అదానీ సంస్థపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అదానీ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొట్టిపారేశారు. బీజేపీ దాచడానికీ, భయపడానికి ఏమీ లేదని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున దీనిపై తానేమీ వ్యాఖ్యానించలేనని తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఓ జాతీయ మీడియా ఏజెన్సీకి అమిత్ షా ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని.. దీన్ని విచారిస్తున్నప్పుడు ఓ మంత్రిగా తాను స్పందించడం తగదని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో బీజేపీ దాచడానికి, భయపడటానికి ఏమీ లేదని తేల్చి చెప్పారు. గతంలో పెగాసస్ వ్యవహారం సమయంలోనూ కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలే చేసిందని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి దగ్గర ఆధారాలు ఉంటే నేరుగా కోర్టుకు వెళ్లొవచ్చని చెప్పారు. కోర్టులు తమ నియంత్రణలో ఉండవు కదా. కానీ, వారికి తెలిసింది ఒక్కటే అని గందరగోళం సృష్టించడం మాత్రమే అని అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని ఎద్దేవా చేశారు.
నగరాలు, ప్రాంతాలకు పేర్లు మారుస్తూ మొఘల్ సామ్రాజ్య చరిత్రను బీజేపీ తుడి చేయాలని చూస్తోందంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు అమిత్ షా గట్టిగా బదులిచ్చారు. చరిత్రలో ఎవరి సహకారాన్ని తుడిచేయాలని మేం కోరుకోవట్లేదు. పాత పేర్లు లేని ఒక్క నగరం పేరు కూడా మేం మార్చట్లేదు. కేవలం అంతకు ముందు పాత పేర్లు ఉన్నవాటివే మారుస్తున్నాం. మా ప్రభుత్వం అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుందని అమిత్ షా తెలిపారు.