అంబూలెన్స్ మాఫియాపై సరే… హస్పిటల్స్ మాటేమిటో..?

దిశ దశ, కరీంనగర్:

మంచిర్యాల జిల్లాలో అనారోగ్యం పాలయితే డాక్టర్ల కన్నా ఎక్కువగా అంబూలెన్స్ మాఫియానే ఆదిపత్యం చెలాయిస్తోంది. అద్దె ఇచ్చి మరి అంబూలెన్స్ ల్లో రోగులను తరలించే క్రమంలో వారే ఏ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలో అన్న విషయాన్ని నిర్ణయిస్తున్నారు. జిల్లాలో ఏర్పడిన అంబూలెన్స్ మాఫియాతో పెషెంట్ల తాలుకు బంధువులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో అంబూలెన్స్ వాలాలకు సంబంధించిన రెండు కేసులు కూడా నమోదయ్యాయి. అయితే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి హస్పిటల్స్ పై సరైన అవగాహన లేకపోవడాన్ని అనుకూలంగా మల్చుకుంటున్న అంబూలెన్స్ వాలాలు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఇలాంటి ఘటనలు సర్వ సాధారణంగా జరుగుతున్నప్పటికీ వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

హస్పిటల్స్ మాటేమిటో..?

మంచిర్యాల ప్రాంతం నుండి కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రులకు రోగులను రెఫర్ చేస్తున్న క్రమంలోనే ఈ రెండు ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. పేషెంట్లను తప్పుదోవ పట్టిస్తూ వారు చెప్పిన దవాఖానాలకు కాకుండా ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు అంబూలెన్స్ వాలాలు మొగ్గు చూపడానికి కారణం కమిషన్ల దందేనన్న విషయం తేటతెల్లం అయిపోయింది. ప్రైవేటు ఆసుపత్రుల యాజమన్యాలు కూడా అంబూలెన్స్ డ్రైవర్లకు కమిషన్లు ఇస్తున్నారని ఈ ఘటన తేల్చిచెప్పింది. యాక్సిడెంట్లో  మయూరి ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రేవెల్లి శ్రీకాంత్ యాక్సిడెంట్ అయిన తరువాత అతన్ని అదే హస్పిటల్ కు తీసుకెళ్లాలని అతన భార్య స్వప్న నిర్ణయించుకుంది. కానీ ఆపదలో ఉన్న పేషెంటును ఆసుపత్రికి తరలించే విషయాన్ని విస్మరించిన అంబూలెన్స్ వాలాలు మరో ఆసుపత్రి పేరు సూచించారని, వారు చేసిన ప్రతిపాదనలు తిరస్కరించినట్టు స్వప్న వివరించారు. తలకు బలమైన గాయం అయిన శ్రీకాంత్ ను భద్రకాళి న్యూరో ఆసుపత్రికి తరలించాలని మంచిర్యాల మయూరి ఆసుపత్రి డాక్టర్లు సూచించారని తన భర్తను అక్కడికే తీసుకెల్తానని స్వప్న అంబూలెన్స్ డ్రైవర్లతో స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ వారు వినకుండా మొదట సూర్య హస్పిటల్ పేరు చెప్పి ఆ తరువాత కెల్విన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ నెల 6వ తేది మద్యాహ్నం 3.30 గంటలకు కెల్విన్ ఆసుపత్రికి పెషెంట్ ను తీసుకెళ్లగా అక్కడ స్కానింగ్ చేసే మిషనరీ లేకపోవడంతో కృష్ణా డయాగ్నోస్టిక్స్ కు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి కెల్విన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు సీరియస్ కండిషన్ లో పేషెంట్ ఉన్నాడని హైదరాబాద్ కు తరలించాలని సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో సూచించారని మంచిర్యాల పోలీసులు వెల్లడించారు. కెల్విన్ ఆసుపత్రిలో రెసిడెంట్ న్యూరో సర్జన్ లేకున్నా శ్రీకాంత్ ను జాయిన్ చేసుకోవడం విచిత్రంగా మారింది. అం తే కాకుండా మంచిర్యాల మయూరి ఆసుపత్రి డాక్టర్లు భద్రకాళి న్యూరో ఆసుపత్రికి తరలించాలని సూచించినప్పుడు కెల్విన్ ఆసుపత్రి వర్గాలు శ్రీకాంత్ ను