ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ మరో అడుగు ముందుకేసింది. డెలివరీ సేవలు మరింత త్వరగా అందించాలన్న సంకల్పంతో ఎయిర్ సర్వీసెస్ ప్రారంభించింది. అమెరికా, యూరప్ దేశాల తరువాత ఎయిర్ సర్వీసెస్ ఇండియాలో ప్రారంభించిన అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ‘‘అమెజాన్ ఎయిర్ సర్వీసెస్’’ ను లాంఛనంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వస్తువులను త్వరితగతిన డెలివరీ చేసేందుకు వీలవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. అమెజాన్ ఎయిర్ సేవలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ తదితర ప్రధాన నగరాలకు అందించనున్నట్టు వివరించింది. ఇందుకోసం అమెజాన్ ఇండియా బోయింగ్ 737, బోయింగ్ 800 కార్గో విమానాలను ఉపయోగించాలని నిర్ణయించింది. బెంగుళూరుకు చెందిన క్విక్‌జెట్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న అమెజాన్ నేటి నుండి ఎయిర్ సర్వీసెస్ ను స్టార్ట్ చేస్తోంది. ఈ-కామర్స్ సేవల కోసం ఓ కంపెనీ విమాన సేవలను చేపట్టడంతో మన దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2016లో అమెరికాలో ఎయిర్ సేవలను ప్రారంభించిన అమెజాన్ ఆ తరువాత యూకేలో, తాజాగా భారత్‌లో దీన్ని మొదలుపెట్టింది. అమెజాన్ ఎయిర్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డెలివరీ సేవలను సమర్థవంతంగా అందించగలమని, డెలివరీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు మరిన్ని పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని సంస్థ వివరించింది. మహానగరాల్లో అందనున్న వాయు సేవల వల్ల కొత్త పుంతలు తొక్కనుంది అమెజాన్ వ్యాపారం.




