దిశ దశ, జగిత్యాల:
తప్పడుగులు వేసే వయసుకు కూడా చేరలేదా చిన్నారి… తల్లి ఒడిలో సెద తీరుతూ నెలల వయసులో ఉన్న పసికందు అద్భుత ప్రతిభను చూపుతోంది… మంచంపై పడుకుని బోర్లా పడాలనే ప్రయత్నంమో లేక… తన కాలి వేళ్లతో ఆడుకుంటూ ఉండడానికే పరిమితం కావల్సిన ఆ చిన్నారి ప్రదర్శిస్తున్న తీరు ప్రత్యేకతను సంతరించుకుంది. తల్లి శిక్షణలో ఆ తనయ అన్న ప్రాసనకు ముందే అన్నింటిని గుర్తు పెట్టేస్తోంది. వివిధ రకాల బొమ్మలను ఆమెకు చూపిస్తూ అడిగుతున్న క్రమంలో ఐరా తల్లి అడిగిన బొమ్మను పట్టేసుకుంటోంది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిసేటి మహేందర్, మౌనిక దంపతుల పుత్రిక ఐరాలో ఉన్న జిజ్ఞాసను మూడునెలల ప్రాయంలోనే తల్లి గుర్తించింది. అప్పటి నుండి తన కూతురుకు వివిధ రకాల బొమ్మలను చూపిస్తూ వాటి గురించి వివరించడం మొదలు పెట్టింది. ఆ తల్లి ప్రయత్నం సఫలం కావడంతో కేవలం నాలుగు నెలల ప్రాయంలోనే 135 ఫ్లాష్ ఐడెంటిటి కార్డులను గుర్తు పట్టగలగుతోంది ఐరా. ఈ విషయాన్ని నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇవ్వడంతో సంస్థ ప్రతినిధులు ఐరాలోని ప్రతిభను గుర్తించారు. ఈ మేరకు పాప పేరును నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేయడంతో పాటు సర్టిఫికెట్, మెడల్ ప్రధానం చేశారు. ఐరా కూరగాయలు, వెజిటేబుల్స్, బర్డ్స్, ఎనిమల్స్, ఫ్లాగ్స్, కంట్రీస్ వంటి వాటిని రికగ్నైజ్ చేస్తుండడం విశేషం.