తమ దవాఖానాలో జాయిన్ చేసుకునేందుకు ఎందుకు సాహసించారన్నది కూడా అంతుచిక్కడం లేదు. ఒకవేళ అంబూలెన్స్ డ్రైవర్లు, కెల్విన్ ఆసుపత్రికి తీసుకెళ్లినా అడ్మిట్ చేసుకునేందుకు తిరస్కరించకపోవడానికి కారణాలూ అన్వేషించాల్సిన అవసరం ఉంది. తమ వద్ద న్యూరో స్పెషలిస్టు అందుబాటులో లేనప్పుడు కెల్విన్ ఆసుపత్రి డాక్టర్లు మరో ఆసుపత్రికి కానీ భద్రకాళి అసుపత్రికి కానీ తీసుకెళ్లాలని ఎందుకు సూచించలేదన్నది మిస్టరీగా మారింది. దాదాపు 3 గంటల పాటు ఈ ఆసుపత్రిలోనే శ్రీకాంత్ ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. మంచిర్యాల మయూరి ఆసుపత్రి డాక్టర్లు నిర్దారించిన తరువాత కూడా కెల్విన్ ఆసుపత్రి డాక్టర్లు తిరిగి అతనికి స్కానింగ్ తీయించడంతో పాటు చికిత్స అందించేందుకు చొరవ తీసుకోవడం గమనార్హం. అసలు స్పెషలిస్ట్ డాక్టర్ లేకుండా సీరియస్ కండిషన్ లో ఉన్న పేషెంటును ఆసుపత్రిలో చేర్పించుకోవడం అందరిని విస్మయపరుస్తోంది. స్పెషలిస్టు డాక్టర్లు… సూపర్ స్పెషాలిటీ దవాఖానాల పేరిట బోర్డులు ఏర్పాటు చేసుకుంటున్నా ప్రైవేటు వైద్యశాలల్లో సౌకర్యాలు ఎంతమేర ఉన్నాయి..? స్పెషలిస్టుల వివరాలను కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ పెషెంటును ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచిస్తే అక్కడి అంబూలెన్స్ డ్రైవర్ మరో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ విషయంపై సదరు పెషెంట్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అంబూలెన్స్ వాలాలు పేషెంటును త్వరితగతిన ఆసుపత్రికి తరలించేందుకు మాత్రమే చొరవ తీసుకోవల్సి ఉండగా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్న తీరే విడ్డూరంగా ఉంది. తాజాగా అంబూలెన్స్ డ్రైవర్లను అరెస్ట్ చేసిన సందర్భంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ… వైద్యులు మిడియేుటర్లను ప్రోత్సహించవద్దన్న సూచన కూడా చేశారు. అంబూలెన్స్ డ్రైవర్లు కమిషన్ కోసమే పేషెంట్లను ఫలనా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారని కూడా డీసీపీ వెల్లడించారు. అసలు అంబూలెన్స్ వాలాలకు ఆసుపత్రుల నిర్వాహకులు కమిషన్లు ఇచ్చేందుకు ఎందుకు సుముఖత చూపుతున్నారోనన్న విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అంబూలెన్స్ వాలాలు తమకు కమిషన్లు ఇవ్వాలని కోరినప్పుడు ఆసుపత్రి నిర్వాహకులు  తిరస్కరింంచికుండా ఈ సంస్కృతిని ఎందుకు పెంచి పోషిస్తున్నారోనన్నది కూడా తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచిర్యాల పోలీసులు అంబూలెన్స్ డ్రైవర్లపై నమోదు చేసిన రెండు కేసులు కూడా కరీంనగర్ ఆసుపత్రులతో లింక్ ఉన్నవే కావడం గమనించాల్సిన విషయం. కరీంనగర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఈ అంశంపై స్పెషల్ ఆఫరేషన్ చేపట్టాల్సిన అవసరం ఉంది. శ్రీకాంత్ ను జాయిన్ చేసిన కెల్విన్ ఆసుపత్రిలో అసలు న్యూరో స్పెషలిస్ట్ లేడని పోలీసులు విడుదల చేసిన ప్రకటన తేల్చి చెప్తున్న నేపథ్యంలో  చికిత్స పేరిట అతన్ని 3 గంటల పాటు తమ ఆసుపత్రిలోనే ఎందుకు అట్టిపెట్టుకున్నారన్న విషయాన్ని విస్మరించరాదు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న పేషెంటుకు అత్యంత కీలకమైన సమయాన్ని వృథా చేసినట్టేనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page