అమెరికా పాస్ పోర్ట్… తమిళనాడు ఆధార్ కార్డ్…

మహారాష్ట్ర అడవుల్లో నిర్భందం…

దిశ దశ, జాతీయం:

అమెరికా పాస్ పోర్టు ఉన్న ఓ మహిళ మహారాష్ట్ర అడవుల్లో నిర్భందానికి గురయ్యారు. ఆమె వద్ద ఉన్నఆధార్ అడ్రస్ మాత్రం తమిళనాడు రాష్ట్రానికి చెందినట్టుగా ఉంది. పాస్ పోర్టుకు, ఆధార్ అడ్రస్ కు పొంతన లేకుండా ముంబాయికి 450 కిలో మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు కట్టేసి ఉండడం ఏంటీ..? పజిల్ గా మారిన ఈ వ్యవహారంపై చర్చ సాగుతోంది.

మహారాష్ట్రలో…

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా అడవుల్లో మహారాష్ట్ర పోలీసులు ఆ మహిళను గుర్తించారు. అటవీ ప్రాంతంలో మహిళ అరుపులు విన్న గొర్రెల కాపరి ఆ ప్రాంత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి అడవుల్లో చెట్టు, పుట్టను వెతికారు. చివరకు ఓ ఎత్తైన చెట్టుకుకు బంధించిన ఆమెను గుర్తించారు పోలీసులు. ఇనుప గొలుసులతో కాళ్లను కట్టేసి పోయారు అగంతకులు. ఆహారం లేక… అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను విముక్తురాలిని చేసి సావంత్ వాడి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి నుండి సింధుదుర్గ్ లోని ఓరోస్ కు తీసుకెల్లి గోవా మెడికల్ కాలేజీకి తరలించినట్టుగా మహారాష్ట్ర పోలీసు అధికారులు తెలిపారు.

అచేతనావస్థలో…

అమెరికా పాస్ పోర్టు ఉన్న సదరు మహిళ పేరు లలితా కైగా ఆధారాలను బట్టి గుర్తించారు పోలీసులు. అయితే ఆమె అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నందున పూర్తి వివరాలు రాబట్టలేకపోయారు. ఆమె ఆరోగ్యం బాగయిన తరువాత ఆమె వాంగ్మూలం సేకరించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మానసిక స్థితి బాగాలేకపోవడంతో పాటు ఆహారం అందకపోవడంతో లలిత కై అచేతనావస్థకు చేరుకున్నారు. అయితే తాను 40 రోజులుగా ఆహారం లేకుండా ఉన్నానని పోలీసులకు ఓ పేపర్ పై బాధితురాలు రాసి ఇచ్చారు. కానీ సమగ్రంగా తెలుసుకోవాలంటే మాత్రం ఆమె పూర్తిగా కోలుకోవల్సి ఉంది.

భర్తపై అనుమానం..?

అయితే లలితా కైని ఆమె భర్తే అక్కడకు తీసుకొచ్చి కట్టేసి ఉంటాడని, మానసిక పరిస్థితి బాగాలేకపోవడం వల్లే వదిలించుకునే ప్రయత్నం చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆమెను వదిలించుకునేందుకు దట్టమైన అటవీ ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారన్నదే తేలాల్సి ఉంది. బాధితురాలు అమెరికా పాస్ పోర్టు ఉన్నప్పటికీ ఆధార్ కార్డును బట్టి అయితే అమె తమిళనాడు నివాసిగా గుర్తించారు. ఒక వేళ వీరు తమిళనాడుకు చెందిన వారే అయితే మహారాష్ట్రలోని సింధుదూర్గ్ అడవుల గురించి ఎలా తెలిసింది..? ముంబాయి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్టయితే ఇక్కడ వారు ఉపాధి ఎలా పొందుతున్నారో తెలుసుకోవల్సి ఉంది. ఒకవేళ ముంబాయి పరిసర ప్రాంతాల్లో సెటిల్ అయినట్టయితే అమెరికా సిటిజన్ అయిన ఆమె తమిళనాడు ఆధార్ కార్డును ముంబాయిలో నివాసం ఉంటున్న చోటకు బదిలీ చేయించుకునే అవకాశం ఉంటుంది కదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఒక వేళ ఆధార్ కార్టులో ఉన్న తమినాడులోనే నివసిస్తున్నట్టయితే సింధూదుర్గ్ అటవీ ప్రాంతం గురించి వారికెలా తెలిసే అవకాశం అయితే లేదన్నది నిజం. ఆమె భర్త ఎవరు..? కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకున్నట్టయితే లలితా కైకి సంబంధించిన సమాచారం దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఆమె అమెరికాకు చెందిన సిటిజన్ అయినట్టయితే ఇండియాలో ఆధార్ కార్డు ఇచ్చేందుకు నిబంధనలు వర్తిస్తాయా..? అన్న కోణంలో కూడా ఆరా తీయాల్సిన ఆవశ్యకత ఉంది.

40 రోజులుగా..?

అయితే బాధితురాలు చెప్తున్న సమాచారాన్ని బట్టి 40 రోజులుగా తాను ఆహారం తీసుకోలేదని స్ఫష్టం అవుతోంది. బాధితురాలికి కేవలం ఆహారం మాత్రమే అందక 40 రోజులు అవుతోందా లేక… ఆమెను ఆ అడవిలో వదిలేసి 40 రోజులు అవుతోందా అన్న విషయంపై కూడా క్లారిటీ రావల్సి ఉంది. పోలీసులు మాత్రం రెండు మూడు రోజుల క్రితం ఆమెను చెట్టుకు గొలుసులతో కట్టేశారని అనుకుంటున్నారు. అన్ని రోజులుగా అక్కడి అటవీ ప్రాంతంలో కట్టేసి ఉన్నట్టయితే ఆమె ఉనికి ఇంతకు ముందే బయటపడేది కదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరో వైపున లలితా కై మిస్సింగ్ కేసు ఎవరైనా నమోదు చేశారా..? ఏ పోలీస్ స్టేషన్ లో అయినా ఫిర్యాదు అందిందా అన్న కోణంలో కూడా ఆరా తీయాల్సిన అవసరం ఉంది. అయితే నిజంగానే ఆమె భర్త సింధూదుర్గ్ అడవుల్లో కట్టేసి వెల్లిపోయిన తరువాత నివాస ప్రాంతంలోని ఇరుగు పోరుగు వారికి భార్య ఆచూకి లేకుండా పోయిందని చెప్పాడా వేరే ఏదైనా కారణం చెప్పాడా అన్న వివరాలు కూడా తెలియాల్సి ఉంది. పాస్ పోర్టుకు, ఆధార్ కార్డుకు, ఆమె ఆచూకి దొరికిన అటవీ ప్రాంతానికి ఏ మాత్రం కూడా పొంతన లేకుండా ఉండడం వల్ల పోలీసులు ఆరా తీయడం కూడా కొంత ఇబ్బందికరంగానే మారిందని చెప్పవచ్చు. ఒక వేళ మొబైల్ టవర్స్ ఆధారంగా ఆరా తీసే ప్రయత్నం చేసినా ఆమె ఏ రోజున అక్కడ కట్టేశారోనన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా అనుమానిత నెంబర్లను ట్రేస్ చేసి విచారించే అవకాశం ఉంటుంది. మరో వైపున ఇక్కడి అటవీ ప్రాంతంలో నివాసాలు ఉన్నట్టయితే వారి నుండి కొంతమేర సమాచారం దొరకబట్టే అవకాశం ఉంటుంది. కానీ మహారాష్ట్ర పోలీసుల ముందు ఉన్న ఏకైక మార్గం మాత్రం బాధితురాలి వాంగ్మూలమే.

You cannot copy content of this page