాలేజీ నుండే…

తాను ఇంటర్మీడియెట్ చదువుకున్న సైన్స్ వింగ్ కాలేజీ నుండే తన ప్రచార పర్వంలో తొలి అడుగు వేశారు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. కొడిమ్యాలలో హైస్కూల్ విద్య పూర్తయిన తరువాత కరీంనగర్ సైన్స్ వింగ్ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు. ఇక్కడ చదువుకుని విద్యారంగంలో తనదైన ముద్ర వేసుకున్నానని భావించిన నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని కూడా అక్కడి నుండే ప్రారంభించారు. కరీంనగర్ సైన్స్ వింగ్, మానకొండూరు జూనియర్ కాలేజీ లెక్చరర్ల మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భాంగా వారితో ప్రత్యేకంగా భేటీ అయిన నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపులో భాగస్వామ్యం అందించాలని అభ్యర్థించారు. విద్యా వ్యవస్థ పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన తనకు అండగా నిలవాలని కోరారు.

You cannot copy content of this page