ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల అంశంపై మార్చి 28వ తేదీన విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ త్వరగా పూర్తి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మరోసారి చేసిన విజ్ఞప్తిని.. జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం తోసిపుచ్చింది. ఇది వరకు పేర్కొన్నట్లుగా మార్చి 28నే విచారణ చేపడతామని తేల్చి చెప్పింది. 28వ తేదీ ఒక్కటే సరిపోదని.. మార్చి 29, 30న కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు.
అమరావతి రాజధాని కేసు చాలా పెద్దదని.. కేసు విచారణ చేపడితే సార్థకత ఉండాలని జస్టిస్ కేఎం జోసెఫ్ వ్యాఖ్యానించారు. దీనిలో రాజ్యాంగపరమైన అంశాలు చాలా ఇమిడి ఉన్నాయని పేర్కొన్నారు. అంతకుమించి ఈ కేసులో ఇంకేమీ వ్యాఖ్యానించలేనని చెప్పారు. తమ విజ్ఞప్తిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా ధర్మాసనం నిరాకరించింది. అమరావతి కేసులను విచారణ జాబితాలో త్వరగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి గత సోమవారమే జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం మార్చి 28న విచారణ చేపడతామని వెల్లడించింది. మూడు రోజులు తిరగక ముందే మరోసారి కేసులు త్వరగా విచారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు.