ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని స్పష్టం చేసింది. తాజాగా కంపెనీలో జరిగిన సమావేశంలో అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ తన నిర్ణయాన్ని ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతించిన అమెజాన్ సంస్థ.. ఈ ఏడాది మే నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటూ వెల్లడించింది.
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను సడలించినప్పటికీ.. అమెజాన్ ఉద్యోగులు ఇంకా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. తమ ఉద్యోగులు ప్రధాన నగరాల్లోని కార్యాలయాలకు వస్తే తమ వ్యాపారానికి ప్రోత్సాహం లభిస్తుందని అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండీ జెస్సీ అమెజాన్ బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీసు నియమానికి మినహాయింపులు ఇస్తూ.. కస్టమర్ సపోర్ట్ రోల్స్, సేల్స్‌పీపుల్ రిమోట్‌గా పనిచేసే అవకాశం కల్పించారు.
ఈ ఏడాది జనవరిలో అమెజాన్ యునైటెడ్ స్టేట్స్, కెనడా, కోస్టా రికాలో ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్ తన సిబ్బందికి మెమోలో తెలిపింది. గత కొన్ని నెలలుగా తొలగింపులు, ఉద్యోగాల కోతలను ప్రకటించిన పలు టెక్ కంపెనీలలో అమెజాన్ ఒకటి.